Share News

Mohanbabu Issue: మంచు ఫ్యామిలీలో వివాదానికి ఫుల్‌స్టాప్ పడనుందా.. మనోజ్ మాటల్లో మతలబు అదేనా..

ABN , Publish Date - Dec 11 , 2024 | 06:05 PM

ఆస్తి పంపకాల విషయంలో కుటుంబ సభ్యులు కూర్చుని మాట్లాడుతుండగా గొడవ జరగడంతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఆదివారం మంచు మనోజ్ పోలీసులకు ఫోన్ చేసి తనపై తండ్రి మోహన్‌బాబు, ఆయన అనుచరులు దాడి చేశారని సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత రాత పూర్వకంగా ..

Mohanbabu Issue: మంచు ఫ్యామిలీలో వివాదానికి ఫుల్‌స్టాప్ పడనుందా.. మనోజ్ మాటల్లో మతలబు అదేనా..
Manoj and Mohanbabu

మంచు మోహన్‌ బాబు కుటుంబంలో నెలకొన్న వివాదం సద్ధుమణిగినట్లేనా.. ఫ్యామిలీ వార్‌కు ఎండ్ కార్డు పడిందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆదివారం మొదలైన ఈ వివాదం నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తనపై మోహన్‌బాబు దాడిచేశారని మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆ తర్వాత మనోజ్, మౌనికపై మోహన్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తి పంపకాల విషయంలో కుటుంబ సభ్యులు కూర్చుని మాట్లాడుతుండగా గొడవ జరగడంతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఆదివారం మంచు మనోజ్ పోలీసులకు ఫోన్ చేసి తనపై తండ్రి మోహన్‌బాబు, ఆయన అనుచరులు దాడి చేశారని సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత రాత పూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత తమ కుటుంబంలో ఎలాంటి వివాదం లేదని మోహన్‌బాబు వర్గం మీడియాకు సమాచారం ఇచ్చినప్పటికీ, మనోజ్ వెనక్కి తగ్గకపోవడంతో ఫ్యామిలీ వార్ రోడ్డుకెక్కింది. సోమవారం మోహన్‌బాబు సైతం మంచు మనోజ్, మౌనిక తమపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మనోజ్ ఫిర్యాదుపైన, మోహన్‌బాబు కంప్లైంట్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మంగళవారం దుబాయి నుంచి మోహన్‌బాబు పెద్ద కుమారుడు విష్ణు హైదరాబాద్ వచ్చారు. ఆ తర్వాత మోహన్‌బాబు ఇంటి వద్ద మనోజ్, విష్ణు తరపున బౌన్సర్లు భారీగా మోహరించారు. ఒకానొక దశలో ఇరు వర్గాలకు సంబంధించిన బౌన్సర్లు ఘర్షణకు దిగిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో మోహన్‌బాబును విష్ణు అడ్మిట్‌చేశారు. మరోవైపు పోలీసులు విచారణకు హాజరుకావాలంటూ మోహన్‌బాబు, మనోజ్‌కు నోటీసులు జారీ చేశారు. పోలీసుల విచారణకు హాజరైన తర్వాత మంచు మనోజ్ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. మరోవైపు తన తండ్రి దేవుడిలాంటి వాడని వ్యాఖ్యలు చేయడంతో మంచు ఫ్యామిలీ వార్‌కు శుభం కార్డు పడిందనే చర్చ జరుగుతోంది.


పోలీసుల విచారణ తర్వాత

విచారణకు రావాలని పోలీసులు పిలవడంతో మంచు మనోజ్ ఇవాళ విచారణకు హాజరయ్యారు. బుధవారం సాయంకాలం మీడియాతో మాట్లాడటానని, అన్ని విషయాలు వివరిస్తానని చెప్పిన మంచు మనోజ్ పోలీసుల విచారణ తర్వాత మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. తమ కుటుంబంలో చోటుచేసుకున్న వివాదం త్వరలోనే సమసిపోతుందని, తన తండ్రి దేవుడిలాంటి వారని, కొందరు వ్యక్తుల ప్రభావానికి ఆయన లోనయ్యారని మనోజ్ చెప్పుకొచ్చారు. మరోవైపు మోహన్‌బాబు ఆసుపత్రిలో చేరడం, కుటుంబ వివాదం రచ్చకెక్కడంతో అనేకమంది తీవ్రంగా విమర్శలు చేయడంతో పాటు.. సినీ రంగంలో కొందరు ప్రముఖులు ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని, రోడ్డుకెక్కద్దని చెప్పడంతో మనోజ్ ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు మోహన్‌బాబు సైతం మనోజ్‌తో వివాదానికి ఎండ్ కార్డు పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మనోజ్, మోహన్‌బాబు మధ్య మధ్యవర్తిత్వం కోసం హైదరాబాద్ సిటీకి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి రాయబారం నడిపినట్లు తెలుస్తోంది.


విష్ణు వెనక్కి తగ్గారా..

ఎప్పుడు మంచి జోష్‌లో ఉండే విష్ణు ఫ్యామిలీ వివాదంలో కొంచెం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ప్రస్తుత వివాదం చిలికి చిలికి గాలివానగా మారడంతో తండ్రి, కొడుకుల మధ్య సెటిల్‌మెంట్ కోసం విష్ణు ఒక అడుగు వెనక్కి వేశారనే ప్రచారం జరుగుతోంది. నిజంగానే మంచు ఫ్యామిలీలో వివాదం ఇంతటితో సద్దుమణుగుతుందా.. లేదా కొనసాగుతుందా అనేది తెలియాలంటే ఒకట్రెండు రోజులు వేచిచూడాల్సిందే.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Dec 11 , 2024 | 09:21 PM