Minister Komati Reddy: పదేళ్లు కవిత ఏం చేసిందో బయటపెడతాం.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు
ABN , Publish Date - Sep 22 , 2024 | 04:37 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావును అమెరికా నుంచి రావద్దని కేటీఆర్ ,హరీష్ రావు అమెరికాకు పోయి చెప్పి వచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రభాకర్ రావు వస్తే వీరు జైలుకు పోతారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
యాదాద్రి : బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లుగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏం చేసిందో బయటపెడతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ చిన్న పిల్లోడు కాదని... ఆయన ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. కేటీఆర్ దగ్గర ఆధారాలు ఉంటే పేపర్ పట్టుకుని రావాలని మంత్రి కోమటిరెడ్డి సవాల్ విసిరారు. ఇవాళ(ఆదివారం) గాంధీభవన్‌లో మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రతిపక్ష నాయకుడు హోదా తనకు వద్దని కేసీఆర్ అంటున్నారు. అది హరీష్‌రావుకు పోతుందేమో అని కేటీఆర్ బయపడుతున్నారు. కేటీఆర్ దోపిడీ వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం రాకముందే టెండర్లు పిలిచారని గుర్తుచేశారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు టెండర్లు పిలిచారని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.
సత్యం రామలింగరాజు కొడుకు కేటీఆర్ రైట్ హ్యాండ్ అని విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రోజురోజుకూ బీఆర్ఎస్ పార్టీ ప్రభావం కోల్పోతోందన్నారు. ఆ పార్టీకి ప్రతిపక్ష నాయకుడు ఎవరో కూడా తెలియదని చెప్పారు. ఎమ్మెల్యేలు , మున్సిపల్ చైర్మన్లు పార్టీ వదిలిపెట్టి పోతుండటంతో దిక్కుతోచని స్థితిలో కేటీఆర్ మాట్లాడుతున్నారని చెప్పారు. కేటీఆర్ పదేళ్లు మున్సిపల్ శాఖ మంత్రిగా పని చేసి రూ. 7 లక్షల కోట్లు అప్పులు చేసి అందులో రూ. 2 లక్షల కోట్లు ఆయన కుటుంబం దోచుకుందని మంత్రి కోమటిరెడ్డి విమర్శలు చేశారు.
రూ. 8888 వేల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయో కేటీఆర్ లెక్కలు చెప్పాలని అడిగారు. కాళేశ్వరం స్కామ్ చేశారు, మేడిగడ్డ కూలిపోయింది ఎప్పుడు ఎవరు జైలుకు పోతారో తెలియదని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న ప్రభాకర్ రావును అమెరికా నుంచి రావద్దని కేటీఆర్ ,హరీష్ రావు అమెరికాకు పోయి చెప్పి వచ్చారని ఆరోపించారు. ప్రభాకర్ రావు వస్తే వీరు జైలుకు పోతారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘కేటీఆర్ నీకు దమ్ముంటే రుజువు చేయి..దానికైనా మేము సిద్ధం’ అని మంత్రి కోమటిరెడ్డి సవాల్ విసిరారు.
‘‘నీకు, మీ బావకు ఉన్న పంచాయితీల వల్ల కేసీఆర్ ఫస్ట్రేషన్ అవుతున్నాడు. మంచి పనులు చేసినా.. నీకు దోపీడే కనిపిస్తోం ది..మీ కుటుంబంలాగా మేం దోచుకోలేదు. మీ పాలనలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి.. మేము ఒక్కటో తేదీనే జీతాలు ఇస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక స్థానం కూడా రాదు. మీ పార్టీ ఎక్కడిది ప్రతిపక్ష నాయకుడు మీ నాయనా లేక హరీష్‌రావా, మీ చెల్లెలా , నువ్వా.. కేటీఆర్ ముందు ఆ విషయం తేల్చుకో. మీరు నలుగురు కలిసి ప్రతిపక్ష నేత పాత్ర కోసం పోటీ పడుతున్నారు’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెటైర్లు గుప్పించారు.