Sircilla: పదేళ్ల రాష్ట్ర ప్రగతిపై బురదచల్లడం మానాలి..
ABN , Publish Date - Jun 22 , 2024 | 04:23 AM
‘‘పదేళ్లలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించి కొత్తగా ఏర్పడే రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని ప్రపంచప్రఖ్యాత మ్యాగజైన్ ‘ది ఎకానమిస్ట్’ కథనాన్ని ప్రచురించింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి ప్రస్థానంపై బురద చల్లడం మాని ఇప్పటికైనా అభివృద్ధి యజ్ఞాన్ని ముందుకు తీసుకు వెళ్లాలి’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.
ప్రభుత్వం అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి
’అంబేడ్కర్ అభయ హస్తం’కు నిధులివ్వాలి: కేటీఆర్
హైదరాబాద్/సిరిసిల్ల, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): ‘‘పదేళ్లలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించి కొత్తగా ఏర్పడే రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని ప్రపంచప్రఖ్యాత మ్యాగజైన్ ‘ది ఎకానమిస్ట్’ కథనాన్ని ప్రచురించింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి ప్రస్థానంపై బురద చల్లడం మాని ఇప్పటికైనా అభివృద్ధి యజ్ఞాన్ని ముందుకు తీసుకు వెళ్లాలి’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే ఒక అభివృద్ధి మోడల్‌గా తయారైందంటూ కథనంలోని లెక్కలను శుక్రవారం ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. అలాగే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో అంబేడ్కర్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన సమయంలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7.8 గిగా వాట్ల నుంచి 19.3 గిగా వాట్లకు పెరిగిందని తెలిపారు. 9ఏళ్లలో ఐటీ ఎగుమతులు నాలుగు రెట్లు పెరిగాయని, ఐటీ ఉద్యోగాలు మూడు రెట్లు పెరిగి 9 లక్షలకు చేరుకున్నాయన్నారు. బీఆర్‌ఎస్ సాధించిన అభివృద్ధిని ఎలాంటి అడ్డంకులు లేకుండా కాంగ్రెస్ సర్కారు ముందుకు తీసుకువెళ్లాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో దళితులకు ఇచ్చిన హామీ ప్రకారం ‘అంబేడ్కర్ అభయ హస్తం’కు నిధులు కేటాయించి చిత్తశుద్ధి చాటుకోవాలని డిమాండ్ చేశారు.
బొగ్గు బ్లాకుల వేలం అప్పుడు వద్దన్నారు.. ఇప్పుడు సమర్థిస్తారా?
‘కేంద్రం బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపేయాలని, 4 బొగ్గు బ్లాకులను సింగరేణి కాలరీ్‌సకు బదిలీ చేయాలని గతంలో ఎంపీగా, టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో డిమాండ్ చేశారు. అదే ప్రక్రియ ఇప్పుడు జరుగుతుంటే ముఖ్యమంత్రి హోదాలో సమర్థిస్తారా..?’ అని రేవంత్‌రెడ్డిని కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. సీఎం హోదాలో తెలంగాణ ప్రజలను పూర్తిగా నిరుత్సాహపరుస్తూ, వేలంలో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎంను పంపారని విమర్శించారు. వేలమంది కార్మికుల పొట్టగొట్టి.. వందేళ్ల సంస్థ భవిష్యత్తును చీకట్లోకి నెట్టి.. పూలబొకేలతో నిస్సిగ్గుగా పొటోలకు ఫోజులిస్తున్నారని భట్టి, కిషన్‌రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.