Share News

Bhatti Vikramarka: సింగరేణిని బతికించుకుందాం

ABN , Publish Date - Oct 08 , 2024 | 04:18 AM

ప్రస్తుత పోటీ ప్రపంచంలో వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెబుతూ ‘సింగరేణిని బతికిద్దాం.. మనం బతుకుదాం’ అని ఆ సంస్థ కార్మికులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

Bhatti Vikramarka: సింగరేణిని బతికించుకుందాం

  • 11న కార్మికులకు విందు ఏర్పాటు చేసి సంస్థ వాస్తవ స్థితిగతుల వివరణ

  • కోల్‌బెల్ట్‌ పరిధిలోని ప్రతి నియోజక వర్గంలో సమీకృత గురుకులాలు

  • మాజీ కార్మికులకు పెన్షన్‌ పెంపుపై కమిటీ

  • వైద్య చికిత్స సీలింగ్‌ 10లక్షలకు పెంపు: భట్టి

  • ఇళ్లపై త్వరలో తీపికబురు: పొంగులేటి

  • ఎన్నికల్లో హామీ మేరకు సింగరేణిలో మార్పు కనిపిస్తోంది: శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, కొత్తగూడెం, అక్ట్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత పోటీ ప్రపంచంలో వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెబుతూ ‘సింగరేణిని బతికిద్దాం.. మనం బతుకుదాం’ అని ఆ సంస్థ కార్మికులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రభుత్వరంగ సంస్థలను బతికించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా రూ.400 కోట్లను నెలనెలా అందిస్తూ ఆర్టీసీకి బతికించుకుంటున్నామని చెప్పారు. సింగరేణి సంస్థను నిలబెట్టి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. దసరా సందర్భంగా ఈనెల 11న ప్రతి బొగ్గుబావి దగ్గర సింగరేణి కార్మికులకు విందు ఏర్పాటు చేసి, సంస్థ వాస్తవిక స్థితిగతులు వివరించి, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించాలని అధికారులను ఆదేశించారు.


సోమవారం ప్రజాభవన్‌లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా రూ.796 కోట్ల చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా భట్టి, విశిష్ట అతిథులుగా మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడారు. సింగరేణి లాభాల్లో వాటా కింద ఒక్కో కార్మికుడికి రూ.1.9 లక్షలు, దీపావళి బోనస్‌ కింద రూ.93,750, దసరా పండుగ అడ్వాన్స్‌ కింద రూ.25 వేల చొప్పున అందించనున్నామన్నారు. లాభాల్లో వాటా, దసరా, దీపావళి బోనస్‌ కలిపి ఈ నెలలో రూ.1,261 కోట్లను కార్మికులకు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. తాడిచర్ల బొగ్గు గని సింగరేణికి కేటాయించాలని కోరామని, కోల్‌బెల్ట్‌లో ఒక్క గని బయటి వ్యక్తుల చేతికి వెళ్లకుండా అడ్డుకుంటామన్నారు.


యంగ్‌ ఇండియా సమీకృత గురుకులాలు ప్రయోగాత్మకంగా కోల్‌బెల్ట్‌లోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. సింగరేణి మాజీ కార్మికులకు పింఛను పెంపుపై కమిటీ వేసి, సాధ్యసాధ్యాలపై చర్చించి, నిర్ణయం తీసుకుంటామన్నారు. వైద్య చికిత్స సీలింగ్‌ రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా పెంచుతున్నామన్నారు. అనంతరం పొంగులేటి మాట్లాడారు. కోల్‌బెల్ట్‌లో కార్మికులతో పాటు స్థానికులకు ఆధునిక విద్య, వైద్యం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇళ్లకు సంబంధించి కార్మికులకు త్వరలో తీపి కబురు చెబుతామన్నారు. అనంతరం శ్రీధర్‌ బాబు మాట్లాడారు. ఎన్నికల కంటే ముందు ప్రతి వ్యవస్థలో మార్పు చూపిస్తామన్నామని ప్రకటించామని, ఆ మార్పు సింగరేణిలో కనిపిస్తోందన్నారు.


కాగా సింగరేణి సమస్యలు పరిష్కరించాలని కోల్‌బెల్ట్‌ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. కనీస వేతనాల అమలు కోసం జీవో నంబరు 22ను అమలు చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రామగుండం ఎమ్మెల్యే మఖన్‌సింగ్‌ ఠాకూర్‌ విజ్ఙప్తి చేశారు. ఉద్యోగ నియామకాల్లో ఎమ్మెల్యేలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే జి.వినోద్‌, కాంట్రాక్ట్‌ కార్మికుల వేతనాలు పెంచాలని చెన్నూరు ఎమ్మెల్యే జి.వివేక్‌ కోరారు. సింగరేణిలో నెలకు రూ.18 వేల లోపు పింఛన్‌ అందుకునే మాజీ కార్మికులు 90 శాతం మంది దాకా ఉన్నారని, శ్రీరాంపూర్‌లో 2500 ఎకరాల భూమిపై యాజమాన్య హక్కులను సాగుచేసుకుంటునవారికి ఇవ్వాలని మంచిర్యాల ఎమ్మెల్యే కె.ప్రేమ్‌సాగర్‌రావు డిమాండ్‌ చేశారు.


  • ఏడేళ్లకు సరిపడా విద్యుత్తు డిమాండ్‌కు తగ్గట్లుగా ప్రణాళికలు

రానున్న ఏడేళ్లకు సరిపడా విద్యుత్తు డిమాండ్‌ను తీర్చడానికి వీలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ప్రస్తుతం 15,700 మెగావాట్లుగా ఉన్న పీక్‌ డిమాండ్‌... రానున్న ఏడేళ్లకు 27వేల మెగావాట్లకు చేరనుందన్నారు. దీనికోసం అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్దేశించారు. సోమవారం సచివాలయంలో ట్రాన్స్‌కోపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ట్రాన్స్‌కో సబ్‌ స్టేషన్ల నిర్మాణ పనులను నిర్ణీత వ్యవధిలోగా పూర్తిచేయాలన్నారు. ట్రాన్స్‌మిషన్‌ రంగంలో ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకోవడానికి వీలుగా రిసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి, దీనిపై అధికారులకు తగిన శిక్షణ అందించాలన్నారు.

Updated Date - Oct 08 , 2024 | 04:18 AM