Ponguleti: డిసెంబరులో రూ.13 వేల కోట్ల రుణమాఫీ
ABN , Publish Date - Nov 10 , 2024 | 02:30 AM
‘‘రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన 27 రోజుల్లోనే రూ.18వేల కోట్ల రుణమాఫీ చేశాం. మిగిలిన అర్హత గల రైతులందరికీ రూ.13 వేల కోట్ల మేర డిసెంబరు చివరికల్లా రుణమాఫీ చేసి చూపిస్తాం’’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు.
మిగిలిన రైతులందరికీ వర్తింపజేస్తాం: పొంగులేటి
కూసుమంచి, నవంబరు9(ఆంధ్రజ్యోతి): ‘‘రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన 27 రోజుల్లోనే రూ.18వేల కోట్ల రుణమాఫీ చేశాం. మిగిలిన అర్హత గల రైతులందరికీ రూ.13 వేల కోట్ల మేర డిసెంబరు చివరికల్లా రుణమాఫీ చేసి చూపిస్తాం’’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. శనివారం ఖమ్మం జిల్లా కూసుమంచి తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాదాపు 57వేల మందికి ఉద్యోగాలిచ్చామని తెలిపారు. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలను నిర్వహించామన్నారు. రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అన్ని పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొరు. కల్యాణలక్ష్మికి తులం బంగారం ఇస్తామన్న హామీని సైతం త్వరలోనే అమలు చేస్తామని ఆయన చెప్పారు.