Share News

Seethakka: హైడ్రాతో నష్టపోయిన పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుంది

ABN , Publish Date - Oct 01 , 2024 | 04:44 AM

హైడ్రాతో నష్టపోయిన పేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ధనసరి సీతక్క భరోసా ఇచ్చారు.

Seethakka: హైడ్రాతో నష్టపోయిన పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుంది

  • మంత్రి సురేఖకు బీఆర్‌ఎస్‌ క్షమాపణ చెప్పాలి

  • పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క

  • ఆ పోస్టులు పెట్టిన వారిని పార్టీ నుంచి బహిష్కరించాలి: మంత్రి పొన్నం

తిమ్మాపూర్‌, మానకొండూర్‌, సెప్టెంబరు 30: హైడ్రాతో నష్టపోయిన పేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ధనసరి సీతక్క భరోసా ఇచ్చారు. కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌లో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని చెరువులు, కుంటలతోపాటు మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు ఆక్రమించుకొని, అక్రమ కట్టడాలను నిర్మించారని ఆరోపించారు. ఇబ్బందులు భవిష్యత్తులో లేకుండా చేసేందుకు అక్రమ కట్టడాలను హైడ్రాతో కూల్చి వేయిస్తున్నారని, అంతే తప్పపేదలకు నష్టం చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఎంత మాత్రం లేదని పేర్కొన్నారు.


ఒకవేళ పేదలకు నిజంగా అన్యాయం జరిగితే ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. అక్రమ నిర్మాణాలను తొలగిస్తే అక్రమార్కులకు మద్దతు తెలుపుతూ మాజీ మంత్రులు హరీ్‌షరావు, కేటీఆర్‌ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. మరోవైపు తిమ్మాపూర్‌ మండలం మహాత్మానగర్‌లో సీతక్క మాట్లాడుతూ.. మంత్రి కొండా సురేఖను ట్రోల్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ వారు సోషల్‌ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టారని, అందుకు ఆ పార్టీ వారు సురేఖకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కొండా సురేఖపైౖ పోస్టులు పెట్టిన వారిని పార్టీలో నుంచి బహిష్కరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - Oct 01 , 2024 | 04:44 AM