Seethakka: బండి సంజయ్ వ్యాఖ్యలు సరికాదు..
ABN , Publish Date - Dec 09 , 2024 | 04:05 AM
రాష్ట్ర క్యాబినెట్‌లో అర్బన్ నక్సలైట్లు ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అనడంలో ఆంతర్యమేమిటని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రశ్నించారు.
క్యాబినెట్‌లో అర్బన్ నక్సలైట్లు ఉన్నారనడంతో ఆంతర్యమేంటి?: సీతక్క
మహబూబాబాద్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర క్యాబినెట్‌లో అర్బన్ నక్సలైట్లు ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అనడంలో ఆంతర్యమేమిటని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రశ్నించారు. ఆదివారం మహబూబాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. తాను ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చిన మాట వాస్తవమేనని, ఉద్యమాల నుంచి బయటకు వచ్చాక ఐదేళ్లు న్యాయవాదిగా పనిచేశానని, 3 సార్లు ములుగు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించానని, 20 ఏళ్ల తర్వాత ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. తనను రాజకీయంగా దెబ్బ తీయడానికే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీ ఎంపీగా గెలిచిన ఈటల రాజేందర్ నేపథ్యం ఏమిటో చెప్పాలని, ఆయన కూడా వామపక్ష భావజాలం నుంచి వచ్చినవారే కదా అని ప్రశ్నించారు. తాను తొలుత ములుగు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో టీడీపీ, బీజేపీ అలియన్స్‌లో పోటీ చేశానని, అప్పుడు బీజేపీకి తాను అర్బన్ నక్సలైట్‌నని గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. ఏడాది కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ చార్జ్‌షీట్ వేసిందని, అందులో ఏమి చెప్పదలుచుకుందని నిలదీశారు.