Share News

Kottur: దొంగలను పట్టించిన యూపీఐ చెల్లింపు..

ABN , Publish Date - Jul 27 , 2024 | 04:46 AM

కిరాణా దుకాణం నడుపుతున్న మహిళ మెడలోంచి పుస్తెల తాడు కొట్టేసేందుకు యత్నించి ఇద్దరు దొంగలు అడ్డంగా బుక్కయ్యారు. అంతకు ముందు ఆమె దుకాణంలో సిగరెట్లు కొని.. చేసిన పేటీఎం చెల్లింపు వారి వివరాలను బట్టబయలు చేసింది.

Kottur: దొంగలను పట్టించిన యూపీఐ చెల్లింపు..

కొత్తూర్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): కిరాణా దుకాణం నడుపుతున్న మహిళ మెడలోంచి పుస్తెల తాడు కొట్టేసేందుకు యత్నించి ఇద్దరు దొంగలు అడ్డంగా బుక్కయ్యారు. అంతకు ముందు ఆమె దుకాణంలో సిగరెట్లు కొని.. చేసిన పేటీఎం చెల్లింపు వారి వివరాలను బట్టబయలు చేసింది. రంగారెడ్డి జిల్లా కొత్తూర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని కొడిచర్ల తండా గ్రామ పంచాయతీ ఖాజీగూడ తండాలో కేతావత్‌ మంజుల కిరాణా దుకాణం నడుపుతోంది. కేశంపేట మండలం రాళ్లగండి తండాకు చెందిన పవన్‌, వెంకటేశ్‌లు గురువారం మంజుల షాపు వద్దకు వచ్చి సిగరెట్లు, బిస్కెట్లు కొని.. పేటీఎం ద్వారా డబ్బులు చెల్లించారు.


అనంతరం ఆమె మెడలో నుంచి పుస్తెలతాడును తెంపేందుకు యత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో ఇద్దరూ పారిపోయారు. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. మంజుల షాపులో పేటీఎం ద్వారా డబ్బులు చెల్లించిన విషయాన్ని గుర్తించారు. నిందితుడి ఖాతా ఆధారంగా చిరునామాను కనుగొన్నారు. శుక్రవారం రాళ్లగండి తండాలో ఆ ఇద్దరు దొంగలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడు పవన్‌ గతంలో స్మార్ట్‌ ఫోన్‌లో గేమ్‌లు ఆడి డబ్బులు పోగొట్టుకున్నాడని, తిరిగి డబ్బులు సంపాదించేందుకు దొంగతనాన్ని ఎంచుకున్నాడని, ఇందుకు వెంకటేశ్‌ సహాయం కోరాడని పోలీసుల విచారణలో తేలింది.

Updated Date - Jul 27 , 2024 | 04:46 AM