Share News

CM Revanth Reddy: మూసీకి పునరుజ్జీవం..

ABN , Publish Date - Oct 18 , 2024 | 03:06 AM

‘‘బందిపోటు దొంగల్లా తెలంగాణను పదేళ్లు దోచుకున్న వాళ్లు మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. సుందరీకరణ అంటూ కాస్మెటిక్‌ కలర్‌ అద్దాలని చూస్తున్నారు.

CM Revanth Reddy: మూసీకి పునరుజ్జీవం..

2.jpg

మూసీ నది నీళ్లు ఉండాల్సిన ప్రాంతం. నీళ్లు ఉండాల్సిన చోటకు మనం వెళితే.. మనం ఉండే చోటకు నీళ్లు వస్తాయి. చెరువులు, నాలాలు, కుంటలను ఆక్రమిస్తే.. ప్రకృతి ప్రకోపించి అది ఉప్పెనగా మారి కప్పేస్తుంది. ఆ తర్వాత ఎవరూ మిగలరు. మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే నివాసితులు, నిర్వాసితులకు కష్టం, నష్టాన్ని ప్రభుత్వం కల్పించదు. తగిన పరిహారం అందించే తరలిస్తాం. మూసీలాంటి మురికిలో ఉండాలని ఎవరూ కోరుకోరు.

- సీఎం రేవంత్‌ రెడ్డి

  • సుందరీకరణ కాదు.. పూర్తి ప్రక్షాళనే

  • ఇందుకు పనికొచ్చే సలహా సూచనలు ఎవరిచ్చినా తీసుకుంటాం

  • అందరికీ నచ్చేరీతిలో ప్యాకేజీ.. అన్ని విధాలా నిర్వాసితుల్ని ఆదుకుంటాం

  • మూసీపై అఖిలపక్షం.. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలూ ఏర్పాటు చేస్తాం

  • హైదరాబాద్‌ను ప్రపంచంలో గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికిదే అవకాశం

  • స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ, సమతామూర్తి, బుర్జ్‌ ఖలీఫా వంటి నిర్మాణాల్లో

  • భాగస్వాములైన గ్లోబల్‌ కంపెనీలతో కలిసి కన్సార్షియం ఏర్పాటు చేశాం

  • ఎవరికీ ఇష్టం లేదంటే ప్రాజెక్టు ఆపేస్తా.. టెండర్లు రద్దు చేస్తా: సీఎం

  • బందిపోటు దొంగల్లా పదేళ్లు దోచుకున్న వాళ్లే అడ్డుకుంటున్నారు

  • బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులపై రేవంత్‌రెడ్డి మండిపాటు

హైదరాబాద్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ‘‘బందిపోటు దొంగల్లా తెలంగాణను పదేళ్లు దోచుకున్న వాళ్లు మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. సుందరీకరణ అంటూ కాస్మెటిక్‌ కలర్‌ అద్దాలని చూస్తున్నారు. వాళ్ల మెదడులో మూసీ మురికి కంటే ఎక్కువ విషాన్ని నింపుకొన్నారు. తమ ప్రయత్నం మూసీ సుందరీకరణ కోసం కాదు. పునరుజ్జీవం కోసం’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవానికే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ విషయంలో పనికొచ్చే సలహా సూచనలు ఎవరు ఇచ్చినా స్వీకరిస్తామని అన్నారు. మూసీ నిర్వాసితులకు తాము ఇవ్వాలనుకుంటున్న దానికన్నా మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలంటే అందుకూ తాము సిద్ధమన్నారు. ప్రజల్ని మెప్పించి, వాళ్ల మనసుల్ని గెలిచేలా ఏం చేద్దామో చెప్పాలని ప్రతిపక్షాల్ని కోరారు. సచివాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.


మూసీ నది ఇప్పుడు ఎలా ఉంది!? పునరుజ్జీవం తర్వాత ఎలా ఉండబోతోందన్న అంశాన్ని పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ రూపంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూసీ మురికి కూపంగా మారడంతో దశాబ్దాలుగా హైదరాబాద్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ప్రజలు నరకం చవి చూస్తున్నారని, కొందరు మూసీ గర్భంలో మురికి కూపాల్లో మగ్గుతూ దుర్భరమైన జీవనం సాగిస్తున్నారని, అలాంటి ప్రజలకు మెరుగైన జీవనం అందించాలనే లక్ష్యంతో తాము పునరుజ్జీవానికి పూనుకొంటే అధికారం కోల్పోయిన దుగ్ధతో కొన్ని శక్తులు విష ప్రచారానికి పూనుకుంటున్నాయని మండిపడ్డారు. ‘‘450 ఏళ్లకు పైబడిన చరిత్ర ఉన్న చారిత్రక నగరమిది. అన్ని నాగరికతల్లాగే అందమైన మూసీ నదీ తీరంలో ఈ నగరం ఎదిగింది.


ఎంతో ఖ్యాతి సంపాదించింది. గోల్కొండ కోట, చార్మినార్‌, సాలార్‌జంగ్‌ మ్యూజియం, ఉస్మానియా ఆసుపత్రి, హైకోర్టు భవనం వంటి చారిత్రక కట్టడాలతో అలరారుతోంది. దీన్ని ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా మార్చవచ్చు. అందుకు మేం పూనుకున్నాం. దీనికి ఎందుకు అడ్డుపడుతున్నారు? మీ బాధేంటి? మీ అభ్యంతరాలేమిటి? మీ అనుమానాలేంటి’’ అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. చివరకు మీడియా సైతం మౌనంగా ఉంటోందని, తమ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం లేదని వాపోయారు. ‘‘చెప్పండి.. మీకెవ్వరికీ ఇష్టం లేదంటే.. నేను కూడా ఎల్లుండే ఈ ప్రాజెక్టును ఆపేస్తా. టెండర్లు రద్దు చేస్తా’’ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను ప్రపంచంలో గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి ఇది మంచి అవకాశమని, పర్యాటకం ద్వారానే ఆదాయం పెరుగుతుందని, ఆదాయం లేకపోతే సంక్షేమ పథకాలు అమలుచేయలేమని అన్నారు.అన్నారు.


  • అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తా..

మూసీ పునరుజ్జీవానికి తాము చేపట్టే పనుల మీద అనుమానాలున్నా, వివరణలు కావాలన్నా, సూచనలు, సలహాలు ఉన్నా అన్ని పార్టీలు తప్పక చెప్పవచ్చని, దీనిపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. అంతకంటే పెద్ద వేదికైన అసెంబ్లీలోనే చర్చిద్దామని, ఇందుకు నాలుగైదు రోజులపాటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. కిషన్‌ రెడ్డి, ఈటల వంటి ఎంపీల పరిధిలో మూసీ పరివాహక ప్రాంతం ఉన్నందున వాళ్లను కూడా సభకు ఆహ్వానిస్తామన్నారు. ఈ సమావేశాలకు రావాలని ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌, నాటి మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌లకు ఆహ్వానం పలికారు. మూసీ పునరుజ్జీవంపై ప్రతిపక్షాలకు ఎలాంటి అనుమానాలున్నా నోట్‌ రూపంలో ప్రశ్నావళి పంపితే.. వారి ప్రతి సందేహాన్ని రాతపూర్వకంగా తీరుస్తామని తేల్చి చెప్పారు. ఈనెల 19వ తేదీలోపు అనుమానాలను పంపాలని కేసీఆర్‌, కిషన్‌ రెడ్డి, ఒవైసీలతోపాటు కమ్యూనిస్టు పార్టీలకు విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులు కూడా సలహా సూచనలను రాతపూర్వకంగా ఇవ్వాలని కోరారు. వారి స్పందన ఆధారంగా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందిస్తానని, తక్షణం శాసన సభ సమావేశాలు ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఒక్క రోజు వృధా చేసినా నష్టమని, దానివల్ల పేదలకు ఎంతో కష్టమని అన్నారు. విపక్షాలతో సమావేశాలను ఏర్పాటు చేసి ఏకాభిప్రాయం తీసుకురావాలని ఇప్పటికే డిప్యూటీ సీఎంను కోరానన్నారు. దీనిపై మీడియా ఎడిటర్లతోనూ చర్చిస్తామన్నారు. పర్యావరణవేత్తలతో చర్చించేందుకు మంత్రివర్గ ఉప సంఘాలను ఏర్పాటు చేస్తామన్నారు.


  • ఇప్పటి వరకూ ఖర్చు 141 కోట్లే!

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు రూ.141 కోట్లు మాత్రమే ఖర్చు చేశామని సీఎం రేవంత్‌ తెలిపారు. కానీ, కొందరు ఎక్కడి నుంచో లక్షన్నర కోట్ల లెక్కలు తెచ్చారని, బహుశా కాళేశ్వరంలో ఆ పదం వాడి వాడి.. మూసీ విషయంలోనూ అలవాటుగా వాడేస్తున్నారని ఎద్దేవా చేశారు.


  • గ్లోబల్‌ కంపెనీలతో కన్సార్షియం

మూసీ పునరుజ్జీవానికి ప్రపంచంలోని ఐదు కంపెనీల (మెయిన్‌ హర్డ్‌ గ్రూప్‌, రియోస్‌, కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌, ఝా, సోమ్‌)ను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చామని, అన్ని అంశాలను పరిశీలించి ఏడాదిన్నరలో వారు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) ఇస్తారని, ఆ తర్వాతే ఖర్చు తేలుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు. ‘‘ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఇలాంటి ప్రాజెక్టుల్లో పాల్గొన్న ఐదు కంపెనీలను ఎంపిక చేసి, వాటిని ఒక కన్సార్షియంగా ఏర్పాటు చేశాం. ఆరున్నర ఏళ్లపాటు ప్రాజె క్టులో ఇది భాగస్వామిగా ఉంటుంది. ఏడాదిన్నరలో డీపీఆర్‌ ఇస్తుంది. అందులో పునరుజ్జీవ ప్రణాళిక, నిధుల అంచనా, ఆర్థిక వనరుల కూర్పు, పెట్టుబడుల సేకరణ, లాభనష్టాలు వంటి అంశాలన్నీ పొందుపరుస్తుంది. గ్లోబల్‌ ఏజెన్సీలతో సంప్రదింపులు, సదస్సులు, సమావేశాల నిర్వహణ తదితర పనులన్నీ చూసుకుంటుంది. ఇందుకే కన్సార్షియానికి రూ.141 కోట్లు కేటాయించాం. అంతకుమించి ఐదు పైసలు కూడా అదనంగా ఖర్చు చేయలేదు’’ అని వివరించారు. కన్సార్షియంలో ఉన్న కంపెనీలకు స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ (సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌), సమతామూర్తి (ముచ్చింతల్‌) విగ్రహాలు నిర్మించిన అనుభవం ఉందని, బుర్జు ఖలీఫా నిర్మాణంలో భాగమైన సంస్థ కూడా భాగస్వామి అని చెప్పారు. కానీ, పాకిస్థాన్‌కు చెందిన కంపెనీ అంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం కొందరు చేస్తున్నారని మండిపడ్డారు.


  • మూసీలో 3 నెలలు ఉండండి, అద్దె నేను కడతా

మూసీ ప్రక్షాళన ద్వారా ప్రజలకు మెరుగైన జీవితం అందించాలని తాము చూస్తుంటే కొందరు విష ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్‌ మండిపడ్డారు. ‘‘యూట్యూబ్‌లు పెట్టి విష ప్రచారం చేస్తే చాలు అధికారంలోకి వస్తామని ఒకాయనకు ఎవరో చెప్పారట. దాంతో మెదడంతా విషం నింపుకొని సుందరీకరణ అంటూ ప్రచారం చేస్తున్నారు. అధికారం కోల్పోయిన అసహనంతో మాట్లాడుతున్నారు. మేం చేస్తున్నది దుబాయ్‌లో నెత్తి మీద జుట్టు నాట్లేయించుకునే సుందరీకరణ కాదు. మూసీలో ఒక్క ఇంటిని కూడా కూల్చనీయమని, బుల్డోజర్లకు అడ్డం పడతమని కొందరు లీడర్లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అదే మూసీ రివర్‌ బెడ్‌లోని ఇళ్లలో నివాసం ఉండాలని వాళ్లను నేను కోరుతున్నాను. కేటీఆర్‌, హరీశ్‌ రావు, ఈటల రాజేందర్‌కు సవాల్‌ విసురుతున్నా. నిర్వాసితులు ఖాళీ చేసి పోయిన ఇళ్లు రెడీగా ఉన్నాయి. వాటిలో ఓ మూడు నెలలు ఉండండి. రెంట్‌ నేను కడతా. మీకు ఫుడ్‌ కూడా ఏర్పాటు చేస్తా. మీరు ఉండి మంచిగుందంటే అప్పుడు పేదలు కూడా వచ్చి ఉంటారు. అప్పుడు తేలుద్దాం’’ అంటూ సీఎం రేవంత్‌ సవాల్‌ విసిరారు. అక్కడ బాగుందని అప్పుడు వాళ్లు చెబితే ప్రాజెక్టును రద్దు చేస్తానని, ఇప్పటి వరకు అయిన ఖర్చును తానే భరిస్తానని అన్నారు.


  • అందరికీ నచ్చిన రీతిలో ప్యాకేజీ

మూసీలో ఇప్పటి వరకు ఒక్క ఇంటిని కూడా ప్రభుత్వం బలవంతంగా కూల్చలేదని, డబుల్‌ బెడ్‌రూం ఇల్లు తీసుకుని వెళ్లిన లబ్ధిదారులే స్వచ్ఛందంగా వాటిని ఖాళీ చేయడమే కాకుండా ఆ ఇళ్లను కూలగొట్టారని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. ఇప్పటి వరకూ ఒక్క ఇటుకను కూడా ప్రభుత్వం తీయలేదని, హైడ్రా అటువైపు కన్నెత్తి చూడలేదని వివరించారు. రివర్‌ బెడ్‌లో 1600, బఫర్‌ జోన్‌లో మరో 10 వేల ఇళ్లు ఉన్నాయి. అందరికీ నచ్చిన రీతిలో ప్యాకేజీ మాట్లాడి మెరుగైన జీవనం కల్పిస్తాం. పేదలకు కలిగే నష్టం, కష్టాన్ని పరిగణనలోకి తీసుకుని, వారిని అక్కున చేర్చుకుని అన్ని విధాలుగా ఆదుకుంటాం. శాశ్వత నిర్మాణాలు ఉన్న వారిలో ఎవరు ఎంత నష్టపోతున్నారనే దానిని అంచనా వేసి, వారిని సంప్రదించి, వివరాలను సేకరించి ఆ స్థాయిలోనే న్యాయం చేస్తాం. ఈ విషయంలో ప్రభుత్వం విచక్షణతో ఉంది.


ఆదుకోవాలనే తాపత్రయం ఉంది’’ అని వివరించారు. మూసీ పునరుజ్జీవానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ క్రమంలో పేదలను ఆదుకోవడానికి సంప్రదింపులే మార్గమని, వాటిని ఎలా మొదలు పెట్టాలనే కార్యాచరణను ప్రతిపక్షాలైన బీఆర్‌ఎస్‌, బీజేపీ, మజ్లి్‌సతోపాటు మీడియా కూడా ఇవ్వాలని కోరారు. మూసీ పునరుజ్జీవంలో నష్టపోయేవారికి ఏ సాయం అందించాలనే దానిపై మీడియా కూడా నిజనిర్ధారణ కమిటీ వేసి, రిపోర్టు ఇచ్చినా స్వీకరిస్తామని అన్నారు. దీనిపై అపోహలు, అనవసరమైన వాదనలతో మరో విషయాన్ని ముడిపెట్టి గందరగోళానికి తెర లేపవద్దని విజ్ఞప్తి చేశారు. హైడ్రా పేరుతో భయపెడితే బెదరవద్దని, హైడ్రా దయ్యమో, ఫామ్‌హౌజ్‌లో పడుకున్న భూతమో కాదని చమత్కరించారు. అక్కడ ఆస్తులు, ఇళ్లు కోల్పోతున్న వారిలో కొంతమంది కోర్టుకెళ్లారని విలేకరులు ప్రస్తావించగా.. కోర్టుకెళ్లినా, వెళ్లకపోయినా.. వారు నష్టపోతున్న దాన్ని అంచనా వేసి, ఏవిధంగా ఆదుకోవాలన్న దానిపైనే కార్యాచరణ ఇవ్వాలని కోరుతున్నానని స్పష్టం చేశారు. గతంలో హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు నష్టపోయిన వారికి రూ.10 వేలు పరిహారం ఇస్తామని ప్రకటించారని, అందులో పెద్ద స్కామ్‌ జరిగిందని, దానిపై విచారణకు సిద్ధమా అని బీఆర్‌ఎ్‌సకు సీఎంరేవంత్‌ సవాల్‌ విసిరారు.


సిద్ధమని అంటే.. 48 గంటల్లోనే ఏసీబీకి ఆదేశాలు ఇస్తానని వ్యాఖ్యానించారు. కాగా బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడే మూసీ పునరుజ్జీవన కార్యక్రమం చేపట్టాలని కేసీఆర్‌ భావించారని, కానీ, మానవీయ కోణంలో ఆలోచించే ఆయన చేయలేదని బీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారని విలేకరులు చెప్పగా.. వాళ్ల మానవత్వం, మానవీయ కోణం మల్లన్నసాగర్‌, ఏటిగడ్డ కిష్టాపూర్‌, కొండపోచమ్మ సాగర్‌ ప్రాజెక్టులు నిర్మించిన ప్రాంతాలకు వెళ్తే అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. ఏ విషయంలోనూ బీఆర్‌ఎ్‌సతో తమకు పోలిక లేదని, ఒక మనిషి, ప్రభుత్వం ఎలా ఉండకూడదో, తక్కువ టైమ్‌లో ఎక్కువ దోపిడీ ఎలా చేస్తారనే దానికి కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ రోల్‌మోడల్‌ అని వ్యాఖ్యానించారు. వాళ్లు చేసినట్టు తాను చేయకపోతే తెలంగాణకు వెయ్యి రెట్లు మేలు చేసిన వాడినవుతానని అన్నారు. మూసీలో నిర్మాణాలు చేపట్టడంలేదని, గండిపేట నుంచి నల్గొండ వైపు వరకు ఎలివేటెడ్‌ కారిడార్లు, ఆపైన మెట్రో ఉండేలా, మూసీకి ఇరువైపులా ప్రయాణించేలా బ్రిడ్జిలు నిర్మిస్తామని స్పష్టతనిచ్చారు.


  • మీరు ఏడికంటే ఆడికి వస్తా

కొందరు ప్రతిపక్ష నాయకులు ఇక్కడికి వస్తవా.. అక్కడికి వస్తవా అంటూ సవాళ్లు విసురుతున్నారని, తానందుకు సిద్ధమని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. ‘‘మూసీ పరివాహకంలోకే కాదు.. ఏటిగడ్డ కిష్టాపూర్‌, వేములఘాట్‌, మల్లన్నసాగర్‌, కొండపోచంపల్లి, రంగనాయక సాగర్‌కు కూడా వస్తా. సెక్యూరిటీ లేకుండా వస్తా. మీరు వస్తారా? రండి.. అక్కడ రచ్చబండ నిర్వహించి పదేళ్లలో మీరేం దుర్మార్గం చేశారో కూర్చొని చర్చిద్దాం’’ అని సవాల్‌ విసిరారు. గత ప్రభుత్వం నిర్వాసితులకు పునరావాసం కూడా కల్పించకుండా పోలీసులతో దుర్మార్గంగా హింసించిందని, అవన్నీ మర్చిపోయి గత పాలకులు ఇప్పుడు అచ్చోసిన ఆంబోతుల్లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నగరంలో ఇప్పటికే చెరువులు, కుంటలు పోయాయని, వరదలు ముంచెత్తుతుంటే చూస్తూ ఊరుకుందామా అని ప్రశ్నించారు.


చిన్న వర్షాలకే ఇటీవల బెంగళూరు, చెన్నై అతలాకుతలం అయ్యాయని, అదే గతి మనకూ పట్టాలని ప్రతిపక్ష నాయకులు కోరుకుంటున్నారా అని నిలదీశారు. సిటీలో చినుకు పడిందంటే గంటల తరబడి జామ్‌ అవుతోందని, వర్షం నీటిని ఎక్కడికి పంపాలో తెలియని పరిస్థితి ఉందని వివరించారు. ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం తీసుకుంటే ఓర్వలేకపోతున్నారని, ఈ నగరం మరో వెయ్యేళ్లు ఉండాలనే మూసీ పునరుజ్జీవానికి పూనుకున్నామని వివరించారు. ఇందుకు కేంద్రం నుంచి కూడా సాయం అందుతుందని భావిస్తున్నామని, కొన్ని గ్రాంట్లు కూడా వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదాయాన్ని పెంచి, పేదలకు పంచే విషయంలో తమకు ఎవరూ నీతులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్యే కాకపోయినా హరీశ్‌ను మంత్రిని చేసింది కాంగ్రెస్‌ పార్టీయేనని, ఆ విశ్వాసాన్ని ఆయన మర్చిపోకూడదని సూచించారు.


  • దేశ భద్రతే ముఖ్యం

దామగుండం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసే రేడార్‌ స్టేషన్‌ సెల్‌ టవర్‌ కంటే తక్కువ ఫ్రీక్వెన్సీతో ఉంటుందని, ఆ కేంద్రం దేశ భద్రతకు సంబంధించిన విషయమని సీఎం రేవంత్‌ రెడ్డి వివరించారు. నిజంగానే ఆ ఫ్రీక్వెన్సీతో ఇబ్బంది ఉందనుకుంటే.. అక్కడ నేవీకి సంబంధించిన దాదాపు 3,500 కుటుంబాలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. రేడార్‌ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 2,900 ఎకరాల్లో సుమారు 8-10 శాతం భూమిలోనే నిర్మాణం చేపడతారని చెప్పారు. దేశ భద్రతకు సంబంధించిన అంశంలోనూ రాజకీయం చేయడం సమంజసం కాదన్నారు. అయినా.. అసలు ఆ రేడార్‌ స్టేషన్‌ ఏర్పాటుకు అవసరమైన పర్యావరణ, అటవీ అనుమతులను బీఆర్‌ఎస్‌ హయాంలోనే ఇచ్చారని, ఇప్పుడు తన ఖాతాలో రాసేలా చిత్రీకరిస్తున్నారన్నారని, దేశం కోసం రేడార్‌ స్టేషన్‌ను తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమేనని రేవంత్‌ స్పష్టం చేశారు.


ఈ స్టేషన్‌ ఏర్పాటుకు కేంద్రం ఇచ్చిన నిధులను తీసుకుని, ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ వాహనాన్ని కేటీఆర్‌ వచ్చి ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు. దేశభక్తి లేకపోతే కసబ్‌ కంటే హీనులని, కేటీఆర్‌ కసబ్‌లాగా మారతానంటే తనకేమీ అభ్యంతరం లేదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆకాశ హర్మ్యాలను నిర్మించడానికి 111 జీవో పరిధిలో ఉన్న 2-3 లక్షల ఎకరాలను సర్వనాశనం చేశారని, మూసీనే కాకుండా, గండిపేటను కూడా నాశనం చేయాలని చూసినవారు తమకు నీతులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Oct 18 , 2024 | 03:06 AM