Family Donation: రూ.2 కోట్ల సాయం
ABN , Publish Date - Dec 26 , 2024 | 05:15 AM
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ఆ చిత్ర యూనిట్ రూ.2 కోట్ల సాయం అందజేసింది.
శ్రీతేజ్ కుటుంబానికి అల్లు అర్జున్ కోటి, నిర్మాతలు 50 లక్షలు, దర్శకుడు 50 లక్షలు
ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజుకు చెక్కుల అందజేత
మెరుగు పడుతున్న శ్రీతేజ్ ఆరోగ్యం
వెంటిలేటర్, ఆక్సిజన్ లేకుండా శ్వాస
నేడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో
సమావేశం కానున్న సినీ ప్రముఖులు
చిరంజీవి, అల్లు అరవింద్, నాగవంశీ,
సురేశ్‌బాబు తదితరులు పాల్గొనే అవకాశం!
సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించే చాన్స్
బోయినపల్లి/హైదరాబాద్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ఆ చిత్ర యూనిట్ రూ.2 కోట్ల సాయం అందజేసింది. చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ రూ.కోటి, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ రూ.50 లక్షలతోపాటు ఆ సినిమా దర్శకుడు సుకుమార్ మరో రూ.50 లక్షలు ఇచ్చారు. ఈ మేరకు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, సుకుమార్ తరఫున ఆయన కుటుంబ సభ్యులు సంబంధిత చెక్కులను ఎఫ్‌డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు అందజేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీతేజ్‌ను బుధవారం దిల్ రాజుతో కలిసి అల్లు అరవింద్ మరోసారి పరామర్శించారు శ్రీతేజ్ ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద అల్లు అరవింద్ మాట్లాడుతూ.. శ్రీతేజ్ కోలుకుంటున్నాడని, అతని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వైద్యులు చెప్పారని తెలిపారు.
శ్రీతేజ్ శరీరంలో పూర్తి స్థాయిలో కదలికలు వచ్చాయని చెప్పారన్నారు. అతని ఆరోగ్యం పూర్తిస్థాయిలో మెరుగు పడేంతవరకు అన్నిరకాల వైద్య చికిత్సలు అందించడానికి తమవైపు నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకుని మనందరితో కలిసి తిరుగుతాడని ఆశిస్తున్నట్లు చెప్పారు. వారి కుటుంబానికి చేయదలచుకున్న ఆర్థిక సాయానికి సంబంధించి ప్రభుత్వ ప్రతినిధిగా దిల్ రాజుకు అందజేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఆ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా తాము అండగా ఉంటామన్నారు. శ్రీతేజ్ కోలుకుంటున్నాడని, వెంటిలేటర్, ఆక్సిజన్ లేకుండా 72 గంటలుగా శ్వాస తీసుకోగలుగుతున్నాడని ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. అతని కుటుంబానికి అల్లు అర్జున్, నిర్మాతలు, దర్శకుడి తరఫున రూ.2 కోట్ల సాయం అందజేశామన్నారు.
గురువారం సినీ పరిశ్రమకు చెందిన పెద్దలతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తున్నామని చెప్పారు. ఈ మేరకు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ ఇచ్చారని తెలిపారు. కాగా, ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో నిర్వహించనున్న ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితోపాటు ఒకరిద్దరు ఇతర మంత్రులు, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, హోంశాఖ అధికారులు కూడా పాల్గొననున్నారు. సినీ పరిశ్రమ నుంచి నటుడు చిరంజీవితోపాటు నిర్మాతలు నాగవంశీ, అల్లు అరవింద్, సురే్‌షబాబు మరికొంత మంది నిర్మాతలు, దర్శకులు పాల్గొనే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ సమావేశంలో సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రధాన సమస్యలపై చర్చించనున్నారు.
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్
హైదరాబాద్ సిటీ: కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను బుధవారం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పరామర్శించారు. శ్రీతేజ్‌ను చూడగానే త్వరగా కోలుకుంటున్నట్లు కనిపించాడని, ఇందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. శ్రీతేజ్ కుటుంబానికి తనవైపు నుంచి, సినిమా కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున అండగా ఉంటామని చెప్పారు. తనపై ఉన్న కేసు గురంచి ప్రస్తావించగా.. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఆ విషయంపై తాను మాట్లాడలేనన్నారు.