Share News

irrigation projects: పెదవాగుకు తక్షణ మరమ్మతులు..

ABN , Publish Date - Jul 23 , 2024 | 03:48 AM

తెలంగాణ, ఏపీ పరిధిలో 16 వేల ఎకరాల ఆయుకట్టు కలిగిన పెదవాగు ప్రాజెక్టుకు తక్షణ మరమ్మతులు చేసి ఈ సీజన్‌లోనే రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు తగిన ప్రణాళిక రూపొందిస్తున్నట్టు రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

irrigation projects: పెదవాగుకు తక్షణ మరమ్మతులు..

  • వరద బాధితులతో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి

  • ప్రాజెక్టును ఈ సీజన్‌లోనే అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళిక

  • ఇసుకమేటల తొలగింపునకు ఎకరానికి రూ.10 వేలు: పొంగులేటి

అశ్వారావుపేట, జూలై 22: తెలంగాణ, ఏపీ పరిధిలో 16 వేల ఎకరాల ఆయుకట్టు కలిగిన పెదవాగు ప్రాజెక్టుకు తక్షణ మరమ్మతులు చేసి ఈ సీజన్‌లోనే రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు తగిన ప్రణాళిక రూపొందిస్తున్నట్టు రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఇటీవల వర్షాలకు దెబ్బ తిన్న పెదవాగు ప్రాజెక్టును సోమవారం పరిశీలించారు. పెద్దవాగు గండి పడటానికి గల కారణాలను నీటి పారుదల శాఖ సీఈ శ్రీనివాసరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. తక్షణ మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు.


అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. పెదవాగు ప్రాజెక్టు వరదలతో దెబ్బతిన్న ఆర్‌ అండ్‌ బీ, పీఆర్‌ రహదారుల మరమ్మతులు, విద్యుత్తు సౌకర్యం పునరుద్ధరణకు రూ.8.50 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. 400 ఎకరాల్లో ఇసుక మేటలు వేసినట్టు ప్రాథమిక సర్వేలో తేలిందని, ఆయా భూముల్లో ఇసుక మేటలను తొలగించేందుకు ఎకరానికి రూ.10 వేలు సహాయం, ఉచితంగా విత్తనాలు సరఫరా చేస్తామని వెల్లడించారు. వరదల్లో కొట్టుకుపోయిన గొర్రెలు, మేకలకు ఒక్కోదానికి రూ.3 వేలు, పశువులకు ఒక్కో దానికి రూ.20 వేలు అందిస్తామన్నారు. వరదలో చిక్కుకున్న 31 మందిని కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం అందించిన సహకారం మరిచిపోలేదని.. వారికి ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

Updated Date - Jul 23 , 2024 | 03:48 AM