Share News

IND vs ENG: సచిన్, కోహ్లీ, రోహిత్ ఆల్‌టైమ్ రికార్డులను బద్దలుకొట్టిన జైస్వాల్

ABN , Publish Date - Mar 08 , 2024 | 09:10 AM

సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ దుమ్ములేపుతున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. బజ్‌బాల్ వ్యూహం అంటూ భారత్‌లో అడుగుపెట్టిన ఇంగ్లండ్‌కు అదే తరహా ఆట తీరుతో చుక్కలు చూపిస్తున్నాడు.

IND vs ENG: సచిన్, కోహ్లీ, రోహిత్ ఆల్‌టైమ్ రికార్డులను బద్దలుకొట్టిన జైస్వాల్

ధర్మశాల: సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) దుమ్ములేపుతున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. బజ్‌బాల్ వ్యూహం అంటూ భారత్‌లో అడుగుపెట్టిన ఇంగ్లండ్‌కు అదే తరహా ఆట తీరుతో చుక్కలు చూపిస్తున్నాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజ బ్యాటర్ల ఆల్‌టైమ్ రికార్డులను బద్దలుకొట్టాడు. తన పేరు మీద కొత్త రికార్డులను లిఖించుకున్నాడు. ఈ సిరీస్‌లో ప్రతి మ్యాచ్‌లో 50+ స్కోర్ సాధించాడు. ఇప్పటికే ముగిసిన 4 టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు సాధించిన జైస్వాల్ ఐదో టెస్టులోనూ 50+స్కోర్ సాధించాడు. గత టెస్టుల మాదిరిగానే ఐదో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లోనూ జైస్వాల్ వన్డే తరహా బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. 5 ఫోర్లు, 3 సిక్సులతో 58 బంతుల్లోనే 57 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అనేక రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు.


1. ఇంగ్లండ్‌తో ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా యశస్వీ జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో గతంలో 655 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ రికార్డును బద్దలుకొట్టాడు. ప్రస్తుతం జైస్వాల్ ఖాతాలో 713 పరుగులు ఉన్నాయి. అలాగే ఇంగ్లండ్‌తో ఒక టెస్టు సిరీస్‌లో 700 పరుగుల మార్కు అందుకున్న తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు.

2. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో ఒక సిరీస్‌లో 700 పరుగుల మార్కు అందుకున్న రెండో భారత బ్యాటర్‌గా జైస్వాల్ నిలిచాడు. 1970/71లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 774 పరుగులు చేసిన మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతానికి జైస్వాల్ ఖాతాలో 713 పరుగులున్నాయి. ఐదో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 62 పరుగులు చేస్తే సునీల్ గవాస్కర్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలుకొడతాడు.

3. ఈ సిరీస్‌లో జైస్వాల్ ఇప్పటివరకు 26 సిక్సులు కొట్టాడు. దీంతో ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో గతంలో 25 సిక్సుల చొప్పున కొట్టిన సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ రికార్డులను జైస్వాల్ బద్దలుకొట్టాడు.

4. టెస్టుల్లో తక్కువ ఇన్నింగ్స్‌ (16)ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన రెండో భారత బ్యాటర్‌గా జైస్వాల్‌. మాజీ క్రికెటర్ వినోద్‌ కాంబ్లీ (14) టాప్‌లో ఉన్నాడు. మొత్తంగా చూస్తే ఆరో బ్యాటర్‌గా నిలిచాడు. అయితే టెస్టు మ్యాచ్‌ల పరంగా జైస్వాల్ మొదటి స్థానంలో ఉన్నాడు. జైస్వాల్ 9 టెస్టుల్లోనే ఈ మార్కు అందుకున్నాడు. ఈ క్రమంలో 11 టెస్టుల్లో 1,000 పరుగులు చేసిన సునీల్ గవాస్కర్ రికార్డును జైస్వాల్ బద్దలుకొట్టాడు.

5. టెస్టుల్లో అత్యధిక సగటుతో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న రెండో భారత బ్యాటర్‌గా జైస్వాల్ నిలిచాడు. ఈ క్రమంలో 71 సగటుతో 1,000 పరుగులు చేసిన చటేశ్వర్ పుజారా రికార్డును సమం చేశాడు. 83 సగటుతో వెయ్యి పరుగులు చేసిన మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 08 , 2024 | 09:10 AM