RamGopal Varma: పరారీలో రామ్‌గోపాల్ వర్మ!
ABN , Publish Date - Nov 26 , 2024 | 04:53 AM
సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్లారు. సోషల్ మీ డియాలో పోస్టుల కేసులో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఆయన తప్పించుకు తిరుగుతున్నారు.
సోషల్ మీడియాలో పోస్టులపై కేసు
అరెస్టుకు భయపడి అజ్ఞాతంలోకి
ఒంగోలుక్రైం/బంజారాహిల్స్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్లారు. సోషల్ మీ డియాలో పోస్టుల కేసులో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఆయన తప్పించుకు తిరుగుతున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం ఆయన ఒంగోలు రూరల్ పోలీసు స్టేషన్‌కు హాజరుకావాల్సి ఉండగా డుమ్మా కొట్టారు. దీంతో ప్రకాశం జిల్లా పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి వర్మను అరెస్టు చేసేందుకు హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లారు. అయితే, అప్పటికే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా వర్మ తరఫు న్యాయవాది పోలీసులతో మాట్లాడుతూ.. ఆర్జీవీ ఇంట్లో లేరని, వర్చువల్‌గా విచారించేందుకు అవకాశం ఉందని, ఆ మాధ్యమంలో ప్రశ్నిస్తే సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
కాగా, వర్మ కూడా వర్చువల్ విచారణకు అనుమతి ఇవ్వాలని విచారణాధికారిని కోరారు. దీనిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంతలో పోలీసులకు మరో సమాచారం అందింది. వర్మ తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్నట్టు తెలిసింది. దీంతో ప్రకాశం జిల్లా పోలీసులు తమిళనాడు పోలీసులతో మాట్లాడారు. మరో పోలీసు బృందాన్ని చెన్నైకి పంపేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, తొలుత తనపై ఉన్న కేసును కొట్టివేయాలని వర్మ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. న్యాయమూర్తి దానిని కొట్టేయడంతో, అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వర్మ మరో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుంది.