Ban on KCR: నిషేధంపై కేసీఆర్ ఫస్ట్ రియాక్షన్.. ఏమన్నారంటే..
ABN , Publish Date - May 01 , 2024 | 09:26 PM
Lok Sabha Polls: తాను ఎన్నికల ప్రచారం చేయడాన్ని నిషేధం విధించడంపై బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR) స్పందించారు. ఎన్నికల కమిషన్(Election Commission) 48 గంటలు తన ప్రచారాన్ని నిషేదించిందని.. లక్షలాదిగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు 96 గంటలు అవిశ్రాంతంగా పని చేస్తారని అన్నారు.
Lok Sabha Polls: తాను ఎన్నికల ప్రచారం చేయడాన్ని నిషేధం విధించడంపై బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR) స్పందించారు. ఎన్నికల కమిషన్(Election Commission) 48 గంటలు తన ప్రచారాన్ని నిషేదించిందని.. లక్షలాదిగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు 96 గంటలు అవిశ్రాంతంగా పని చేస్తారని అన్నారు. మహబూబాబాద్‌లో రోడ్‌షోలో పాల్గొన్న కేసీఆర్‌కు ఎన్నికల సంఘం అధికారులు.. రాత్రి 8 గంటల లోపు ప్రచారాన్ని ఆపేయాలంటూ నోటీసులు ఇచ్చారు. 48 గంటల పాటు నిషేధం కొనసాగుతుందని తెలిపారు. దీనికి స్పందించిన కేసీఆర్.. ఇదంతా కాంగ్రెస్-బీజేపీ పన్నిన కుట్ర అని ఆరోపించారు.
కాంగ్రెస్ నేతలు అరచేతిలో వైకుంఠం చూపించి, అడ్డమైన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని కేసీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఒక్క ఉచిత బస్సు తప్ప ఏదీ నెరవేర్చలేదన్నారు. ఉచిత బస్సుతో ఆటో కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. ప్రజా సమస్యలు ఎత్తి చూపిన తనపై.. ఎన్నికల కమిషన్ తనను ప్రచారం నిర్వహించకుండా 48 గంటలు నిషేధం విధించిందని.. అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్‌పై మాత్రం ఎలాంటి నిషేధం లేదన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు కేసీఆర్.
నాడు ఎన్నికల్లో మోదీ వస్తే రూ. 15 లక్షలు వేస్తామని చెప్పి మోసం చేశాడని కేసీఆర్ విమర్శించారు. తెలంగాణకు జీవనాధారం అయిన గోదావరి నదిలో నీటిని నరేంద్ర మోదీ ఇతర రాష్ట్రాలకు తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారని.. అయినా ముఖ్యమంత్రి స్పందించడం లేదని విమర్శించారు. గిరుజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ జయంతి అధికారికంగా నిర్వహించి, బంజారా భవన్‌ను నిర్మించామని గుర్తు చేశారు కేసీఆర్. రైతులు, యువకులు బీఆర్ఎస్ పాలనను, కాంగ్రెస్ పాలనను బేరీజు వేసుకోవాలని కేసీఆర్ కోరారు.
మాట్లాడలేకపోతున్నా..
ఎన్నికల సంఘం నిషేధం విధించడం వల్ల ఎక్కువగా మాట్లాడలేకపోతున్నానని.. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ అని పేర్కొన్నారు కేసీఆర్. ఈ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరిపై ఉందన్నారు. మాలోతు కవిత కష్టపడి పని చేస్తుందని.. పార్లమెంట్‌లో తెలంగాణ హక్కుల కోసం పోరాడుతుందన్నారు. ఈ ఎన్నికల్లో కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంట్‌కు పంపించాలని నియోజకవర్గ ప్రజలను కేసీఆర్ కోరారు.