Hyderabad: పెండింగ్ బిల్లులు వచ్చేనా!
ABN , Publish Date - Jul 01 , 2024 | 04:03 AM
‘‘గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పారని సొంతంగా లక్షల రూపాయలు అప్పులు చేసి గ్రామాల్లో పనులు చేయించాం. పంచాయతీరాజ్ శాఖ అధికారుల ఆదేశాలతో.. పల్లె ప్రగతి పేరుతో నిర్మాణాలు చేపట్టాం.
బకాయిలపై తాజా మాజీ సర్పంచుల్లో ఆందోళన.. బీఆర్‌ఎస్ హయాంలో మౌఖిక ఆదేశాలతో పనులు
అప్పులు చేసి మరీ పనులు చేసినా నిధులివ్వని సర్కారు
రూ.వెయ్యి కోట్లకు పైగా బకాయిలు
ప్రస్తుత ప్రభుత్వమైనా స్పందించి ఇవ్వాలని వేడుకోలు
పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు పెండింగ్
హైదరాబాద్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): ‘‘గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పారని సొంతంగా లక్షల రూపాయలు అప్పులు చేసి గ్రామాల్లో పనులు చేయించాం. పంచాయతీరాజ్ శాఖ అధికారుల ఆదేశాలతో.. పల్లె ప్రగతి పేరుతో నిర్మాణాలు చేపట్టాం. టార్గెట్లు పెట్టి మరీ.. వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, రైతు వేదికలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు తదితర పనులకు మాతోనే డబ్బులు ఖర్చు పెట్టించారు. కానీ, ఏళ్లు గడిచినా వాటికి నిధులు విడుదల కాలేదు. అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి. మా పదవీకాలం పూర్తయి కూడా ఐదు నెలలు అయింది. గత ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదు.. కొత్త ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మా పరిస్థితేంటి?’’ ఇది రాష్ట్రంలోని తాజా మాజీ సర్పంచుల ఆందోళన. నిజానికి పంచాయతీల్లో పనులు చేయాలంటే నిర్దిష్ట నిబంధనలు పాటించాలి. తొలుత పంచాయతీ అనుమతి పొంది.. పనుల అంచనాలు సిద్ధం చేశాక.. ప్రభుత్వం వాటికి అనుమతులు జారీ చేస్తుంది.
ఆ తర్వాత టెండరు ప్రక్రియ ద్వారా పనులు చేపట్టాలి. పనులు పూర్తయ్యాక ఎంబీ రికార్డులు నమోదు చేసి దశలవారీగా బిల్లులు విడుదల చేస్తారు. కానీ, కేవలం మౌఖిక ఆదేశాలతోనే పంచాయతీల్లో పనులు చేయించారు. అయితే ప్రభుత్వం మారిపోయి కొత్త ప్రభుత్వం రావడంతో ఆ పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు వస్తాయా? మునుగుతామా? అని తాజా మాజీ సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో పలు సందర్భాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి ప్రభుత్వం రూ.3 లక్షల నుంచి రూ.కోటి వరకు బకాయి ఉన్నట్లు వారు చెబుతున్నారు. ఈ లెక్కన రాష్ట్రం మొత్తమ్మీద రూ.1000 కోట్లకు పైగా బిల్లుల బకాయి ఉన్నట్లు పేర్కొంటున్నారు. కొత్త ప్రభుత్వమైనా స్పందించి తమకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు. బిల్లుల కోసం గతంలో ఆందోళనలు సైతం చేసిన వీరు.. తాజాగా ఆదివారం గవర్నర్ రాధాకృష్ణన్‌ను కలిసి విన్నవించుకున్నారు.
రూ.3240 కోట్ల బకాయిలు
వాస్తవానికి గ్రామ పంచాయతీలకు చాలాకాలంగా రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్‌ఎ్‌ఫసీ) నిధులు విడుదల కావడంలేదు. కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా అయిదు నెలలుగా రావడంలేదు. కేంద్రం నిధులు ప్రతినెలా దాదాపు రూ.180 కోట్ల నాలుగు నెలలకు సంబంధించి రూ.1,080 కోట్లు రావాల్సి ఉంది. మరోవైపు 18 నెలలకు సంబంధించి ఎస్‌ఎ్‌ఫసీ నిధులు రూ.2,160 కోట్లు రావాల్సి ఉంటుందని అంచనా. ఈ రెండూ కలిసి రూ.3,240 కోట్లు గ్రామపంచాయతీలకు బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. ఏ నిధులూ రాకపోవడంతో గ్రామాల అభివృద్ధి అగమ్యగోచరంగా మారింది. సర్పంచులు లేకపోవడంతో గ్రామ పంచాయతీల వారీగా నియమితులైన ప్రత్యేకాధికారులు, గ్రామ కార్యదర్శులు.. నిధుల్లేని కారణంగా గ్రామాల్లో సమస్యలు తీర్చలేకపోతున్నారు. పలు రకాల పన్నుల రాబడి ఉన్న మేజర్ పంచాయతీల పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా.. ఆదాయ వనరుల్లేని 5,500కు పైగా చిన్న పంచాయతీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఎస్‌ఎ్‌ఫసీ నిధులు కాకపోయినా.. తాత్కాలికంగా పంచాయతీలకు ప్రత్యేక నిధులిస్తే బాగుటుందని ప్రత్యేకాధికారులు కోరుతున్నారు.
మమ్మల్ని ఆదుకోండి
గవర్నర్‌కు సర్పంచుల సంఘం వినతి
‘‘గత ప్రభుత్వ ఆదేశాల మేరకు అప్పులు చేసి మరీ మా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయించాం. ఏళ్లు గడిచినా చేసిన పనులకు మాకు బిల్లులు రాలేదు. మమ్మల్ని ఆదుకోండి’’ అంటూ రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రతినిధులు కోరారు. ఆదివారం రాజ్‌భవన్‌లో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి, జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, ప్రతినిధులు మధుసూదన్ రెడ్డి, సుభాష్, ఆరుట్ల లక్ష్మీప్రసన్నరెడ్డి, గణేశ్, రాజేందర్, సముద్రాల రమేశ్ తదితరులు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ‘‘గత ప్రభుత్వ ఆదేశాలతో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు సొంత డబ్బులను ఖర్చు చేశాం. కొంతమంది అప్పులుచేసి మరీ పనులు పూర్తి చేయించారు. ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక కొందరు సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు’’ అని వారు గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచినా.. బిల్లులపై స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమకు బిల్లులు చెల్లించేలా చొరవ చూపాలని గవర్నర్‌ను అభ్యర్థించారు.