Share News

CM Revanth Reddy: ఆర్థిక ఉగ్రవాదుల భరతం పడతాం..

ABN , Publish Date - Oct 20 , 2024 | 02:42 AM

‘‘రియల్‌ ఎస్టేట్‌ను దెబ్బతీయాలని, రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలని కొంతమంది చూస్తున్నారు. ఉన్నవీ లేనివీ చిలువలు పలువలు చేసి సోషల్‌ మీడియాలో పెడుతున్నారు.

CM Revanth Reddy: ఆర్థిక ఉగ్రవాదుల భరతం పడతాం..

హైడ్రా ఇప్పటి వరకూ మూసీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మూసీ పునరుజ్జీవం వేరు.. హైడ్రా వేరు.. హైడ్రా అనగానే హరీశ్‌ రావు, కేటీఆర్‌, ఈటల బయటకు వస్తున్నారు. వారి కిరాయి మనుషులు తప్ప.. పేదోళ్లు ఎవ్వరూ బయటకు రావడం లేదు. పేదలూ.. నిశ్చింతంగా ఉండండి. మెరుగైన నష్ట పరిహరం, జీవితాన్ని అందించే మంచి విధానాన్ని తీసుకొస్తాం.

- సీఎం రేవంత్‌ రెడ్డి

రియల్‌ ఎస్టేట్‌ను దెబ్బతీయాలని, అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు

  • సోషల్‌ మీడియా, వాట్సాప్‌ వర్సిటీలో ప్రచారం

  • అనుమతులున్న సంస్థలకు అండగా ఉంటాం

  • హైడ్రా భూతం కాదు.. కబ్జాదారుల పనిపడుతుంది

  • తాగేనీళ్లలో డ్రైనేజీ నీళ్లు కలిపినవాళ్లు కిరాతకులు

  • బలుపు, అహంకారం చూసే కబ్జాలను కూలగొట్టినం

  • ఫామ్‌హౌజ్‌ల కోసమే కేటీఆర్‌, హరీశ్‌ డ్రామాలు

  • నిజనిర్ధారణ కమిటీ వేద్దామా.. అఖిలపక్షంగా వెళ్దామా?

  • రాజీవ్‌ సద్భావన కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి

  • నిర్వాసితుల్ని ఒప్పించకుండా ఏమీ చేయమని భరోసా

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ‘‘రియల్‌ ఎస్టేట్‌ను దెబ్బతీయాలని, రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలని కొంతమంది చూస్తున్నారు. ఉన్నవీ లేనివీ చిలువలు పలువలు చేసి సోషల్‌ మీడియాలో పెడుతున్నారు. వాట్సాప్‌ వర్సిటీలో ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఆర్థిక ఉగ్రవాదుల భరతం పడతాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. అనుమతులున్న రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు భయపడాల్సిన అవసరం లేదని, ఎవరైనా మీ దగ్గరకు వస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు. వారికి అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. సొంతంగా ఆస్తులు, అనుమతులున్నవారు ఎవ్వరూ భయపడాల్సిన పని లేదని, వారిని ఏవిధంగా కాపాడుకోవాలో ప్రభుత్వానికి తెలుసునని వ్యాఖ్యానించారు. హైడ్రా ఎవ్వరి పట్ల భూతం కాదని, ఆక్రమణలకు పాల్పడే బడా బాబుల భరతం పడుతుందని తేల్చి చెప్పారు.


రాజీవ్‌ గాంధీ సద్భావన యాత్ర కమిటీ ఆధ్వర్యంలో చార్మినార్‌ వద్ద జరిగిన సద్భావన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ జాతీయ జెండా ఎగుర వేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గీతారెడ్డి దంపతులకు సద్భావన అవార్డు అందజేశారు. అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. చెరువులు, కుంటలు ఆక్రమించుకున్న వారు.. ప్రభుత్వ భూములను, నాలాలను కబ్జా చేసి అన్యాయంగా ఏడంతస్తుల మేడలు కట్టుకున్న వారి పట్ల హైడ్రా అంకుశంలాంటిదని స్పష్టం చేశారు. మదపుటేనుగులను అణిచేందుకు అంకుశాన్ని ఏవిధంగా వాడతారో.. అలా కబ్జాదారుల పట్ల హైడ్రా అంకుశంలా పని చేస్తుందని తెలిపారు. అందుకే, చెరువులు, కుంటలు ఆక్రమించుకున్నోళ్లు.. ప్రభుత్వ భూములను అమ్ముకుని లక్షల కోట్లు సంపాదించుకున్నోళ్లు భయపడుతున్నారని, వారందరి సంగతి తేల్చేందుకు హైడ్రా వచ్చిందని చెప్పారు. అక్రమార్కులకు కంటి మీద కునుకు ఉండదని, కచ్చితంగా వారి సంగతి తేలుస్తామని హెచ్చరించారు.


  • మూసీ పునరుజ్జీవం వేరు.. హైడ్రా వేరు

హైడ్రా ఇప్పటి వరకూ మూసీ వైపు కన్నెత్తి కూడా చూడలేదని, మూసీ పునరుజ్జీవం వేరు.. హైడ్రా వేరు అని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. హైడ్రా అనగానే హరీశ్‌ రావు, కేటీఆర్‌, ఈటల రాజేందర్‌ బయటకు వస్తున్నారని, వారి కిరాయి మనుషులు తప్ప.. పేదోళ్లు ఎవ్వరూ బయటకు రావడం లేదని మండిపడ్డారు. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌లో పేదోళ్లు ఫామ్‌ హౌజ్‌లు కట్టుకోగల్గుతారా? అని ప్రశ్నించారు. ‘‘చెరువుల్లో ఫామ్‌హౌజ్‌లు కట్టి వాటిలోని డ్రైనేజీ నీళ్లను గండిపేట, హిమాయత్‌ సాగర్‌ల్లో కలిపిన వాళ్లు ఎంత దుర్మార్గులు.. క్రిమినల్స్‌.. కిరాతకులు! ఆ గాడిదల బలుపు చెప్పదల్చుకున్నా. తాగే నీళ్లలో డ్రైనేజీ నీళ్లు కలుపుతారా? వాడు వాడిన బాత్రూమ్‌ నీళ్లు గండిపేటలో కలిస్తే ఆ నీళ్లు తాగాలా!? మీ అందరినీ అదే చెరువుల్లో వేసి తొక్కుతాం. ఇట్లాంటి దుర్మార్గమైన పని చేసిన వీళ్లను ఒంగపెట్టి పోలీసు స్టేషన్‌లో బట్టలూడదీసి కొట్టాలి. కానీ, బాగుండదని చెరువుల పక్కనున్న అక్రమ నిర్మాణాలు కూలగొట్టుడు మొదలు పెట్టినం.


దాంతో, వీళ్లం తా గగ్గోలు పెడుతున్నారు’’ అని మండిపడ్డారు. పేదలు నిశ్చింతంగా ఉండాలని, మూసీ నిర్వాసితులను ఒప్పించకుండా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టదని హామీ ఇచ్చారు. మెరుగైన నష్ట పరిహరం, జీవితాన్ని అందించే మంచి విధానాన్ని తీసుకొస్తామని తెలిపారు. ‘‘ఫామ్‌హౌజ్‌లను కాపాడుకునేందుకే కేటీఆర్‌, హరీశ్‌ లంగ నాటకాలు.. దొంగ మాటలు. మీ ఫామ్‌ హౌజ్‌లను అక్రమంగా నిర్మించారా? లేదా? బుల్కాపూర్‌ నాలా ఆక్రమించుకున్నావా? లేదా? అజీజ్‌నగర్‌లో హరీశ్‌రావు ఫామ్‌హౌజ్‌ లేదా? పోదాం పద.. అక్కడికి వస్తాను’’ అని మండిపడ్డారు. ఎక్కడ బుల్డోజరు వస్తుందోనని మూసీ పేరుతో నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. బుల్కాపూర్‌ నాలాను కేటీఆర్‌ ఆక్రమించి రోడ్డు వేసుకున్నారని, 50ఎకరాల్లో వంద కోట్లు పెట్టి పెద్ద భవంతి నిర్మించుకున్నారని తెలిపారు. పేదలను రక్షణ కవచంగా పెట్టుకొని ఫామ్‌హౌజ్‌లను కాపాడుకుంటున్నారని విమర్శించారు.


‘‘మేం అడ్డుకుంటాం. పండుకుంటామంటున్నారు. ఒక్కరు కూడా వస్తలేరు. బుల్డోజరు ఖాళీగా పెట్టిన. బిల్లా, రంగాలు ఎప్పుడొచ్చి పండుకుంటారో చెప్పండి. బుల్డోజరు నడిపే బాధ్యత హనుమంతన్నకు ఇస్తాను’’ అంటూ రేవంత్‌ వ్యాఖ్యానించారు. నిజ నిర్ధారణ కమిటీ వేద్దామని, వారి ఫామ్‌ హౌజ్‌లకు అఖిలపక్షాన్ని తీసుకుపోదామని, ఎప్పుడు రావాలో హరీశ్‌, కేటీఆర్‌ చెప్పాలని సవాల్‌ విసిరారు. అవి అక్రమ నిర్మాణాలో కాదో తేలద్దామన్నారు. వాళ్ల పప్పులుడకవని, తొందర్లోనే ఎవరిపై ఏమేం చర్యలుండాలో అవి ఉంటాయని స్పష్టం చేశారు. మత రాజకీయాలతో లబ్ధి పొందేందుకు కొన్ని పార్టీలు ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఉత్తమ్‌ అన్నారు. రేవంత్‌ చేస్తున్న కార్యక్రమాలను మెజారిటీ ప్రజలు మద్దతు తెలుపుతున్నారని, కొంతమంది సోషల్‌ మీడియాలో ఇష్టారాజ్యంగా ఎడిటింగ్‌లు, మార్ఫింగులు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, వాళ్లు దోచుకున్న తీరును అందరికీ ఆపాదిస్తే ఎలా? అని ప్రశ్నించారు.


  • రియల్‌ ఎస్టేట్‌కు సీఎం భరోసాపై క్రెడాయ్‌ హర్షం

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంపై సీఎం రేవంత్‌రెడ్డి భరోసా కల్పించడంపై క్రెడాయ్‌ హైదరాబాద్‌ హర్షం వ్యక్తం చేసింది. హైడ్రా కూల్చివేతలతో స్థిరాస్తి రంగంపై అనేక అపోహలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో... అన్నిరకాల అనుమతులు పొందిన నిర్మాణాలకు ప్రమాదం ఉండదని, నిర్మాణసంస్థలు భయపడవలసిన అవసరంలేదని శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం హామీ ఇచ్చారు. రియల్‌ ఎస్టేట్‌ రంగం దెబ్బతినకుండా చర్యలు చేపడుతున్న సీఎం రేవంత్‌రెడ్డికి క్రెడాయ్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.


  • బిచ్చమెత్తుకున్న రోజులు మర్చిపోయావా!?

హరీశ్‌రావుపై రేవంత్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘నీదో స్థాయి.. నీదో బతుకు.. అప్పట్లో కాంగ్రెస్‌ దయతలచి హవాయి చెప్పులు ఉన్న నిన్ను మంత్రిని చేస్తే.. ఉస్మాన్‌సాగర్‌ పక్కన అజీజ్‌నగర్‌లో 9 ఎకరాల్లో ఫామ్‌హౌజ్‌ కట్టుకున్నవ్‌. అంతకముందు నీకు ఏముండె!? నీ సంగతి నాకు తెలియదా? వెనకాల తొంగి తొంగి చూశానని అంటున్నారు. నేను చూసి ఉండొచ్చు. నీలాగా దొంగతనాలు చేయలేదు. నా ఇంటి ముందుకు వచ్చి చేతులు పట్టుకుని నిలబడి బిచ్చమెత్తుకున్న రోజులు మరిచిపోయావా? చెప్పులు కొనుక్కోవాలంటూ డబ్బుల కోసం నా ఇంటికి రాలేదా?’’ అని నిలదీశారు.


వాళ్ల బాధ, భయమంతా ఫామ్‌హౌజ్‌లు కూలుతాయనేనని, అందుకే హైడ్రాను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. మురికివాడకు వస్తావా అంటూ తనకు సవాల్‌ విసురుతున్నారని, అక్కడి నుంచే చార్మినార్‌వద్దకు వచ్చానని, చెప్పులు మోసేటోళ్లు గాకుండా ఫామ్‌హౌస్‌లో బోర్ల పండుకున్నోడిని రమ్మనమంటూ ధ్వజమెత్తారు. ‘‘త్యాగాలు చేసిన గాంధీ కుటుంబానికి, దోపిడీ చరిత్ర ఉన్న కేసీఆర్‌ కుటుంబానికి పోలికా? ఒకప్పుడు రబ్బరు చెప్పులు కూడా లేనోళ్లు ఇప్పుడు విమానాల్లో తిరుగుతున్నారు’’ అని ధ్వజమెత్తారు.

Updated Date - Oct 20 , 2024 | 02:42 AM