Share News

Kaleshwaram Project: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి ఇవ్వాలి

ABN , Publish Date - Jul 13 , 2024 | 04:32 AM

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులను తక్షణమే సీబీఐకి అప్పగించాలని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. విద్యుత్తు కొనుగోలు అంశంలో జ్యుడీషియల్‌ కమిషన్‌ దర్యాప్తును వేగవంతం చేయాలని పేర్కొంది.

Kaleshwaram Project: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి ఇవ్వాలి

  • కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసు కూడా..

  • బీజేపీ రాష్ట్రస్థాయి విస్తృత కార్యవర్గ

  • సమావేశంలో 15 అంశాలతో తీర్మానం

  • రుణమాఫీని వెంటనే అమలు చేయాలి

  • 15 అంశాలతో బీజేపీ రాజకీయ తీర్మానం

హైదరాబాద్‌/రంగారెడ్డి అర్బన్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులను తక్షణమే సీబీఐకి అప్పగించాలని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. విద్యుత్తు కొనుగోలు అంశంలో జ్యుడీషియల్‌ కమిషన్‌ దర్యాప్తును వేగవంతం చేయాలని పేర్కొంది. రుణమాఫీ వెంటనే అమలు చేయాలంది. రైతుభరోసా కింద రైతులకు రూ.15 వేలు అందించాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు 15 అంశాలతో రూపొందించిన రాజకీయ తీర్మానాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆమోదించింది.


ఈ తీర్మానాన్ని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రవేశపెట్టగా, ఎంపీలు ఈటల రాజేందర్‌, ధర్మపురి అరవింద్‌, రఘునందన్‌రావు బలపరిచారు. ‘విద్యార్థి, యువ వికాసం గ్యారెంటీలను అమలు చేసి ప్రోత్సాహకం అందించాలి. శాంతి భద్రతలను కాపాడాలి. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించాలి. ధరణిని ప్రక్షాళన చేయాలి. ధాన్యం కొనుగోలుకు రూ.500 బోనస్‌ ఇవ్వాలి. గొర్రెల స్కాంలో అవినీతిపరులకు శిక్ష పడేలా చర్యలు చేపట్టాలి. ఇసుక, గ్రానైట్‌, డ్రగ్స్‌, లిక్కర్‌ మాఫియాలపై సమగ్ర దర్యాప్తు చేయాలి. రేషన్‌ కార్డులు వెంటనే ఇవ్వాలి. ఆయుష్మాన్‌ భారత్‌ అమలు చేయాలి. ఫీజు రీఇంబర్స్‌మెంటు నిధులు వెంటనే విడుదల చేయాలి’ అని బీజేపీ తీర్మానంలో డిమాండ్‌ చేసింది.


హామీలపై రేవంత్‌ది రోజుకో మాట: ఏలేటి

సీఎం రేవంత్‌ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకుండా రోజుకో మాట చెబుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో రైతులు వ్యవసాయ పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటుతున్నా రైతు భరోసా ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని ధ్వజమెత్తారు. ధరణిని ప్రక్షాళన చేస్తామని, అక్రమాలపై విచారణ చేస్తామన్న కాంగ్రెస్‌ పార్టీ.. ఎందుకు జాప్యం చేస్తోందని నిలదీశారు. కాగా, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై చర్చించారు.

Updated Date - Jul 13 , 2024 | 04:32 AM