Share News

CM Revanth Reddy: నాడు కలవని వాళ్లు నేడు పిలుస్తున్నారు..

ABN , Publish Date - Oct 20 , 2024 | 03:38 AM

‘‘గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్ల కోసం కలిసేందుకు వస్తే అనుమతించనివాళ్లు ఇప్పుడు అభ్యర్థులను పార్టీ కార్యాలయానికి పిలిచి మాట్లాడుతున్నారు. అశోక్‌ నగర్‌కు కూడా వెళుతున్నారు.

CM Revanth Reddy: నాడు కలవని వాళ్లు నేడు పిలుస్తున్నారు..

  • గ్రూప్‌-1పై కావాలనే గందరగోళం

  • ఎందుకు చేస్తున్నారో అర్థం చేసుకోండి

  • అపోహ వీడి ఆందోళన విరమించండి

  • 95 శాతం హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌

  • మిగతా అభ్యర్థులూ తీసుకోండి: రేవంత్‌

  • బంగారంలాంటి అవకాశాన్ని కోల్పోవద్దు

  • గ్రూప్‌ 1 అభ్యర్థులకు సీఎం రేవంత్‌ హితవు

హైదరాబాద్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ‘‘గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్ల కోసం కలిసేందుకు వస్తే అనుమతించనివాళ్లు ఇప్పుడు అభ్యర్థులను పార్టీ కార్యాలయానికి పిలిచి మాట్లాడుతున్నారు. అశోక్‌ నగర్‌కు కూడా వెళుతున్నారు. మూడు రోజులుగా కొంత మంది గ్రూప్‌ 1 అభ్యర్థులను రెచ్చగొడుతున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కలవని వాళ్లు ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారో ఆలోచించాలి’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిరుద్యోగులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమ సమయంలో నిరుద్యోగులను ఉసిగొల్పి వారి ప్రాణాలు బలిగొని రాజకీయంగా లబ్ధి పొంది ఉన్నత పదవులు చేపట్టిన వాళ్లు ఇప్పుడు కొంగ జపం చేస్తున్నారని ధ్వజమెత్తారు.


ఈ విషయాన్ని యువత గుర్తించాలని కోరారు. గ్రూప్‌-1 అభ్యర్థులు అపోహలను విడిచి.. ఆందోళనలు విరమించాలని హితవు పలికారు. రాష్ట్ర పోలీస్‌ అకాడమీలో జరిగిన పోలీస్‌ డ్యూటీ మీట్‌- 2024 ముగింపు కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘‘పదేళ్లుగా నోటిఫికేషన్లు రాలేదు. వచ్చిన నోటిఫికేషన్ల ప్రశ్న పత్రాలనూ పల్లీ బఠానీ మాదిరిగా పంచిపెట్టారు. అప్పుడే నిరుద్యోగ అభ్యర్థులకు అండగా నిలబడ్డాను. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎస్పీఎస్పీని ప్రక్షాళన చేశాం. అనేక విభాగాల్లో ఖాళీల భర్తీ చేపట్టాం. తెలంగాణ వచ్చినప్పటి నుంచీ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ రాలేదు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ ఇచ్చాం. అప్పుడే అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తెస్తే తగు మార్పులు చేసి నోటిఫికేషన్‌ ఇచ్చే వాళ్లం. ఇప్పుడు ప్రిలిమ్స్‌ పరీక్షలు పూర్తి చేశాం. సోమవారం నుంచి మెయిన్స్‌ పరీక్షలు జరగబోతున్నాయి.


ఈ సమయంలో నిబంధనలు మార్చాలంటూ కొందరు ఉద్దేశపూర్వకంగా ఆందోళనలు చేస్తున్నారు. జీవో 29 ప్రకారం విధివిధానాలు ఖరారు చేసిన తర్వాతే నోటిఫికేషన్‌ ఇచ్చాం. రిజర్వేషన్లు, పోస్టుల భర్తీ విషయంలో అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకున్నాం. తుది పరీక్ష సమయంలో నోటిఫికేషన్‌లో మార్పులు చేస్తే కోర్టులు ఊరుకుంటాయా!?’’ అని ప్రశ్నించారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్‌ను ప్రగతి భవన్‌ గేటు వద్ద నాలుగు గంటలపాటు ఎర్రటి ఎండలో నిలబెట్టిన నీచమైన చరిత్ర ఉన్నవారు ఇయ్యాల మిమ్మల్ని దగ్గరకు పిలుస్తున్నారంటే వాళ్ల కొంగ జపాన్ని అర్థం చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. ఈరోజు మీ వద్దకు వస్తున్న వారి మాటలు నమ్మి మోసపోవద్దని, ఆనాడు కానిస్టేబుల్‌ కిష్టయ్య, శ్రీకాంతాచారి, వేణుగోపాల్‌ రెడ్డి, ఇశాన్‌ రెడ్డి, యాదయ్య, యాదిరెడ్డిని ఉసిగొప్పి.. వారి ప్రాణాలు బలి తీసుకుని ఉన్నత పదవులు చేపట్టారని, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదని విమర్శించారు. అలాంటి వారి ఉచ్చులో పడవద్దని, ఈ ప్రభుత్వం మీ సమస్యలు పరిష్కరించేందుకు ఉందని భరోసా ఇచ్చారు.


  • మీకు న్యాయం జరుగుతుంది

‘‘నిరసన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులకు చెబుతున్నా! మీకు న్యాయం జరుగుతుంది. మెయిన్స్‌ పరీక్షకు 31 వేలమంది అభ్యర్థుల్లో 95 శాతం మంది హాల్‌ టికెట్లు తీసుకున్నారు. మిగతా వారు కూడా తీసుకుని పరీక్షకు హాజరుకండి. బంగారం లాంటి అవకాశాన్ని కోల్పోవద్దు. 11 ఏళ్లు పరీక్షలు నిర్వహించాలంటూ ఆందోళనలు చేస్తే.. ఇప్పుడు వద్దని ఆందోళనలు చేస్తున్నారు. దీనిపై ఒక్కసారి ఆలోచన చేయండి. పరీక్షలు నిర్వహించడం వల్ల నాకు, నా కుటుంబానికి ఎలాంటి లాభం వచ్చేది లేదు. ఆందోళనలు విరమించి, అపోహలకు దూరంగా ఉండండి’’ అని హితవు పలికారు. న్యాయస్థానాలు కూడా తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహిస్తున్న పరీక్షల విధానాన్ని అంగీకరించాయని చెప్పారు. ఆందోళనలు చేస్తున్న వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని, ఉద్యోగానికి ఎంపికైన వారికి అవి అవరోధంగా మారే అవకాశం ఉంటుందని పోలీస్‌ అధికారులకు సూచించారు.


  • పోలీసుల పనితీరుతోనే ప్రభుత్వ ప్రతిష్ఠ

పోలీసుల పనితీరుతోనే ప్రభుత్వ ప్రతిష్ఠ పెరుగుతుందని, ఏ తప్పిదం జరిగినా దానికి మచ్చ తెచ్చేదిగా మారుతుందని సీఎం రేవంత్‌ అన్నారు. శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే పెట్టుబడులు వచ్చి రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్పారు. యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. గ్రేహౌండ్స్‌కు చెందిన 50 ఎకరాల స్థలంలో పాఠశాల ఏర్పాటు చేస్తామని, అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్‌, మెడికల్‌ వరకు పోలీస్‌ పిల్లలకు చదువు చెబుతామని వివరించారు. మొదటి దశలో 5 నుంచి 8వ తరగతి వరకు ప్రారంభించి దశలవారీగా విస్తరిస్తామని, హోం గార్డు నుంచి డీజీపీ వరకు ఎవరైనా తమ పిల్లల్ని ఈ స్కూల్‌లో చేర్పించవచ్చని చెప్పారు. దాదాపు 11 ఏళ్లపాటు పోలీస్‌ డ్యూటీ మీట్‌ నిర్వహించకపోవడంతో నైపుణ్యాన్ని వెలికి తీయలేకపోయామని, ఇకపై పతకాలు సాధించే సిబ్బందికి నగదు ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు. ప్రథమ బహుమతి సాధిస్తే రూ.5 లక్షలు, ద్వితీయ బహుమతికి రూ.3 లక్షలు, తృతీయ స్థానంలో నిలిచే వారికి రూ.1.5 లక్షలు ఇస్తామన్నారు.


  • డ్రగ్స్‌ కేసుల్లో ఎవరున్నా వదలొద్దు

నేరాల తీరు, నేరగాళ్ల ఆలోచన కొత్త పుంతలు తొక్కుతోందని, అలాంటి నేరాల్ని అడ్డుకునేందుకు పోలీ్‌సలు నైపుణ్యంతో వ్యవహరించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. డ్రగ్స్‌ కేసుల్లో ఎవరున్నా వదలొద్దని, గంజాయి, డ్రగ్స్‌ కేసుల్లో కఠినంగా వ్యవహరించాలని నిర్దేశించారు. కొత్త సినిమాలు వచ్చినప్పుడు టికెట్‌ ధరలు పెంచుకునేందుకు వస్తున్నారని, డ్రగ్స్‌పై అవగాహన కల్పిేస్తనే మినహాయింపులు ఇవ్వాలని ఇప్పటికే పోలీస్‌ ఉన్నతాధికారులకు చెప్పామని, ఈ విషయంలో సినిమా పరిశ్రమకు సంబంధించి ఎంత పెద్ద వారున్నా ప్రత్యేక మినహాయింపులు ఇవ్వవద్దని స్పష్టం చేశారు. సినిమా వారు సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి ప్రజలకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు.


గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ గురించి పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. సైబర్‌ నేరాల కట్టడితోపాటు అవగాహన కల్పించాలని సూచించారు. డ్యూటీలో చేరిన నాటి నుంచి విధుల్లో కనబరిచిన ఉత్తమ ప్రతిభను వెలికి తీసేందుకే పోలీస్‌ డ్యూటీ మీట్‌ ఎంతగానో ఉపయోగపడుతుదని డీజీపీ జితేందర్‌ అన్నారు. డ్యూట్‌ మీట్‌ వివరాల్ని సీఐడీ చీఫ్‌ శిఖా గోయల్‌ వివరించారు. డ్యూటీ మీట్‌లో ఆయా విభాగాల్లో ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందికి సీఎం రేవంత్‌ రెడ్డి ట్రోఫీలు అందజేశారు. డ్రోన్‌ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Updated Date - Oct 20 , 2024 | 03:38 AM