Share News

Hyderabad: వణికిస్తున్న డెంగీ చికున్‌ గున్యా..

ABN , Publish Date - Jul 05 , 2024 | 03:56 AM

విపరీతమైన జ్వరం. ఒళ్లునొప్పులు. ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోవడం.. అడుగు తీసి అడుగు వేయలేనంతగా కీళ్ల నొప్పులు!! రాష్ట్రంలో ఈ తరహా లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. వారికి పరీక్షలు చేయిస్తే.. చాలామందిలో డెంగీ, చికున్‌గున్యా నిర్ధారణ అవుతోంది.

Hyderabad: వణికిస్తున్న డెంగీ చికున్‌ గున్యా..

  • 103-104 డిగ్రీల జ్వరం.. తగ్గిపోతున్న ప్లేట్‌లెట్లు

  • అడుగు తీసి అడుగు వేయలేనంతగా కీళ్లనొప్పులు

  • రాష్ట్రవ్యాప్తంగా టైగర్‌ దోమల స్వైరవిహారం

  • పగటిపూట కుట్టే ఆ దోమలతో వ్యాపిస్తున్న జ్వరాలు

  • సొంత వైద్యం వద్దని వైద్యుల హితవు

హైదరాబాద్‌ సిటీ, జూలై 4 (ఆంధ్రజ్యోతి): విపరీతమైన జ్వరం. ఒళ్లునొప్పులు. ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోవడం.. అడుగు తీసి అడుగు వేయలేనంతగా కీళ్ల నొప్పులు!! రాష్ట్రంలో ఈ తరహా లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. వారికి పరీక్షలు చేయిస్తే.. చాలామందిలో డెంగీ, చికున్‌గున్యా నిర్ధారణ అవుతోంది. వారిలో కొంతమందిని ఆస్పత్రిలో చేర్చుకొని చికిత్స చేయాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. కొద్దిరోజులుగా కార్పొరేట్‌, ప్రైవేట్‌ ఆస్పత్రులకు 103-104 డిగ్రీల జ్వరంతో వస్తున్న ఔట్‌పేషెంట్లలో.. 90ు కేసులు డెంగీ, చికున్‌గున్యావే అయి ఉంటున్నాయని వారు వెల్లడిస్తున్నారు. వారిలోనూ డెంగ్యూ బాధితులే ఎక్కువగా ఉంటున్నారని.. మూడో వంతు కేసులు చికున్‌గున్యావి ఉంటున్నాయని వైద్యులు వివరించారు. అలాగే.. నిత్యం ఓపీకి వస్తునవారిలో కనీసం ఐదో వంతు ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఉంటోందని తెలిపారు. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో అధికారిక లెక్కల ప్రకారం గడిచిన 65 రోజుల్లో 114 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. మేలో 39, జూన్‌లో 56, జూలై 4వ తేదీ వరకు 19 కేసులు నమోదయ్యాయి. ఫీవర్‌ ఆస్పత్రిలో రోజూ 350కి పైగా ఓపీ కేసులు వస్తుండగా, అందులో 50 నుంచి 70 మంది దాకా డెంగ్యూ లక్షణాలు ఉన్నవారేనని సమాచారం. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌ ఆస్పత్రిలో కూడా చాలా మంది డెంగ్యూ లక్షణాలతో వస్తున్నట్లు తెలుస్తోంది.


టైగర్‌ దోమతోనే..

డెంగీ, చికున్‌గున్యా వ్యాప్తికి ఎడెస్‌ ఈజిప్టై అనే దోమ ముఖ్య కారణం. కానీ.. భారతదేశంలో దాని తర్వాత ఆ రెండు జ్వరాల వ్యాప్తికి ప్రధాన కారణమవుతున్న మరో రకం దోమ.. ఎడెస్‌ అల్బోపిక్టస్‌ అలియాస్‌ టైగర్‌ దోమ. ఇప్పుడు ఈ దోమలు రాష్ట్రవ్యాప్తంగా స్వైరవిహారం చేస్తున్నాయి. ఈ దోమలపై పులుల మాదిరిగా చారికలు ఉండడంతో వీటికి ఆ పేరు వచ్చింది. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుండడంతో దీన్ని అర్బన్‌ మస్కిటోగా కూడా పిలుస్తారని వైద్యులు తెలిపారు. డెంగ్యూ రోగిని కుట్టిన టైగర్‌ దోమ.. ఆ తర్వాత ఆరోగ్యవంతమైన వ్యక్తిని కుడితే అతనికి కూడా డెంగీ వచ్చే ప్రమాదం ఉంటుంది. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు దోమలు కుడతాయనే భయంతో తెరలు, కాయిల్స్‌, దోమలు కుట్టకుండా ఒంటిపై రాసుకునే లేపనాలను వాడుతాం. కానీ.. ఈ టైగర్‌ దోమలు పగటిపూట కుడతాయని.. చీకటిపడ్డాక వీటి జాడ ఉండదని వైద్యులు చెబుతున్నారు.


పరిసరాలే స్థావరాలు

టైగర్‌ దోమలు ఇంటి పరిసర ప్రాంతాల్లోనే ఉంటాయి. మురుగు నీరు ఉండే చోట తన స్థావరాన్ని ఏర్పాటుచేసుకుంటుంది. ఉదాహరణకు.. ఎయిర్‌ కూలర్‌లో నిల్వ ఉండే నీటిలో, ఫ్లవర్‌ వాజులు, అక్వేరియం, పగిలిన సీసాలు, కుండపెంకుల్లో వర్షపు నీరు పడి నిలిచే చోట.. మూతలు లేని ట్యాంకుల్లో నివాసం ఏర్పరచుకుని అక్కడే గుడ్లు పెడుతూ తన సంతతిని పెంచుకుంటుంది. ఈ దోమలు రద్దీ ప్రాంతాల్లో ఎక్కువగా సంచరించడం వల్ల చాలా మంది డెంగీ, చికున్‌గున్యా వంటివాటిబారిన పడుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. కాబట్టి.. పగటి పూట కుట్టే ఈ దోమల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఇంటి చుట్టుపక్కల ఎక్కడా నిల్వ నీరు, మురుగు నీరు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.


జ్వరం రాగానే టెస్టులు వద్దు

ఇటీవలికాలంలో చాలామంది 103, 104 జ్వరం.. నీళ్ల విరేచనాలు, ఒళ్లు, కీళ్ల నొప్పుల వంటి లక్షణాలతో ఆస్పత్రికి వస్తున్నారు. అది సాధారణ వైరల్‌ పీవర్‌ అయితే రెండు, మూడు రోజుల్లో తగ్గిపోతుంది. కానీ, చాలా మంది జ్వరం రాగానే డెంగీ, చికున్‌గున్యా పరీక్షలు చేయించుకుంటున్నారు. కానీ.. అలా వెంటనే టెస్టులు చేయించుకోవడం వల్ల ఉపయోగం లేదు. జ్వరం వచ్చిన ఐదురోజులకు శరీరంలో యాంటీబాడీస్‌ తయారవుతాయి. అప్పుడు పరీక్ష చేయిస్తే.. ఒకవేళ ఆ యాంటీబాడీస్‌ ఉంటే పాజిటివ్‌ వస్తుంది. ముందే పరీక్ష చేయిస్తే నెగెటివ్‌ వస్తుంది. దీంతో డెంగ్యూ లేదని భావించి నిర్లక్ష్యంగా ఉంటారు. అది సరి కాదు. అలాగే.. లక్షణాలు కనిపించిన అయిదు రోజుల వరకు యాంటిబయాటిక్‌ మందులు ఇవ్వకూడదు. లక్షణాలను బట్టి పారాసెటమాల్‌, ఫ్లూయిడ్స్‌ వంటివి ఇవ్వాలి. ఐదురోజుల తర్వాత టెస్ట్‌ చేయించి అది ఏ జ్వరమో నిర్ధారించుకోవాలి. డెంగీ వస్తే 6వ రోజు నుంచి ప్లేట్‌లెట్స్‌ తగ్గడం మొదలవుతుంది. ప్లేట్‌లెట్స్‌ సంఖ్య 20 నుంచి 30 వేల లోపునకు పడిపోతేనే అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది.

- డాక్టర్‌ ఆరతి బళ్లారి, ఇంటర్నల్‌ మెడిసిన్‌, కిమ్స్‌ ఆస్పత్రి

Updated Date - Jul 05 , 2024 | 03:56 AM