IPL 2024: సన్‌రైజర్స్‌కు భారీ దెబ్బ.. టోర్నీ మొత్తానికి స్టార్ ఆటగాడు దూరం
ABN , Publish Date - Mar 31 , 2024 | 03:35 PM
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సన్‌రైజర్స్ స్టార్ ఆల్‌రౌండర్, శ్రీలంక ఆటగాడు వనిందు హసరంగ ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ప్రస్తుతం ఎడమ కాలి మడమ (చీలమండ) గాయంతో హసరంగ బాధపడుతున్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సన్‌రైజర్స్ స్టార్ ఆల్‌రౌండర్, శ్రీలంక ఆటగాడు వనిందు హసరంగ( Wanindu Hasaranga) ఐపీఎల్ 2024 (IPL 2024) సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ప్రస్తుతం ఎడమ కాలి మడమ (చీలమండ) గాయంతో హసరంగ బాధపడుతున్నాడు. ఆ కారణంగానే జాతీయ జట్టుకు కూడా దూరంగా ఉంటున్నాడు. అయితే త్వరలోనే కోలుకుని ఐపీఎల్‌లో ఆడతాడని అంతా భావించారు. కానీ ప్రస్తుతం ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి హసరంగా దూరమయ్యాడని పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. శ్రీలంక క్రికెట్ బోర్డు సీఈఓ ఆష్టే డి సిల్వా కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. సండే టైమ్స్ అనే వార్తా పత్రికతో మాట్లాడుతూ.. ‘‘పాడియాట్రిస్ట్‌ను కలిసిన తర్వాత హసరంగ కోలుకోవడానికి మరింత సమయం అవసరమని తేలింది. దీంతో అతను ఈ ఐపీఎల్‌లో పాల్గొనడం లేదు. హసరంగ కాలి మడమలో వాపు ఉంది. ప్రస్తుతానికి దానికి అతను ఇంజెక్షన్లు వాడుతున్నాడు. కాబట్టి టీ20 ప్రపంచకప్‌నకు ముందే పూర్తిగా కోలుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం ఐపీఎల్‌కు దూరంగా ఉండాలనే తన నిర్ణయాన్ని మాకు తెలియచేశాడు.’’ అని డి సిల్వా తెలిపాడు.
నిజానికి ఇటీవల హసరంగ మేనేజర్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ అతను త్వరలోనే సన్‌రైజర్స్ శిబిరంలో చేరతాడని చెప్పాడు. కాగా ఐపీఎల్ వేలంలో హసరంగను సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ రూ.10.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. స్పిన్ ఆల్ రౌండరైన హసరంగ ప్రస్తుతం శ్రీలంక జట్టు టీ20 కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంకను హసరంగనే నడిపించనున్నాడు. ఈ క్రమంలోనే హసరంగ విషయంలో శ్రీలంక క్రికెట్ బోర్డు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన వన్డే, టీ20 సిరీస్‌ల్లో హసరంగ ఆడాడు. తర్వాత తన టెస్ట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని టెస్టు జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. కానీ పలు కారణాలతో హసరంగపై ఐసీసీ రెండు టెస్టుల నిషేధం విధించింది. ఏది ఏమైనా హసరంగ ఐపీఎల్‌కు దూరం కావడం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పెద్ద దెబ్బగానే చెప్పుకోవాలి. కాగా ఐపీఎల్‌లో ఇప్పటివరకు 26 మ్యాచ్‌లాడిన 26 ఏళ్ల హసరంగ 35 వికెట్లు తీశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
SRH vs GT: టాస్ గెలిచిన సన్‌రైజర్స్.. తుది జట్లు ఇవే!
IPL 2024: మైలురాయిని చేరుకున్న ఆర్సీబీ.. ఐపీఎల్ చరిత్రలోనే రెండో జట్టుగా..