Share News

Jagga Reddy: సీఎం రేవంత్‌రెడ్డి.. రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తే.. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ ఇబ్బంది పడుతున్నరు

ABN , Publish Date - Aug 18 , 2024 | 03:15 AM

‘‘రాష్ట్రంలోని రైతులకు సీఎం రేవంత్‌రెడ్డి.. ఒకే కిస్తీలో రూ.2 లక్షల మేరకు రుణమాఫీ చేయడంతో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులు తెగ ఇబ్బంది పడిపోతున్నరు.

Jagga Reddy: సీఎం రేవంత్‌రెడ్డి.. రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తే.. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ ఇబ్బంది పడుతున్నరు

  • పదేళ్లలో ఒకే కిస్తీలో ఎందుకు మాఫీ చేయలేకపోయామా అని వారికి నిద్ర పట్టట్లేదు

  • మైండ్‌బ్లాక్‌ అయి.. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నరు

  • రుణమాఫీతో రైతాంగం సంతోషంగా ఉంది

  • బీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రం ఓర్చుకోలేకపోతోంది

  • రేవంత్‌రెడ్డికి సవాల్‌ చేయాల్సింది కేసీఆరే కానీ.. కేటీఆర్‌ కాదు

  • వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ సవాల్‌ను నేను స్వీకరిస్తున్న

  • సిద్దిపేట, సిరిసిల్లల్లో రైతు రుణమాఫీ చర్చిద్దామా?: తూర్పు జగ్గారెడ్డి సవాల్‌

హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలోని రైతులకు సీఎం రేవంత్‌రెడ్డి.. ఒకే కిస్తీలో రూ.2 లక్షల మేరకు రుణమాఫీ చేయడంతో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులు తెగ ఇబ్బంది పడిపోతున్నరు. ఈ పదేళ్లలో.. ఒకే కిస్తీలో ఎందుకు మాఫీ చేయలేకపోయామా అని చెప్పి వారికి నిద్రపట్టట్లేదు. పదేళ్లు అధికారంలో ఉండి.. రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయలేకపోయామన్న అసంతృప్తి, మనోవేద నతో కేటీఆర్‌, హరీశ్‌లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నరు. మైండ్‌ బ్లాక్‌ అయిపోయి.. పిచిపిచ్చిగా మాట్లాడుతున్నరు’’ అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.


శనివారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఆగస్టు 15 కల్లా రైతుకు రూ.2 లక్షల మేరకు రుణాన్ని మాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి.. చేసి చూపించారని, దీంతో రైతాంగమూ సంతోషంగా ఉందన్నారు. పదేళ్లలో విడతల వారీగా కూడా పూర్తిగా రుణమాఫీ చేయలేకపోయిన బీఆర్‌ఎస్‌ వాళ్లు.. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రైతుల రుణాన్ని ఒకే కిస్తీలో మాఫీ చేసిన సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించడం సరికాదన్నారు. సాంకేతిక సమస్యలతో రుణమాఫీ కాని వారికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకునే అవకాశమూ ముఖ్యమంత్రి కల్పించారని చెప్పారు.


  • వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వర్సెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

‘‘రుణమాఫీకి సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. సీఎం రేవంత్‌కు సవాల్‌ విసరాల్సింది కేటీఆర్‌ కాదు.. కేసీఆర్‌! బీఆర్‌ఎస్‌ పార్టీకి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అయితే.. టీపీసీసీకి నేను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌. కేటీఆర్‌ సవాల్‌ను నేను స్వీకరిస్తున్న. రైతు రుణమాఫీపైన చర్చకు.. సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో ఎక్కడికి రమ్మంటారు?’’ అంటూ కేటీఆర్‌కు జగ్గారెడ్డి సవాల్‌ విసిరారు. కాదనుకుంటే తమ మంత్రులు తుమ్మల, ఉత్తమ్‌, పొగులేటిల్లో ఎవరినైనా రిక్వెస్ట్‌ చేసి తీసుకువస్తానన్నారు. అధికారం కోల్పోయి.. కాంగ్రెస్‌ ప్రభుత్వ పథకాలు చూశాక.. కేటీఆర్‌, హరీశ్‌రావుల పరిస్థితి తెగిన గాలి పటంలాగా మారిందన్నారు.


  • పదేళ్లలో ప్రజలు బాధలు చెప్పుకునే పరిస్థితీ లేదు

‘‘తన క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్‌ నాయకులు దాడి చేశారని, ఇలాంటివి బీఆర్‌ఎస్‌ హయాంలో జరగలేదంటూ హరీశ్‌రావు మాట్లాడుతున్నడు. కానీ పదేళ్లలో ఎంత దుర్మార్గపు పాలనను అందించారు? ప్రజలు, ఉద్యోగులు, మహిళలు తమ బాధలు చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. ధర్నా చౌక్‌ను లేకుండా చేసి.. నిరసన తెలిపే స్వేచ్ఛ లేకుండా పరిపాలించారు. ఆ రోజులను హరీశ్‌రావు మరిచిపోయిండా? ఇదంతా వారి సంప్రదాయం కాదా?’’ అంటూ జగ్గారెడ్డి నిలదీశారు.


బీఆర్‌ఎస్‌ పార్టీ వారు చేసిన దాంట్లో కాంగ్రెస్‌ శ్రేణులు చేసింది గోరంత మాత్రమేనని, జస్ట్‌ ఝలక్‌ ఇచ్చారని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో సిద్దిపేటలోని ఓ పోలీ్‌సస్టేషన్లో అత్యంత భయానక పరిస్థితులుండేవని, అక్కడ కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు చిత్రహింసలు పెట్టేవారన్నారు. అప్పటి సీఐ సురేందర్‌రెడ్డి.. హరీశ్‌రావు ఏజెంటుగా పనిచేసేవాడని ఆరోపించారు. నేరెళ్ల బాధితులనైతే సంసారాలకు కూడా పనికి రాకుండా కొట్టారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Aug 18 , 2024 | 03:15 AM