Share News

T20 World Cup: టీమిండియా బస్ పరేడ్.. ముంబై బీచ్ వద్ద జనసునామీ

ABN , Publish Date - Jul 04 , 2024 | 06:42 PM

టీ20 వరల్డ్‌కప్‌లో విశ్వవిజేతగా అవతరించిన టీమిండియా భారత్‌కు తిరిగొచ్చిన విషయం తెలిసిందే. బెరిల్ హరికేన్ కారణంగా మూడు రోజుల పాటు బార్బడోస్‌లోనే చిక్కుకున్న..

T20 World Cup: టీమిండియా బస్ పరేడ్.. ముంబై బీచ్ వద్ద జనసునామీ
Mumbai Beach

టీ20 వరల్డ్‌కప్‌లో (T20 World Cup) విశ్వవిజేతగా అవతరించిన టీమిండియా (Team India) భారత్‌కు తిరిగొచ్చిన విషయం తెలిసిందే. బెరిల్ హరికేన్ కారణంగా మూడు రోజుల పాటు బార్బడోస్‌లోనే చిక్కుకున్న ఆటగాళ్లు.. ఎట్టకేలకు బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో గురువారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ వారికి అపూర్వ స్వాగతం లభించింది. చప్పట్లు, డప్పులతో వారిని అభిమానులు స్వాగతించారు. ఆపై ప్రధాని మోదీతోనూ ఆటగాళ్లు భేటీ అయ్యారు. 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించడం.. అది కూడా వరల్డ్‌కప్ కొట్టడంతో.. భారత ఆటగాళ్లకు ముంబైలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఘనంగా సిద్ధం చేశారు. ముందుగా రోడ్ షో నిర్వహించి.. ఆపై వాంఖడే స్టేడియంలో వారిని సన్మానించనున్నారు.


ఈ తరుణంలోనే.. భారతీయ ఆటగాళ్లను చూసేందుకు, వారిని అభినందించేందుకు ముంబై మరీన్ డ్రైవ్ బీచ్ వద్ద క్రికెట్ అభిమానులు తారాస్థాయిలో పోటెత్తారు. వందల్లో కాదు.. వేలల్లో కాదు.. లక్షల్లో ఫ్యాన్స్ అక్కడికి తరలివచ్చారు. ఆ దృశ్యాన్ని చూసేందుకు రెండు కళ్లు కూడా సరిపోవంటే నమ్మండి. ఒక యుద్ధం మీద పడిపోతే ఎలా ఉంటుందో.. ఆ స్థాయిలో జనాలు బీచ్ వద్దకు చేరుకున్నారు. ఈ దెబ్బకు అక్కడ భారీ ట్రాఫిక్ ఏర్పడింది. ఈ జనసందోహంలో కొద్దిసేపు ఆటగాళ్ల పరేడ్ కోసం ఏర్పాటు చేసిన బస్సు సైతం చిక్కుకుంది. దాంతో.. దాన్ని బయటకు తీసేందుకు నానాతంటాలు పడ్డారు. దీన్ని బట్టి అక్కడ జనాలు ఏ స్థాయిలో వచ్చారో మీరే అర్థం చేసుకోండి. బహుశా జనసునామీ అంటే ఇదేనేమో! భారతీయులకు క్రికెట్ అంటే ఎంత అభిమానమో.. ఈ దృశ్యం మరోసారి నిరూపించింది.


ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అక్కడ భారీ వర్షం పడుతోంది. మరోవైపు.. సముద్రపు అలలు భోరుమంటూ ఎగిసిపడుతున్నాయి. అయినా ఏమాత్రం బెదరకుండా.. జనాలు అక్కడే ఉన్నారు. వరల్డ్‌కప్ తీసుకురావాలన్న తమ కలని ఆటగాళ్లు సాకారం చేశారు కాబట్టి.. వారి కోసం ఎలాంటి కష్టాన్నైనా తట్టుకుంటామంటూ అక్కడే ఉన్నారు. వర్షం వస్తుందని ముందే గ్రహించిన కొందరు ఫ్యాన్స్.. తమతో పాటు గొడుగులు తెచ్చుకోవడం గమనార్హం. నిజంగా వీరి అభిమానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Updated Date - Jul 04 , 2024 | 06:52 PM