CM Chandrababu : కొంచెమైనా బాధ్యత ఉండొద్దా?
ABN , Publish Date - Feb 21 , 2025 | 03:33 AM
అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏమీ చేయనివారు ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నారంటూ మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

కోడ్ ఉండగా మిర్చి యార్డుకు ఎలా వెళ్తారు?
పైగా భద్రత కల్పించలేదంటూ యాగీ
తన హయాంలో రైతులకు ఏమీ చేయని జగన్
ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నారు: చంద్రబాబు
ABN Andhrajyothy: ప్రజాసమస్యల పరిష్కారం కోసం రాజకీయాలను చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏమీ చేయనివారు ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నారంటూ మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా జగన్ బాధ్యత లేకుండా గుంటూరు మిర్చి యార్డులోకి వెళ్లారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘వైసీపీ హయాంలో రైతులకు ఒక్క పైసా ఇవ్వలేదు. వారికోసం చేసిందేమీ లేదు. రాష్ట్రంలో మిర్చి రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2019కి ముందు ధరలు తగ్గితే దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.138 కోట్లు విడుదల చేసి మిర్చి రైతులను ఆదుకున్నాం’’ అని గుర్తుచేశారు. బుధవారం గుంటూరు మిర్చి యార్డును జగన్ సందర్శించిన సమయంలో జరిగిన ఘటనలపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం దేశంలోని రాజకీయ పార్టీలు నడుచుకుంటాయి. ఈసీ వెళ్లొద్దని చెప్పినా వినకుండా జగన్ మిర్చి యార్డుకు వెళ్లారు. తమ అక్రమ పనులకు భద్రత కల్పించాలని కోరడం సరికాదు. రాజకీయనేతలు ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలేగానీ రౌడీయిజం చేస్తామనడం సరికాదు. చట్టవిరుద్ధ పనులకు భద్రత ఇవ్వడం ఎప్పుడన్నా చూశామా? మీరు చేసే చట్ట వ్యతిరేక పనులకు పోలీసులు రక్షణగా ఉండాలా? ఇది సరికాదు. ఇలాంటి రాజకీయ నాయకులను, పార్టీలను ఎప్పుడూ చూడలేదు.’’ అని జగన్‌పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మిర్చి రైతుల సమస్యలపై సీఎం, మంత్రికి లేఖ రాయొచ్చు. గవర్నర్‌కు, కేంద్రానికి చెప్పొచ్చు. అసెంబ్లీలో మాట్లాడొచ్చు. ఆ పార్టీలు అవలంభించే తీరు ముఖ్యం. రైతుల మేలు కోసం ఎవరూ ఏం చెప్పినా వింటామ’’ని సీఎం చంద్రబాబు తెలిపారు.