Hyderabad: రెడ్ మీట్‌తో జాగ్రత్త !
ABN , Publish Date - Aug 22 , 2024 | 02:59 AM
మీరు మాంసాహార ప్రియులా? అవకాశం దొరికితే రెడ్ మీట్(మేక, గొర్రె, పంది తదితర జంతువుల మాంసం)ను ఇష్టంగా లాగించేస్తుంటారా? అయితే, కొంచెం జాగ్రత్త పడాల్సిందే.
రోజూ తినేవారికి మధుమేహం ముప్పు..లాన్సెట్ అధ్యయనం
హైదరాబాద్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): మీరు మాంసాహార ప్రియులా? అవకాశం దొరికితే రెడ్ మీట్(మేక, గొర్రె, పంది తదితర జంతువుల మాంసం)ను ఇష్టంగా లాగించేస్తుంటారా? అయితే, కొంచెం జాగ్రత్త పడాల్సిందే. ఎందుకుంటే రెడ్ మీట్‌ను రోజు తినేవారు మధుమేహం బారిన పడే ముప్పు అధికంగా ఉన్నట్టు తేలింది. రెడ్‌మీట్(ప్రొసెస్ చేసిన, చేయని)ను రోజూ తినేవారు మధుమేహం(టైప్-2 డయాబెటిస్) బారిన పడే ప్రమాదం ఇతరులతో పోలిస్తే 15ు అధికంగా ఉంటుందని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు గుర్తించారు.
20 దేశాలకు చెందిన 20 లక్షల మంది సమాచారాన్ని విశ్లేషించి ఈ విషయాన్ని తేల్చారు. లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీలో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. అధ్యయనంలో భాగంగా రెడ్ మీట్ వినియోగం, దానికి తగ్గట్టు పెరుగుతున్న టైప్-2 డయాబెటి్‌సను పరీక్షించారు. ప్రాసెస్ చేయని మాంసం, ప్రాసెస్డ్ మాంసం రోజూ తీసుకునేవారిలో టైప్ 2 డయాబెటిస్ పెరిగే ప్రమాదానికి స్థిరమైన సంబంధం ఉన్నట్లు గుర్తించారు. రెడ్ మీట్ మాత్రమే కాదు ప్రతిరోజు కోడిమాంసం తినేవారిలోనూ 8 శాతం మేరకు టైప్ 2 డయాబెటిస్ సోకే అవకాశం ఉందని పేర్కొన్నారు.