Share News

Bhatti: 7 కిలోమీటర్లు నడిచి స్కూల్‌కు వెళ్లే వాళ్లం

ABN , Publish Date - Oct 12 , 2024 | 03:08 AM

చిన్నతనంలో తన స్వగ్రామమైన లక్ష్మీపురం నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు నడుచుకుంటూ వెళ్లి చదువుకున్నానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

Bhatti: 7 కిలోమీటర్లు నడిచి  స్కూల్‌కు వెళ్లే వాళ్లం

  • ఆ పరిస్థితి నేటి తరానికి రావొద్దనే సమీకృత గురుకులాలు

  • లక్ష్మీపురం సభలో భట్టి విక్రమార్క భావోద్వేగం

  • యువతను నంబర్‌-1గా తీర్చిదిద్దుతాం: తుమ్మల

  • విద్య, వైద్య రంగాలకు పెద్ద పీట: పొంగులేటి

  • కేసీఆర్‌కు మళ్లీ అధికారం... కల్లే: కోమటిరెడ్డి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): చిన్నతనంలో తన స్వగ్రామమైన లక్ష్మీపురం నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు నడుచుకుంటూ వెళ్లి చదువుకున్నానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. నిత్యం వాగులు, వంకలు, గుట్టలు దాటుకుంటూ వెళ్లే వాడినని గుర్తు చేసుకున్నారు. ‘‘మా అమ్మ నాకు స్నానం చేయించి, బట్టలు వేసి, తల దువ్వి పాఠశాలకు పంపించి.. తిరిగి వచ్చే వరకు నా బిడ్డ ఎట్ల వస్తాడో, ఏమైన ప్రమాదాలు జరుగుతాయో? ఏమో? అని ఆందోళన చెందేది’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. తనలాగే సీఎం రేవంత్‌రెడ్డి కూడా తన స్వగ్రామంలో సౌకర్యాలు లేక ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకున్నారని తెలిపారు.


అలాంటి పరిస్థితి నేటి తరం విద్యార్థులకు రాకూడదనే ఒకే సారి 28 సమీకృత గురుకులాలకు శ్రీకారం చుట్టామన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని లక్ష్మీపురం పరిధిలో నిర్మించనున్న సమీకృత గురుకుల భవనాలకు భట్టి విక్రమార్క భూమిపూజ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికల్లా సమీకృత గురుకులాల్లో తరగతులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణ యువతను నంబర్‌-1 స్థానంలో నిలబెట్టాలన్న లక్ష్యంతో ఒకే రోజు 28 సమీకృత


గురుకులాలకు శంకుస్థాపనలు చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకలతండాలో సమీకృత గురుకుల భవనానికి శంకుస్థాపన చేసి, ఆయన మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందులున్నా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, విద్యా వ్యవస్థను పటిష్ఠం చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. విద్యార్థులు చక్కగా చదువుకుని.. తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని పిలుపునిచ్చారు. విద్యా, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం రూరల్‌ మండలం పొన్నేకల్లులో సమీకృత గురుకుల భవానినికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 28 పాఠశాలల భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు జరుగుతున్నాయన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే విధంగా సమీకృత గురుకుల పాఠశాలలు ఉంటాయన్నారు. పదేళ్ల పాలనలో రూ.7లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్‌ను ప్రజలు ఇకపై నమ్మరని, ఆ కుటుంబానికి అధికారం కల్లేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.


నల్లగొండలో సమీకృత గురుకులానికి శంకుస్థాపన అనంతరం ఆయన మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేల పిల్లలతో సమానంగా పేద పిల్లలకు ఈ స్కూళ్ల ద్వారా నాణ్యమైన విద్య అందిస్తామని ప్రకటించారు. ములుగులో త్వరలో ఐటీ కంపెనీ ఏర్పాటు కానుందని మంత్రి ధనసరి సీతక్క తెలిపారు. ములుగు జిల్లాలోని ఇంచర్ల వద్ద యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌కు ఆమె శంకుస్థాపన చేశారు. కుల, మత, వర్గ తేడా లేకుండా ఈ గురుకులాల ద్వారా ఉచిత విద్యను అందిస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. పెద్దపల్లి జిల్లా అడవిసోమన్‌పల్లిలో గురుకులానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ స్కూళ్లలో 4 నుంచి 12వ తరగతి వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధన జరుగుతుందన్నారు. కాగా, కొడంగల్‌లో పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గురునాథ్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో సమీకృత గురుకులానికి శంకుస్థాపన చేశారు.

Updated Date - Oct 12 , 2024 | 03:08 AM