Sankranthi Kodi Pandalu:జోరుగా కోడి పందేలు.. చేతులు మారుతున్న కోట్లు
ABN , Publish Date - Jan 12 , 2025 | 07:45 AM
Kodi Pandalu: సంక్రాంతి పండుగ మూడు రోజులు లక్ష్యంగా చేసుకుని కోడి పందేల వ్యాపారం జోరుగా సాగుతోంది. నిమిషాల వ్యవధిలోనే కోట్లకు కోట్లు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అయితే పోలీసులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని ప్రజలు అంటున్నారు
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ అంటే మొదటగా గుర్తుకు వచ్చేది కోడిపందేలు. వీటిలో పందేలు కాయడానికి ఎంతోమంది ఉత్సాహం చూపిస్తుంటారు. గతంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ పందేలను ఆడేవారు కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో కోడి పందేలు ఆడుతున్నారు. దీని ద్వారా కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు సరదాగా మొదలైన పందేలు.. ఇప్పుడు ఒక వ్యాపారంగా మారాయని చెప్పొచ్చు. ఈ పందేలను ఆడటానికి బలంగా ఉన్న కోడి పుంజులను ఎంపిక చేసుకుంటారు. కొన్ని నెలల ముందునుంచే వాటికి పౌష్టికాహారం పెట్టి పందేల్లో రాణించేలా శిక్షణ ఇస్తారు. దీని కోసం ఎంత ఖర్చయినా భరిస్తారు. ఇలా పెంచిన కోడి పుంజులను పందేల సమయంలో బరిలోకి దింపుతారు. కొంతమంది వీటి ద్వారా నిమిషాల వ్యవధిలో లక్షలు సంపాదిస్తుంటే.. మరికొంతమంది లక్షలు పోగొట్టుకుంటుంటారు.
టోకెన్లు పెట్టి మరీ వసూళ్లు
కోళ్ల పందేల కోసం ఒక ప్రాంతాన్ని నిర్వాహకులు ఎంపిక చేస్తారు. అందులో బరిని ఏర్పాటు చేసి కోడి పందేలు నిర్వహిస్తుంటారు. ఈ పందేల్లో గెలిచిన వారి నుంచి కొంత నగదును వసూలు చేస్తుంటారు. ఇదేకాకుండా ఈ పందేలు ఆడటానికి, చూడటానికి వచ్చిన వారి నుంచి కూడా టోకెన్లు పెట్టి మరి కొంత నగదు వసూలు చేస్తారు. పందేలు జరిగే ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేసి వాహనదారుల నుంచి డబ్బులు తీసుకుంటారు. ఇలా పందేలు నిర్వహించడం వల్ల ప్రజల నుంచి వివిధ రూపాల్లో భారీగా నగదు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
చేతులు మారుతున్న కోట్లు
కోళ్ల పందేలను సంక్రాంతి పండుగ లక్ష్యంగానే నిర్వహిస్తుంటారు.ఈ సందర్భంగా గంటల వ్యవధిలోనే లక్షలకు లక్షలు చేతులు మారుతుంటాయి. పందెం కోళ్లపై పెట్టుబడి ఆదాయం రెండింతలు అవుతుందనే ప్రచారం ఉంది. దీంతో చాలామంది ఈ పందేలను కాయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇలా సంక్రాంతి సీజన్‌లో కోడి పందేలా వ్యాపారం మూడు పూవ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే బరులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. మరోవైపు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ పందేలు జోరుగా సాగుతున్నాయి.
ఆసక్తి చూపిస్తున్న ప్రముఖులు
ఈ పందేలను చూడటానికి ఎక్కడెక్కడి నుంచో జనం భారీగా తరలివస్తుంటారు. ముఖ్యంగా ఏపీలోని జిల్లాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, కర్ణాటక, చైన్నె తదితర ప్రాంతాల నుంచి కూడా ఈ పందేలను చూడటానికి వస్తుంటారు. సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అనేక మంది వస్తుంటారు. వీరు కూడా పందేలు కాయడానికి ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజులనే లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాపారం జోరుగా కొనసాగుతోంది.