Jaggareddy: నెహ్రూ కట్టిన డ్యామ్‌ల్లో నీళ్లు.. మోదీ తాగట్లేదా?
ABN , Publish Date - May 28 , 2024 | 03:39 AM
‘‘గత డెబ్బై ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం చేసిందంటూ బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు అడుగుతున్నరు. నేను వాళ్లను అడుగుతున్నా.. దేశ తొలి ప్రధాని నెహ్రూ కట్టిన ప్రాజెక్టుల్లో నీటిని ప్రధాని మోదీ తాగలేదా? కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన సింగూరు, మంజీరా నీళ్లను కేసీఆర్, కేటీఆర్, కిషన్‌రెడ్డి తాగలేదా?
మంజీరా, సింగూరును కట్టింది కాంగ్రెస్సే
ఆ నీళ్లను కేసీఆర్, కిషన్‌రెడ్డి తాగలేదా?
పదేళ్లలో మోదీ ఒక్క ప్రాజెక్టైనా కట్టారా?
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్, మే 27(ఆంధ్రజ్యోతి): ‘‘గత డెబ్బై ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం చేసిందంటూ బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు అడుగుతున్నరు. నేను వాళ్లను అడుగుతున్నా.. దేశ తొలి ప్రధాని నెహ్రూ కట్టిన ప్రాజెక్టుల్లో నీటిని ప్రధాని మోదీ తాగలేదా? కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన సింగూరు, మంజీరా నీళ్లను కేసీఆర్, కేటీఆర్, కిషన్‌రెడ్డి తాగలేదా?’’ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి ప్రశ్నించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలోని 40 కోట్ల మంది ప్రజలు తినడానికి సరైన తిండే లేని రోజుల్లో నెహ్రూ ప్రధాని అయ్యారని గుర్తు చేశారు. ముందు చూపుతో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడమే కాకుండా వాటి ద్వారా విద్యుత్తు ఉత్పత్తికి ప్రాధాన్యమిచ్చారని పేర్కొన్నారు.
అందులో భాగంగానే శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కట్టారని వెల్లడించారు. దేశంలో వ్యసాయాన్ని ప్రోత్సహించడమే కాకుండా ఎఫ్‌సీఐని ఏర్పాటు చేసి.. ప్రజలు ఆకలి చావుల బారిన పడకుండా కాపాడారని పేర్కొన్నారు. అదే సమయంలో పారిశ్రామిక రంగాన్నీ ప్రోత్సహించారన్నారు. పదేళ్లుగా ప్రధాని పదవిలో ఉన్న మోదీ.. ఒక్క ప్రాజెక్టైనా కట్టారా? అని కిషన్‌రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు.
బీజేపీ హయాంలో ప్రభుత్వ రంగ కంపెనీలు ఏమన్నా వచ్చాయా? అని ప్రశ్నించారు. కాగా, టీపీసీసీకి కొత్త సారథి ఎవరన్న దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోందని, అందులో తప్పు లేదన్నారు. కాంగ్రె్‌సలో ఎవరైనా ఢిల్లీకి వెళ్లి పదవిని అడిగే స్వేచ్ఛ ఉంటుందని, మరే పార్టీలోనూ ఇలాంటి స్వేచ్ఛ ఉండదని స్పష్టం చేశారు. బీజేపీలో పదవులడిగితే ఉన్న పదవి ఊడిపోతుందన్నారు. బీఆర్‌ఎ్‌సలో అసలు ఆ పరిస్థితే ఉండదన్నారు.