Share News

Telangana Thalli: తెలంగాణ తల్లి పండుగ

ABN , Publish Date - Dec 09 , 2024 | 02:57 AM

రాష్ట్ర సచివాలయంలో సోమవారం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో ఇకపై ఏటా డిసెంబరు 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Telangana Thalli: తెలంగాణ తల్లి పండుగ

  • ఏటా డిసెంబరు 9న అవతరణ ఉత్సవం

  • నేడు అసెంబ్లీలో ప్రకటించనున్న సీఎం రేవంత్‌

  • విగ్రహం ఆవిష్కరణకు ముందే ఉత్తర్వులు

  • నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

  • ఆర్‌వోఆర్‌-2024 చట్టంపైనే ప్రధానంగా చర్చ!

  • రైతు భరోసా పథకం విధివిధానాలపై కూడా

  • పంచాయతీరాజ్‌ చట్టసవరణ బిల్లుకు ఆమోదం!

  • మూసీ, హైడ్రా ప్రస్తావనకు వచ్చే అవకాశం

  • వారంపాటు సమావేశాలు.. వాడీవేడి ఖాయం

  • అస్త్రశస్త్రాలతో సిద్ధమైన అధికార, విపక్షాలు

హైదరాబాద్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సచివాలయంలో సోమవారం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో ఇకపై ఏటా డిసెంబరు 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉత్సవం సందర్భంగా రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం’ ఆలాపన జరగనుంది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం శాసనసభలో ప్రకటన చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి తొలి ప్రకటన 2009 డిసెంబరు 9న వెలువడిన విషయం తెలిసిందే. దీంతో ఆ రోజును పండుగలా నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చిన రేవంత్‌రెడ్డి సర్కారు.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానుండగా.. తొలి రోజు సమావేశంలోనే తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవంపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేయనున్నారు. దీంతోపాటు విగ్రహం రూపకల్పన తదితర అంశాలపైనా ప్రకటన చేస్తారు. అనంతరం ఆ ప్రకటనపై సభలో చర్చ జరగనుంది. చర్చ ముగిసిన తర్వాత తెలంగాణ తల్లి ఉత్సవాల నిర్వహణపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఉత్తర్వులు జారీ అయ్యాక.. సచివాలయంలో జయజయహే తెలంగాణ గీతాలాపన నడుమ.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఆ విగ్రహ శిల్పి రమణారెడ్డికి, జయ జయహే గీత రచయిత అందెశ్రీకి సన్మానం చేస్తారు. ఈ సందర్భంగా గద్దర్‌, గూడ అంజన్న వంటి కళాకారుల త్యాగాలకు గుర్తుగా ఓ ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది.


  • సోనియాకు జన్మదిన కానుక..!

ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని 2009లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిన సంగతి తెలిసిన విషయమే. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీనే తెలంగాణకు తల్లి అంటూ కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు ప్రకటనలు కూడా చేస్తుంటారు. తాజాగా సోనియాగాంధీ పుట్టిన రోజున తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి.. ఏటా అదే రోజున ఉత్సవాలు నిర్వహించాలన్న నిర్ణయానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రావడం ఒక రకంగా ఆమెకు ఇస్తున్న జన్మదిన కానుకేనని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.


  • ఏడు పనిదినాల పాటు సమావేశాలు..

సోమవారం ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఐదు నుంచి ఏడు పని దినాలపాటు కొనసాగే అవకాశం ఉంది. పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మంగళ, బుధ వారాలు విరామం ఇచ్చే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. తొలిరోజు సమావేశానంతరం స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అధ్యక్షతన జరిగే బీఏసీ భేటీలో సమావేశాల అజెండాపై స్పష్టత రానుంది. అయితే ఈ సమావేశాల్లో ప్రధానంగా రెవెన్యూ శాఖకు సంబంధించి ఆర్‌వోఆర్‌-2024 బిల్లుపైనే చర్చ జరగనుంది. అలాగే ముగ్గురు పిల్లలు ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం, ప్రతి మండలంలోనూ కనీసం ఐదు ఎంపీటీసీలు ఉండేలా నిబంధన, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారు, ఒకే పర్యాయానికి వర్తింపు వంటి సవరణలు చేస్తూ పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లునూ ఈ సమావేశాల్లోనే చర్చకు పెట్టనున్నారు. కాగా, జీతాలు, పింఛను చెల్లింపు, అనర్హతల తొలగింపు, పురపాలక సంఘాలు, జీహెచ్‌ఎంసీ, వస్తు సేవల పన్ను చట్టాలకు సంబంధించిన సవరణ బిల్లులను ప్రవేశ పెట్టనున్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసాను కచ్చితంగా అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో రైతు భరోసా విధివిధానాలపైనా ఈ సమావేశాల్లోనే చర్చించనున్నారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా సాధించిన విజయాలపైనా సీఎం రేవంత్‌ ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు.


  • వాడీవేడిగా సభలు!

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం మూసీ ప్రక్షాళన, హైడ్రా కూల్చివేతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న సమావేశాలు కావడంతో హోరాహోరీగానే చర్చ జరిగేందుకు ఆస్కారం ఉందంటున్నారు. ఈ అంశాలపై సభను వేదికగా చేసుకుని సీఎం రేవంత్‌రెడ్డి సమగ్ర వివరణ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే సమయం లో ఏడాది పాలనా వైఫల్యాలపై చార్జిషీట్లు విడుదల చేసిన బీఆర్‌ఎస్‌, బీజేపీ. ఈ సమావేశాల్లో ప్రభుత్వంపై ఎదురుదాడి చేసేందుకు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపైనా ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌.. అసెంబ్లీ సమావేశాలను వేదికగా చేసుకుని కార్యాచరణ చేపట్టే అవకాశం ఉందంటున్నారు. ప్రభుత్వంపై దాడికి ప్రతిపక్షాలు, వారిపై ప్రతిదాడికి ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో సోమవారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలు ఆసక్తి రేపనున్నాయి.


  • అధికారులతో స్పీకర్‌, చైర్మన్‌ సమావేశం..

శాసనసభ, మండలి శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆదివారం ప్రభుత్వ, పోలీసు శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. స్పీకర్‌ చాంబర్‌లో జరిగిన ఈ సమావేశంలో శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్‌ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మునిసిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్‌, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, డీజీపీ జితేందర్‌, హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ మాట్లాడుతూ... శాసనసభ సమావేశాల హుందాతనం, ఔన్నత్యం కాపాడుకుంటూ ప్రతి అంశంపైనా సమగ్ర చర్చ జరగాల్సి ఉందన్నారు. గతంలో లాగానే అధికారులు, పోలీసులు అన్ని విధాలుగా సహకరించాలన్నారు. గౌరవ సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని అధికారులకు సూచించారు. గత సమావేశాలకు సంబంధించిన ప్రశ్నలకు పెండింగులో ఉన్న జవాబులను వెంటనే పంపించాలన్నారు. సభలో సభ్యులు ప్రస్తావించిన అన్ని అంశాలకు సంబంధించిన సరైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలన్నారు. సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలని, ప్రతి శాఖ తరఫున ఒక నోడల్‌ అధికారిని నియమించాలని సూచించారు.


  • ప్రొటోకాల్‌ విషయంలో ఇబ్బందులు

తాము జిల్లాల్లో పర్యటిస్తున్నప్పుడు ప్రొటోకాల్‌ నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయని మండలి గుత్తా సుఖేందర్‌రెడ్డి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ప్రొటోకాల్‌ అమలు విషయంలో వివాదాలు, ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ.. ప్రభుత్వాధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రధాన గేట్ల వద్ద ఉండే పోలీసు సిబ్బంది.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను గుర్తించట్లేదంటూ ఫిర్యాదులు వస్తున్నాయని, ఇకపై అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను శ్రీధర్‌బాబు ఆదేశించారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని, తనిఖీలు నిర్వహించి.. సమావేశ మందిరంలోకి నిషేధిత వస్తువులను తీసుకురాకుండా చూడాలని సూచించారు.

Updated Date - Dec 09 , 2024 | 08:26 AM