Share News

MI vs RR: ముంబై నడ్డి విరిచిన బౌల్ట్.. రాజస్థాన్ ముందు సునాయస లక్ష్యం

ABN , Publish Date - Apr 01 , 2024 | 09:33 PM

ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు చెలరేగారు. ట్రెంట్ బౌల్ట్(3/22), యజుర్వేంద్ర చాహల్(3/11) నిప్పులు చెరిగే బంతులకు ముంబై బ్యాటర్ల వద్ద సమాధానమే లేకపోయింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ముందు ముంబై ఇండియన్స్ జట్టు 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.

MI vs RR: ముంబై నడ్డి విరిచిన బౌల్ట్.. రాజస్థాన్ ముందు సునాయస లక్ష్యం

ముంబై: ఐపీఎల్ 2024లో(IPL 2024) భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(Mumbai Indians vs Rajasthan Royals) బౌలర్లు చెలరేగారు. ట్రెంట్ బౌల్ట్(3/22), యజుర్వేంద్ర చాహల్(3/11) నిప్పులు చెరిగే బంతులకు ముంబై బ్యాటర్ల వద్ద సమాధానమే లేకపోయింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ముందు ముంబై ఇండియన్స్ జట్టు 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ముఖ్యంగా ఇన్నింగ్స్ ఆరంభంలోనే రాజస్థాన్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ (Trent Boult) నిప్పులు చెరిగే బంతులతో ముంబై టాపార్డర్‌ను వణికించాడు. బౌల్ట్ దెబ్బకు ఏకంగా ముగ్గురు ముంబై బ్యాటర్లు గోల్డెన్ డకౌట్ అయ్యారు. అనంతరం మిడిలార్డర్‌ను స్పిన్నర్ చాహల్ (Yuzvendra Chahal) దెబ్బకొట్టాడు. భాగస్వామ్యాన్ని విడదీయడంతోపాటు కీలక వికెట్లను పడగొట్టాడు. రాజస్థాన్ బౌలర్ల దెబ్బకు ముంబై జట్టులో హార్దిక్ పాండ్యా(34), తిలక్ వర్మ(32) మాత్రమే పర్వాలేదనిపించారు. మిగతా వారంతా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.


టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ను తొలి ఓవర్లోనే బౌల్ట్ దారుణంగా దెబ్బకొట్టాడు. తొలి ఓవర్‌లోనే ఐదు, ఆరో బంతికి రోహిత్ శర్మ, నమన్ ధీర్‌ను గోల్డెన్ డకౌట్లు చేశాడు. దీంతో ఒక్క పరుగుకే ముంబై 2 వికెట్లు కోల్పోయింది. ఆ వెంటనే తన రెండో ఓవర్ రెండో బంతికే మరో బ్యాటర్ డేవాల్డ్ బ్రెవిస్‌ను గోల్డెన్ డకౌట్ చేశాడు. దీంతో 14 పరుగులకే ముంబై 3 వికెట్లు కోల్పోయింది. ముగ్గురు బ్యాటర్లు కూడా గోల్డెన్ డకౌట్ అయ్యారు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ముగ్గురు టాప్ బ్యాటర్లు గోల్డెన్ డకౌట్ అయిన చెత్త రికార్డును ముంబై మూటగట్టుకుంది. నాలుగో ఓవర్‌లో ఓపెనర్ ఇషాన్ కిషన్‌(16)ను బర్గర్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 20 పరుగులకే టాప్ 4 వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో ముంబైని తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఆదుకున్నారు. ధాటిగా బ్యాటింగ్ చేసిన వీరిద్దరు నాలుగో వికెట్‌కు 36 బంతుల్లోనే 56 పరుగులు జోడించారు.

పరిస్థితి చూస్తుంటే తిలక్ వర్మతో కలిసి కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముంబైని కష్టాల్లో నుంచి గట్టెక్కిస్తాడేమో అనిపించింది. కానీ ఈ భాగస్వామ్యాన్ని 10వ ఓవర్‌లో స్పిన్నర్ పీయూష్ చావ్లా విడదీశాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన హార్దిక్ పాండ్యా బౌండరీ లైన్ వద్ద ఉన్న రోవ్‌మాన్ పావెల్‌కు దొరికిపోయాడు. 6 ఫోర్లతో 21 బంతుల్లో 34 పరుగులు చేశాడు. ఆ కాసేపటికే పీయూష్ చావ్లా(3)ను ఆవేష్ ఖాన్ పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే మరోసారి చెలరేగిన చాహల్ 2 సిక్సులతో 29 బంతుల్లో 32 పరుగులు చేసిన తిలక్ వర్మను పెవిలియన్ చేర్చాడు. దీంతో 95 పరుగులకే ముంబై 7 వికెట్లు కోల్పోయింది. అనంతరం టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ కలిసి ముంబై స్కోర్‌ను 100 పరుగులు దాటించారు. కానీ 17వ ఓవర్‌లో మరోసారి చెలరేగిన చాహల్.. గెరాల్డ్ కోయెట్జీ(3)ని ఔట్ చేశాడు. ఇక ముంబైకి గౌరవప్రదమైన స్కోర్ అందించే ప్రయత్నం చేస్తున్న టిమ్ డేవిడ్(17)ను 19వ ఓవర్‌లో బర్గ్ పెవిలియన్ చేర్చాడు. ఆవేష్ ఖాన్ వేసిన చివరి ఓవర్లో 10 పరుగులు రావడంతో ముంబై స్కోర్ 120 దాటింది. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, చాహల్ మూడేసి వికెట్లతో చెలరేగారు. బర్గర్ 2, ఆవేష్ ఖాన్ ఒక వికెట్ తీశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IPL 2024: ముంబైతో మ్యాచ్‌లో చరిత్ర సృష్టించనున్న అశ్విన్.. ఆ రికార్డు సాధించిన తొలి బౌలర్‌గా..

IPL 2024: ఐపీఎల్‌లో ఆ రోజు జరగాల్సిన బిగ్ మ్యాచ్‌పై నీలి నీడలు.. ఎందుకంటే..

Updated Date - Apr 01 , 2024 | 09:58 PM