Share News

Nagarjuna Sagar: సాగర్‌ 18 గేట్లు ఎత్తివేత..

ABN , Publish Date - Aug 29 , 2024 | 04:29 AM

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు 18 క్రస్ట్‌ గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Nagarjuna Sagar: సాగర్‌ 18 గేట్లు ఎత్తివేత..

  • ఎగువ నుంచి 1,81,008 క్యూసెక్కుల వరద

  • శ్రీశైలం ప్రాజెక్టుకు 3,11,953 క్యూసెక్కులు

  • జూరాలకు భారీగా పెరిగిన వరద ప్రవాహం

నాగార్జునసాగర్‌, కేతేపల్లి, మేళ్లచెర్వు, ఆగస్టు 28: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు 18 క్రస్ట్‌ గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రెండు రోజులుగా 2 క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటి విడుదల చేసిన ప్రాజెక్టు అధికారులు బుధవారం మధ్యాహ్నం నుంచి మరిన్ని గేట్లు తెరుస్తూ వచ్చారు. ఒంటిగంటకు 4, 3 గంటలకు 12, సాయంత్రం 4 గంటలకు 14, 7 గంటల సమయంలో 18 క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌కు ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి వరద రాక గంటగంటకు పెరగడంతో క్రమంగా ఒక్కో గేటూ తెరిచారు.


శ్రీశైలం నుంచి సాగర్‌కు 1,81,008 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా.. దిగువకు 1,94,758 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి 3,11,953 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో 6 క్రస్ట్‌ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దులోని పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రవాహం స్వల్పంగా పెరిగింది. ఎగువ కృష్ణా, భీమా నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షాలతో జూరాల జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. దీంతో 3 లక్షల క్యూసెక్కులను శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు.


  • రాష్ట్రంలో రేపు అతి భారీ వర్షాలు!

హైదరాబాద్‌: తెలంగాణలో శుక్రవారం అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సెప్టెంబరు 1, 2 తేదీల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Updated Date - Aug 29 , 2024 | 04:29 AM