Share News

Hyderabad: బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌!

ABN , Publish Date - Jun 24 , 2024 | 02:54 AM

బీఆర్‌ఎ్‌సలో మరో వికెట్‌ పడింది. ఆ పార్టీ జగిత్యాల ఎమ్మెల్యే.. గులాబీ పార్టీ ముఖ్యనేత కవితకు అత్యంత సన్నిహితుడు.. డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఆదివారం రాత్రి తన నివాసంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి సమక్షంలో ఆయనకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Hyderabad: బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌!

  • కాంగ్రెస్‌లోకి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్‌

  • కేసీఆర్‌ తనయ కవితకు అత్యంత సన్నిహితుడు

  • పోచారం తర్వాత ఉత్తర తెలంగాణ నుంచి మరో నేత

  • అదే బాటలో మరికొందరు హైదరాబాద్‌ ఎమ్మెల్యేలూ..

  • చర్చలు సఫలం!.. జూలై మొదటివారంలో చేరే అవకాశం

  • గంగుల జంపింగ్‌ కథనాలపై బీఆర్‌ఎస్‌లో కలకలం

  • ఫామ్‌హౌజ్‌కు పిలిపించుకున్న పార్టీ అధినేత కేసీఆర్‌

జగిత్యాల, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎ్‌సలో మరో వికెట్‌ పడింది. ఆ పార్టీ జగిత్యాల ఎమ్మెల్యే.. గులాబీ పార్టీ ముఖ్యనేత కవితకు అత్యంత సన్నిహితుడు.. డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఆదివారం రాత్రి తన నివాసంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి సమక్షంలో ఆయనకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2014లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి చేతిలో ఓడిపోయిన సంజయ్‌ కుమార్‌.. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ (2018, 2023) వరుసగా ఆయనపై విజయాలు సాధించారు.


ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కూడా నిజామాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా సంజయ్‌ విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ, ఆ సీటును బీఆర్‌ఎస్‌ గెలుచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో.. కొంతకాలంగా సంజయ్‌కుమార్‌ కాంగ్రె్‌సతో టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు (దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి) కాంగ్రెస్‌ పార్టీలోచేరిన సంగతి తెలిసిందే. పోచారం కాంగ్రె్‌సలో చేరిన రెండోరోజే.. మరో పెద్ద వికెట్‌ పడడం బీఆర్‌ఎ్‌సకు షాకే! నిజానికి.. కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల ‘కారు’ దిగి హస్తం గూటికి చేరడానికి సర్వం సిద్ధమైందంటూ శనివారం విస్తృతంగా ప్రచారం జరిగింది.


అంతలోనే అనూహ్యంగా సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. వీరే కాదు.. హైదరాబాద్‌కు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు జూలై మొదటివారంలోగా కాంగ్రె్‌సలో చేరే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈమేరకు చర్చలు సఫలమైనట్టుగా చెబుతున్నారు. 8-10మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరుతున్నట్టు వారి పేర్లతో సహా దానం ఇటీవలే ప్రకటించడం గమనార్హం. ఇదిలా ఉండగా.. గంగుల కాంగ్రె్‌సలో చేరతారంటూ వార్తల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. ఆయన్ను తన ఫామ్‌హౌజ్‌కు పిలిపించుకుని మాట్లాడారు. గంగులతోపాటు కరీంనగర్‌ కార్పొరేషన్‌కు చెందిన కార్పొరేటర్లు కూడా ఉన్నారు. గంగుల ఫామ్‌హౌజ్‌ వద్దకు వచ్చేసరికే.. మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ కూడా అక్కడికి చేరుకున్నారు.

Updated Date - Jun 24 , 2024 | 02:54 AM