Araku : ఉత్సాహంగా అరకు చలి ఉత్సవ్
ABN , Publish Date - Feb 02 , 2025 | 05:04 AM
‘అరకు చలి ఉత్సవ్’ రెండో రోజైన శనివారం ఉత్సాహంగా సాగింది. ప్రధాన కేంద్రమైన డిగ్రీ కళాశాల మైదానం సందర్శకులతో కిటకిటలాడింది.

రెండో రోజు పోటెత్తిన పర్యాటకులు.. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
అరకులోయ/డుంబ్రిగుడ, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): ‘అరకు చలి ఉత్సవ్’ రెండో రోజైన శనివారం ఉత్సాహంగా సాగింది. ప్రధాన కేంద్రమైన డిగ్రీ కళాశాల మైదానం సందర్శకులతో కిటకిటలాడింది. ఉదయం జిల్లా కలెక్టర్ దినేశ్‌కుమార్ బొర్రా గుహల వద్ద నుంచి సైక్లింగ్ పోటీలను ప్రారంభించారు. అనంతరం అరకులోయ ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో విలుదగల్ పార్కును ప్రారంభించి, తన తల్లి పేరున మొక్కలు నాటారు. పద్మాపురం బొటానికల్ గార్డెన్‌లో అరకు బొకేను ఆవిష్కరించారు. ప్రధాన వేదికపై సాయంత్రం ప్రదర్శించిన విజయనగరం జిల్లా కళాకారుల చెక్క భజన, అరకులోయ మండలం చొంపి గిరిజనుల ధింసా నృత్యం, శ్రీకాకుళం కళాకారుల తప్పెటగుళ్లు, పార్వతీపురం మన్యం గిరిజనుల కందికొట్ల ప్రదర్శన వీక్షకులను అలరించాయి. మణిపూర్, నాగాలాండ్, తమిళనాడు హ్యాండ్‌లూమ్స్, ఎంబ్రాయిండింగ్ స్టాల్స్ పర్యాటకులతో కిటకిటలాడాయి. చలి ఉత్సవ్‌లో తొలిసారిగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ రైడ్‌కు అనూహ్య స్పందన లభించింది. అయితే సాయంత్రం నుంచి హెలికాప్టర్ రైడ్‌ను నిర్వాహకులు నిలిపివేయడంతో పర్యాటకులు, స్థానికులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
Also Read: ఏపీ జీవనాడికి ఊపిరి పోసిన నిర్మలమ్మ
For AndhraPradesh News And Telugu News