Share News

Hyderabad: మరో ఆరుగురు?

ABN , Publish Date - Jul 06 , 2024 | 02:44 AM

కేసీఆర్‌ లక్కీ నంబర్‌ ‘6’ పైన సీఎం రేవంత్‌రెడ్డి గురి పెట్టారు. గురువారం అర్ధరాత్రి... ఆరుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకున్న ఆయన.. మరో ఆరుగురు ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై దృష్టి పెట్టారు.

Hyderabad: మరో ఆరుగురు?

  • కాంగ్రెస్‌లో చేరనున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

  • వారం రోజుల్లోపే చేరిక ముహూర్తం

  • ఎమ్మెల్యేలతో కొలిక్కి వస్తున్న చర్చలు

  • ఇప్పటిదాకా ఒక్కొక్కరుగా చేరిన నేతలు

  • ఇకపై బృందాలుగా చేర్చుకొనే యోచన

  • బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం విలీనమే లక్ష్యం

  • బడ్జెట్‌ సమావేశాలకు ముందే ఆపరేషన్‌

  • మండలిలోనూ మెజారిటీ సాధనపై దృష్టి

  • నేడు కాంగ్రెస్‌లోకి గద్వాల ఎమ్మెల్యే బండ్ల

  • వ్యతిరేకిస్తున్న సరితకు రేవంత్‌ హామీలు

హైదరాబాద్‌, జూలై 5(ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ లక్కీ నంబర్‌ ‘6’ పైన సీఎం రేవంత్‌రెడ్డి గురి పెట్టారు. గురువారం అర్ధరాత్రి... ఆరుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకున్న ఆయన.. మరో ఆరుగురు ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై దృష్టి పెట్టారు. వచ్చే సోమ లేదా మంగళవారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ల పరిధిలోని ఆరుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ పార్టీ గూటికి చేర్చేందుకు చర్చలు జరుగుతున్నాయి. చేరికలు దాదాపుగా ఖరారయ్యాయని, అమావాస్య, మంచి రోజులు కాకపోవడంతో చేరిక వచ్చే వారానికి వాయిదా పడిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వంలో సుస్థిరతే లక్ష్యంగా... అధిష్ఠానం అనుమతితో ఆపరేషన్‌ ఆకర్ష్‌ను ప్రారంభించిన రేవంత్‌రెడ్డి.. ఈ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరుగా పార్టీలో చేర్చుకుంటున్న ఆయన.. ఇక మీదట గుంపులుగా పార్టీలో చేర్చుకునే ప్రక్రియకు తెరలేపారు.


ఇప్పటిదాకా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివా్‌సరెడ్డి, డాక్టర్‌ సంజయ్‌, కాలె యాదయ్యలు సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వచ్చే వారం.. మరో ఆరుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల చేరికకూ రంగం సిద్ధమవుతోంది. కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తిగా ఉన్న ఎమ్మెల్యేలతో సంప్రదింపుల ప్రక్రియ కొనసాగిస్తూనే... చేరికల ప్రక్రియనూ సీఎం రేవంత్‌రెడ్డి కొనసాగించనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటి దాకా ఒక్కొక్కరుగా జరుగుతున్న ఎమ్మెల్యేల చేరిక ప్రక్రియ.. ఇక గుంపులుగా జరగనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎ్‌సఎల్పీలో విలీనం చేసుకున్నప్పుడు.. కేసీఆర్‌ ఏ విధానాన్ని అనుసరించారో.. అదే విధానాన్ని ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను సీఎల్పీలో విలీనం చేసుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్నారు.


శాసనసభలో సాంకేతికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి 38 మంది ఎమ్మెల్యేలు ఉన్న సంగతి తెలిసిందే. వారిలో మూడింట రెండొంతులు అంటే.. కనీసంగా 26 మంది ఎమ్మెల్యేలు చీలి.. ప్రత్యేకంగా శాసనసభా పక్షంగా ఏర్పడి సీఎల్పీలో విలీనం కావాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బడ్జెట్‌ సమావేశాల లోపు ఫిరాయింపు ఎమ్మెల్యేలను విలీనం చేసుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఈ లోపున 26 మందికి పైగా ఎమ్మెల్యేల చేరిక ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్న సీఎం ఇక మీదట ఒక్కొక్కరుగా కాకుండా గుంపులుగా చేర్చుకొనే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే సోమ లేదా మంగళవారం మరో ఆరుగురు ఎమ్మెల్యేలను చేర్చుకొనేందుకు చర్చలు జరుగుతున్నట్లు చెబుతున్నాయి.


ఎమ్మెల్సీల చేరికపైనా దృష్టి

కీలక బిల్లులు, తీర్మానాలు శాసనమండలిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆమోదం పొందడానికి ఆ సభలోనూ మెజారిటీ సాధించే దిశగా సీఎం రేవంత్‌రెడ్డి కసరత్తు చేస్తున్నారు. శాసనమండలిలో 40 మంది సభ్యులకు గాను ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లు రెండు ఖాళీగా ఉన్నాయి. ఉన్న 38 మంది సభ్యుల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీలు పాతిక మంది వరకూ ఉన్నారు. కాంగ్రెస్‌ సంఖ్యాబలం కేవలం నాలుగుగా ఉంది. అయితే పట్నం మహేందర్‌రెడ్డి ఇప్పటికే కాంగ్రె్‌సలో చేరి ఉండడం, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డీ ప్రభుత్వం పట్ల సానుకూలంగానే ఉండడంతో సభలో కాంగ్రె్‌సకు ఆరుగురి మద్దతు లభించినట్లయింది. వీరిద్దరికి తోడుగా.. గురువారం అర్థరాత్రి ఆరుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో సభలో గులాబీల బలం 17కు పడిపోయింది. అయితే, ప్రస్తుతం మండలిలో ఉన్న నలుగురు నామినేటెడ్‌ సభ్యులూ బీఆర్‌ఎస్‌ మద్దతుదారులే కావడంతో ఇప్పటికీ మెజారిటీ సభ్యులు బీఆర్‌ఎస్‌ పక్షానే ఉన్నట్లయింది.


ఇక ఆరుగురు ఎమ్మెల్సీల చేరికతో కాంగ్రెస్‌ పార్టీ బలం 12కు చేరుకుంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ సీట్లూ జత చేరితే పార్టీ బలం 14కు చేరుకోనుంది. సభలో మెజారిటీ సీట్లు కాంగ్రెస్‌ పక్షాన ఉంటేనే కీలక బిల్లులు, తీర్మానాలకు ఇబ్బంది ఉండబోదని భావిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఎమ్మెల్సీల సంఖ్యను 20ని దాటించే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో మరో 7-8 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకునేందుకు సంప్రదింపులు జరుగుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. శాసనమండలిలో మెజారిటీ సాధన ప్రక్రియ కూడా బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యే లోపు ముగించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు చెబుతున్నారు.


స్పీకర్‌ సమయమిచ్చారు.. అందుబాటులోకి రాలేదు: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ‘ముందుగానే శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకొని అసెంబ్లీకి వచ్చాం. మాకు సమయం ఇచ్చినా కూడా ఆయన అందుబాటులోకి రాలేదు’ అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సునీతాలక్ష్మారెడ్డి, పాడికౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో వారు మాట్లాడుతూ తాము ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గాల్లో జరిగే అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ ఉల్లంఘన జరుగుతోందని, ఈ విషయాన్ని చెప్పేందుకే స్పీకర్‌ను కలిసేందుకు వచ్చినట్లు చెప్పారు. అధికారులపై ప్రివిలైజ్‌ మోషన్‌ ఇవ్వడానికి స్పీకర్‌ను కలవాలనుకుంటే.. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా అందుబాటులోకి రాలేదన్నారు.


నేను.. మా అమ్మ బీఆర్‌ఎ్‌సలోనే: కార్తీక్‌రెడ్డి

కాంగ్రె్‌సలోకి వెళతామంటూ తమపై వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, ‘నేను, మా అమ్మ సబితా ఇంద్రారెడ్డి బీఆర్‌ఎ్‌సలోనే ఉంటాం. పార్టీ మారే ప్రసక్తే లేదు’ అని పటోళ్ల కార్తీక్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ ఆరోజు ప్రత్యేక పరిస్థితుల్లో కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎ్‌సలోకి వచ్చామని, రాజకీయ అవసరాలకోసం, సదవుల కోసం మరోసారి పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.


నేడు కాంగ్రె్‌సలోకి గద్వాల ఎమ్మెల్యే బండ్ల

  • వ్యతిరేకిస్తున్న సరితకు రేవంత్‌ హామీలు

    2.jpg

గద్వాల, జూలై 5 : జోగుళాంబ గద్వాల జిల్లాలోని బీఆర్‌ఎస్‌ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరికకు ముహూర్థం ఖరారైంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు. శుక్రవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మంత్రి జూపల్లితో పాటు పలువురు మంత్రులను కలిసి చర్చించి చేరికను ఖరారు చేశారు. అయితే ఎమ్మెల్యే బండ్ల చేరికను జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ సరిత వ్యతిరేకిస్తున్నారు. వారి అనుచరవర్గం శుక్రవారం గాంధీ భవన్‌ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించింది. గురువారం కూడా గద్వాలలో ఆందోళనలు నిర్వహించారు. ఇదిలా ఉండగా ఎంపీ మల్లు రవితో కలిసి సరిత, ఆమె భర్త తిరుపతయ్య, సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి మాట్లాడారు. ఆయన నేనున్నానని వారికి ధైర్యం చెప్పినట్లు సమాచారం. అన్ని విషయాలు పీసీసీ వర్కంగ్‌ ప్రెసిడెంట్‌ మహే్‌షకుమార్‌ గౌడ్‌తో మాట్లాడాలని సూచించడంతో వారు తిరిగి మహే్‌షకుమార్‌ గౌడ్‌తో చర్చలు జరిపారు.

Updated Date - Jul 06 , 2024 | 02:44 AM