Share News

Hyderabad: కేబినెట్‌ భేటీకి అనుమతి కోసం..మంత్రులంతా ఢిల్లీకి..

ABN , Publish Date - May 19 , 2024 | 04:31 AM

రాష్ట్రంలో సత్వరం పరిష్కరించాల్సిన సమస్యల గురించి చర్చించేందుకు మంత్రివర్గ సమావేశం నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించక పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. కాళేశ్వరం తదితర కీలక అంశాలపై చర్చించేందుకు ఈసీ అనుమతిస్తుందన్న నమ్మకంతో శనివారం మధ్యాహ్నం నుంచి సచివాలయంలో ఎదురు చూసిన రాష్ట్ర మంత్రులకు చివరకు నిరాశే ఎదురైంది.

Hyderabad: కేబినెట్‌ భేటీకి అనుమతి కోసం..మంత్రులంతా ఢిల్లీకి..

  • ఎన్నికల సంఘాన్ని కలవాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం

  • ఈసీ అనుమతి లేక శనివారం ఆగిన సమావేశం

  • రోజంతా సచివాలయంలో మంత్రుల నిరీక్షణ

  • రాత్రి వరకు ఈసీ స్పందించకపోవడంతో ఇంటికి

  • సోమవారమూ ఎదురుచూసి.. తర్వాత చలో ఢిల్లీ

  • రైతు సంక్షేమం, కీలకాంశాలపై చర్చించాలనుకున్నాం

  • నిర్ణయాలు తీసుకుంటామని చెప్పలేదు: సీఎం

హైదరాబాద్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సత్వరం పరిష్కరించాల్సిన సమస్యల గురించి చర్చించేందుకు మంత్రివర్గ సమావేశం నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించక పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. కాళేశ్వరం తదితర కీలక అంశాలపై చర్చించేందుకు ఈసీ అనుమతిస్తుందన్న నమ్మకంతో శనివారం మధ్యాహ్నం నుంచి సచివాలయంలో ఎదురు చూసిన రాష్ట్ర మంత్రులకు చివరకు నిరాశే ఎదురైంది. దాంతో మంత్రివర్గ సమావేశం నిర్వహించకుండానే రాత్రి 7 గంటలకు వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో సోమవారం వరకు ఎన్నికల సంఘం అనుమతి కోసం ఎదురు చూస్తామని, అప్పటికీ అనుమతి రాకపోతే మంత్రివర్గమే ఢిల్లీకి వెళ్లి ఈసీని కలుస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారమే వెళ్తారా? అన్న విషయం స్పష్టం చేయలేదు. తెలంగాణలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అనుమతి కోరామని రేవంత్‌ వెల్లడించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 7 గంటల వరకు సచివాలయంలో వేచి చూసినా అనుమతి రాకపోవడంతో వెను దిరిగామని చెప్పారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న తరుణంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని ఎక్కడా చెప్పలేదన్నారు.


రైతు సంక్షేమం, రుణ మాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్‌ పంట ప్రణాళిక, నిధుల సమీకరణ, విభజన సమస్యలు, జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వంటి అంశాలపై మంత్రివర్గంలో చర్చించాలనుకున్నామని వెల్లడించారు. ఎన్నికల సంఘం అనుమతించక పోవడంతో ముఖ్యమైన సమస్యలపై ఏం చేయాలనే విషయమై చర్చించే అవకాశం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలని పోలింగ్‌ మర్నాడే సీఎం రేవంత్‌ నిర్ణయించారు. దేశవ్యాప్త లోక్‌సభ ఎన్నికలతోపాటు శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఈ సమావేశానికి అనుమతి కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. శనివారం రాత్రి వరకు ఈసీ నుంచి ఎలాంటి అనుమతీ రాకపోవడంతో అధికారికంగా మంత్రివర్గ సమావేశం నిర్వహించలేదు. ఈసీ నుంచి ఏ క్షణమైనా అనుమతి వస్తుందని మంత్రులందరూ శనివారం మధ్యాహ్నమే సచివాలయానికి వచ్చారు.


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉన్నారు. రైతు రుణ మాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్‌ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన ఇతర పలు కీలకమైన విషయాలపై మంత్రివర్గంలో చర్చించాలని ఎజెండాను సిద్ధం చేశారు. ఎన్నికల సంఘం నుంచి స్పందన లేకపోవటంతో అత్యవసరమైన అంశాలపై చర్చించలేక పోయామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం ఉందని, వేడుకల నిర్వహణతో పాటు పెండింగ్‌లో ఉన్న పునర్విభజన అంశాలపై మంత్రివర్గంలో చర్చించాలని భావించామని సీఎం చెప్పారు. సమావేశం వాయిదా పడటంతో చర్చించలేక పోయామన్నారు. ఈసీ నుంచి అనుమతి ఎప్పుడు వస్తే అప్పుడే మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. సోమవారం కూడా అనుమతి రాకపోతే మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లి, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని ప్రకటించారు.

Updated Date - May 19 , 2024 | 04:31 AM