రాహుల్‌పై మహారాష్ట్ర రైతు వీరాభిమానం
ABN , Publish Date - Jun 12 , 2024 | 04:57 AM
కాంగ్రెస్ జెండాలతో కుట్టించుకున్న దుస్తులు.. మెడనిండా కాంగ్రెస్ కండువాలు. నెత్తిన ధరించిన టోపీపై కూడా కాంగ్రెస్ గుర్తే.. కాళ్లకు చూస్తే చెప్పులు లేవు. ఈ రకమైన ఆహార్యంతో మంగళవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయ ఆవరణలో కనిపించిన ఓ వ్యక్తిని చూసి టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి... పిలిచి ముచ్చట పెట్టారు.
మణిపూర్ నుంచి ముంబై వరకు.. రాహుల్‌తో కలిసి చెప్పులు లేకుండా జోడోయాత్ర
ఏఐసీసీ కార్యాలయంలో జగ్గారెడ్డికి తారసపడిన రైతు
వివరాలు తెలుసుకున్న జగ్గారెడ్డి
రాహుల్ ప్రధాని కావాలని రైతు ఆకాంక్ష
హైదరాబాద్, జూన్ 11(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ జెండాలతో కుట్టించుకున్న దుస్తులు.. మెడనిండా కాంగ్రెస్ కండువాలు. నెత్తిన ధరించిన టోపీపై కూడా కాంగ్రెస్ గుర్తే.. కాళ్లకు చూస్తే చెప్పులు లేవు. ఈ రకమైన ఆహార్యంతో మంగళవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయ ఆవరణలో కనిపించిన ఓ వ్యక్తిని చూసి టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి... పిలిచి ముచ్చట పెట్టారు. అతని పూర్వాపరాలు తెలుసుకున్నారు. రాహుల్‌గాంధీ ప్రధాని కావాలన్న ఆకాంక్షతో ఉన్న మహారాష్ట్ర రైతు వీరాభిమానం చూసి ఆశ్చర్యం చెందారు.
రాహుల్ ప్రధాని అయితేనే రైతులు బాగుపడతారని బలంగా నమ్మిన షిర్డీ ప్రాంతానికి చెందిన సదాశివ లేఖర్ అనే రైతు.. మణిపూర్ నుంచి ముంబై వరకు రాహుల్‌గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. అయితే రాహుల్‌పై ఉన్న వీరాభిమానంతో చెప్పులు లేకుండానే నడిచారు. ఈ మేరకు వివరాలను జగ్గారెడ్డికి తెలిపారు. ఇంత శ్రమ ఎందుకు పడుతున్నావంటూ ఆ రైతును జగ్గారెడ్డి అడిగితే.. రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యే వరకు ఇలాగే ఆయన వెంట తిరగాలని నిర్ణయించుకున్నట్టు చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే వ్యవసాయానికి మేలు జరుగుతుందని.. రైతులకు మంచి రోజులు వస్తాయని చెప్పారు. ఇప్పటి దాకా రైతులకు మేలు చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలేనని, రాహుల్‌గాంధీ ప్రధాని అయితే రైతులతో పాటు అన్ని వర్గాలకూ అండగా ఉంటారని ఆ రైతు చెప్పారు. రాహుల్‌కు వీరాభిమాని అయిన ఆ రైతు మాటలు విని జగ్గారెడ్డి ముచ్చపడిపోయారు.