Share News

High Court: చిన్నారులపై కుక్కల దాడి.. హైకోర్టు ఫైర్‌

ABN , Publish Date - Jul 19 , 2024 | 04:16 AM

రాష్ట్రంలో చిన్న పిల్లలపై వీధికుక్కలు దాడి చేసి, చంపుతున్న సంఘటనలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం స్టెరిలైజేషన్‌(సంతాన నిరోధక శస్త్రచికిత్స) ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభించదని..

High Court: చిన్నారులపై కుక్కల దాడి.. హైకోర్టు ఫైర్‌

  • ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ పరస్పర ఆరోపణలు తగవు

  • పరిష్కారాలతో రావాలి యానిమల్‌ బర్త్‌కంట్రోల్‌ కమిటీ, ప్రభుత్వానికి ఆదేశాలు

హైదరాబాద్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చిన్న పిల్లలపై వీధికుక్కలు దాడి చేసి, చంపుతున్న సంఘటనలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం స్టెరిలైజేషన్‌(సంతాన నిరోధక శస్త్రచికిత్స) ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభించదని.. ఆయా రంగాల్లో పనిచేస్తున్న నిపుణులను సంప్రదించి పరిష్కారాలతో రావాలని ప్రభుత్వానికి, యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ కమిటీకి ఆదేశాలు జారీచేసింది. చిన్నారులపై వీధికుక్కల దాడులకు సంబంధించిన పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. గతంలో ఇదే అంశంపై దాఖలైన పిటిషన్‌లతో కలిపి విచారణ చేపడుతోంది.


ఈ వ్యవహారంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాఽధే, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ‘‘ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) కాదు. చిన్న పిల్లల ప్రాణాలకు సంబంధించిన అంశం. మానవీయకోణంలో అర్థం చేసుకోవాల్సిన ఈ అంశంలో ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ పనిచేయడం లేదంటూ పరస్పర ఆరోపణలకు అవకాశం లేదు. స్టెరిలైజేషన్‌ ఒక్కటే దీనికి మార్గం కాదు. స్టెరిలైజేషన్‌ చేసినంత మాత్రాన.. కుక్కలు పిల్లలపై దాడి చేయకుండా ఎలా నిరోధించగలుగుతాం. ఈ సమస్య ఢిల్లీ, కోల్‌కతా వంటి నగరాల్లో ఉంటే అక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్నారో పరిశీలించి.. అమలు చేసే అవకాశం ఉండేది. ఇది ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రత్యేక సమస్య.


దీనికి నిపుణులు మాత్రమే పరిష్కారం చూపగలరు. మాంసం దుకాణాల నుంచి వెలువడుతున్న వ్యర్థాల వల్ల కూడా కుక్కలు క్రూరంగా మారుతున్నాయి. ఈ సమస్యపై ఫిర్యాదులు స్వీకరించేందుకు హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించండి’’ అని వ్యాఖ్యానించింది. 3.79 లక్షల కుక్కలకు స్టెరిలైజేషన్‌ చేశామన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.. ఇదొక్కటే పరిష్కారం కాదని తెలిపింది. చిన్నారుల మరణాలు, కుక్కల దాడులపై పత్రికల్లో వచ్చిన కథనాల క్లిప్పింగ్స్‌ను ధర్మాసనం ప్రదర్శించింది. భవిష్యత్తులో ఇలాంటి దారుణాలు జరగకుండా నిపుణులను సంప్రదించి, తగిన పరిష్కార మార్గాలతో రావాలని యానిమల్‌ బర్త్‌కంట్రోల్‌ కమిటీ, జీహెచ్‌ఎంసీ, ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది.

Updated Date - Jul 19 , 2024 | 04:16 AM