Share News

Jogulamba Gadwal: బండ్లను చేర్చుకుంటే ఆత్మహత్యే!

ABN , Publish Date - Jul 05 , 2024 | 03:11 AM

జోగులాంబ గద్వాల జిల్లాలో రాజకీయం గరం గరంగా మారింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకోవద్దంటూ గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కార్యకర్తలు పలుచోట్ల ధర్నాలు నిర్వహించారు.

Jogulamba Gadwal: బండ్లను చేర్చుకుంటే ఆత్మహత్యే!

  • కాంగ్రె్‌సలోకి కృష్ణమోహన్‌రెడ్డి వద్దే వద్దు

  • గద్వాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చేరికపై రగడ

  • కార్యకర్తల ధర్నాలు, ఆత్మహత్యాయత్నాలు

  • సెల్‌టవర్‌ ఎక్కి ఒకరు.. పెట్రోల్‌ పోసుకుని మరో ముగ్గురు..

  • ఎప్పుడు చేరేది రెండ్రోజుల్లో ప్రకటిస్తా: బండ్ల

గద్వాల, జూలై 4: జోగులాంబ గద్వాల జిల్లాలో రాజకీయం గరం గరంగా మారింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకోవద్దంటూ గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కార్యకర్తలు పలుచోట్ల ధర్నాలు నిర్వహించారు. ఓ యువకుడు సెల్‌ టవర్‌ ఎక్కి దూకి చస్తానని హల్‌చల్‌ చేయగా, ధర్నాలో ముగ్గురు యువకులు ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చలు పూర్తయ్యాయని, అమావాస్య తర్వాత ఎమ్మెల్యే కాంగ్రె్‌సలో చేరేందుకు ముహూర్తం ఖరారయ్యిందనే వార్తలు రావడంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఉదయం జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ సరిత క్యాంపు కార్యాలయానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. సరిత అభిమాని అయిన బొంబాయి ప్రసాద్‌ సమీపంలోని సెల్‌టవర్‌ ఎక్కి నిరసనకు దిగాడు. ఎమ్మెల్యేను కాంగ్రె్‌సలో చేర్చుకుంటే టవర్‌ పైనుంచి దూకి చస్తానని హెచ్చరించాడు.


దీంతో పోలీస్‌ బందోబస్తు పెంచి, ఫైర్‌ ఇంజన్‌ను కూడా రప్పించారు. మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్‌ నేతలు సెల్‌టవర్‌పై ఉన్న ప్రసాద్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అధిష్ఠానం తమకు న్యాయం చేస్తుందని చెప్పడంతో కిందకు వచ్చిన ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు.. సెల్‌ టవర్‌పై ఉన్న ప్రసాద్‌కు మద్దతుగా అక్కడే కాంగ్రెస్‌ కార్యకర్తలు ఽధర్నా నిర్వహించారు. గద్వాల మండలం అనంతాపురం గ్రామానికి చెందిన రహీం ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి యత్నించడంతో.. కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే దౌదర్‌పల్లికి చెందిన అనిల్‌ కూడా పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఫైర్‌ సిబ్బంది నీళ్లు చల్లి అడ్డుకున్నారు. ఇదే సమయంలో కేటీదొడ్డిలో నిర్వహించిన ధర్నాలో కృష్ణ అనే యువకుడు కూడా ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.. దాంతో అక్కడున్న వారు కాపాడారు..


రెండ్రోజుల్లో ప్రకటిస్తా..: బండ్ల

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రె్‌సలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఎప్పుడు చేరతాననేది రెండ్రోజుల్లో ప్రకటిస్తానని ఆయన స్వయంగా వెల్లడించారు. గద్వాలలోని తన క్యాంపు కార్యాలయంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి కాంగ్రె్‌సలో చేరికపై తన అనుచరుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అందరినోటా గద్వాల అభివృద్ధి కోసం కాంగ్రె్‌సలో చేరాలనే అభిప్రాయం రావడంతో ఆయన కూడా తన మనసులోని మాట బయటపెట్టారు. గద్వాల అభివృద్ధితో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరముందని, నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను గౌరవించి కాంగ్రె్‌సలో చేరాలనుకుంటున్నానని చెప్పారు. అయితే ఎప్పుడు చేరతాననే దానిపై రెండ్రోజుల్లో స్పష్టత వస్తుందని వివరించారు.

Updated Date - Jul 05 , 2024 | 03:11 AM