Amit Shah:మోదీ - బాబు జోడిపై అమిత్ షా.. ఏమన్నారంటే
ABN , Publish Date - Jan 19 , 2025 | 02:07 PM
Amit Shah: స్టీల్ ప్లాంట్ విషయంలో ఆంధ్రులు ఆత్మగౌరవం ముడి పడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. సున్నితమైన అంశంలో కేంద్రం ప్రజలకు భరోసా ఇచ్చిందని గుర్తుచేశారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు కష్టపడ్డారని అన్నారు. గత ఐదేళ్లల్లో రాజధాని నిర్మాణం నిలిపివేశారని అమిత్ షా చెప్పారు.

విజయవాడ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. NDRF 20వ వ్యవస్థాపక దినోత్సవం, NIDM దక్షిణ సంస్థ కార్యాలయం అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ఇక్కడ ఒకే సమయంలో మూడు కార్యక్రమాలు నిర్వహించుకున్నామని తెలిపారు. ఏపీలో కూటమికి మంచి విజయం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ(ఆదివారం) కొండపావులూరులో NDRF రైజింగ్ డే వేడుకలు జరిగాయి. NDRF 10వ బెటాలియన్‌ను ముఖ్యఅతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరై ప్రారంభించారు. NDRF పరికరాల గ్యాలరీని అమిత్‌షా సందర్శించారు. తిరుపతి రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ను.. వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రులు రామ్మోహన్, బండి సంజయ్, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే NDRF ఉంటుందని అన్నారు. మనుషుల విపత్తు నుంచి కాపాడటానికి NDA ముందు ఉంటుందని చెప్పారు. 2019 నుంచి ఏపీని ఏవిధంగా ధ్వంసం చేశారో మనమంతా చూశామని తెలిపారు. చంద్రబాబు, మోదీ జోడీల నాయకత్వంలో ఏపీ మూడింతల ప్రగతి సాధిస్తుందని అన్నారు. సీఎం చంద్రబాబు పరిపాలన దక్షతతో పని చేస్తున్నారని అన్నారు. ఆరు నెలల్లో ఏపీకి మోదీ రూ. 3 లక్షల కోట్లు సాయం అందించారని తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రూ.11,440 కోట్లు సాయం కింద కేంద్రం కేటాయించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుర్తుచేశారు.
2028 నాటికి పోలవరం పూర్తి చేస్తాం..
‘‘స్టీల్ ప్లాంట్ విషయంలో ఆంధ్రుల ఆత్మగౌరవం ముడి పడి ఉంది. సున్నితమైన అంశంలో కేంద్రం ప్రజలకు భరోసా ఇచ్చింది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు కష్టపడ్డారు. గత ఐదేళ్లల్లో రాజధాని నిర్మాణం నిలిపివేశారు. ఇప్పుడు కూటమి వచ్చాక కేంద్రం నిధులు ఇచ్చి పనులు ప్రారంభించింది. రైల్వే జోన్ విషయంలో కేంద్రం మాట నిలబెట్టుకుంది. ఏపీకి జీవధార అయిన పోలవరం నిర్మాణం పూర్తి చేసి 2028 నాటికి నీరు ఇచ్చీ తీరుతాం. రూ. 2 లక్షల కోట్లతో విశాఖపట్నం గ్రీన్ ఎనర్జీకి కేటాయించాం. ఎయిమ్స్‌ను రూ. 1600 కోట్లతో నిర్మాణం చేస్తున్నాం. లక్షా 20 వేల కోట్లతో జాతీయ రహదారులు నిర్మాణం జరుగుతుంది. చంద్రబాబు వెనుక మేమంతా ఉన్నాం.. ఏపీని అభివృద్ధి చేస్తాం. NIDM టీం అద్భుతమైన పని తీరు చూపింది. డిజార్డర్స్ మేనేజ్మెంట్ శిక్షణ వరకే పరిమితం కాదు. విపత్తు వస్తే... అన్ని వైపులా నుంచి సహకారం అందించాలి. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉంది. గ్రామాల దగ్గర నుంచి కేంద్రం వరకు కలిసి పని చేస్తే వైపరీత్యాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. గతంలో ఉపశమనం గురించే పాలకులు ఆలోచన చేసే వారు. ఇప్పుడు వాళ్లను రక్షించడం, లేదా అసలు ముందే ఇబ్బందులు రాకుండా చూసే పరిస్థితి తెచ్చాం.ముందే విపత్తు గుర్తించి వారిని ఎలా సిద్ధం చేయాలనేది చూస్తున్నాం. NDRF టీం మొత్తానికి నా ధన్యవాదాలు, అభినందనలు. అతి తక్కువ సమయంలో వారి నమ్మకాన్ని నిజం చేసుకునేలా సేవలు అందిస్తున్నారు. హోం మంత్రిగా ఎక్కడకి వెళ్లినా NDRF టీం పై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు’’ అని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
అమిత్ షా పని తీరును ఆదర్శంగా తీసుకోవాలి: సీఎం చంద్రబాబు
అమిత్ షా పని తీరును అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 2014లో NDRF కార్యాలయం కోసం శంకుస్థాపన చేశామని గుర్తుచేశారు. 2018లో ఇక్కడ NIDM కార్యాలయం నిర్మాణం కోసం శంకుస్థాపన చేశామని చెప్పారు. వీటికోసం ఏపీ ప్రభుత్వం యాభై ఎకరాలు కేటాయించిందని అన్నారు. నేడు మళ్లీ ఎన్డీఏ హయాంలోనే వీటిని ప్రారంభించామన్నారు. ఎటువంటి విపత్తు వచ్చినా సమర్ధవంతంగా NDRF పని చేస్తుందన్నారు. కొన్ని లక్షల మంది ప్రాణాలను వారు తమ ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడారని చెప్పారు.నీరు, భూమి, ఆకాశం ఎక్కడైనా వారు సేవలు అందించడంలో ముందుంటారని తెలిపారు. హుద్ హుద్ తుఫాన్, విజయవాడ వరదల సమయంలో వారి సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. సారథ్యంలో ఎన్నో విపత్తులను ఎదుర్కొన్నారని చెప్పుకొచ్చారు. సిబ్బందికి అవసరమైన అన్ని వనరులు ప్రభుత్వం పరంగా అందించారని వెల్లడించారు. టెర్రరిస్టు, నక్సలైటు, ఇతర సమస్యలను అమిత్ షా బాగా పరిష్కరించారని సీఎం చంద్రబాబు తెలిపారు.
రాజకీయ నాయకులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేస్తారని.. అమిత్ షా మాత్రం వాటి లోతుల్లోకి వెళ్లి సమీక్ష చేసి పరిశీలిస్తారని వ్యాఖ్యానించారు. అమిత్ షా సారథ్యంలో దేశంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని చెప్పారు. వికసిత్ భారత్ 2047 గురించి ప్రజలంతా మాట్లాడుకుంటున్నారని అన్నారు. మోదీ కలలను సాకారం చేసేందుకు అందరూ పని చేస్తున్నారని తెలిపారు. ఏపీలో కూడా విజన్ 2047 లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు. 2047 నాటికి ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానంలో ఉంటుందని తెలిపారు. విభజన వల్ల నష్టపోయిన ఏపీని అన్ని విధాలా కేంద్రం ఆదుకుంటుందని ఉద్ఘాటించారు. ధర్మవరం సభ ద్వారా కూటమి విజయం ఖాయమైందని గుర్తుచేశారు. 93 శాతం స్టైక్ రేట్‌తో ఏపీ ప్రజలు కూటమికి పట్టం కట్టారని సీఎం చంద్రబాబు వెల్లడించారు. వెంటిలేటర్‌పై ఉన్న ఏపీని కేంద్రం సహకారంతో బెడ్ మీదకు తీసుకువచ్చారని... కానీ ఇంకా ఏపీ పేషెంట్ గానే ఉందనేది వాస్తవమని తెలిపారు. అమరావతి, పోలవరం నిర్మాణానికి నిధులు ఇచ్చిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుతో ఉక్కు కర్మాగారం నిర్మాణం జరిగిందని చెప్పారు. ఇప్పుడు రూ.11,440 కోట్లు ఇచ్చి కేంద్రం ఊపిరి పోసిందని తెలిపారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చేశామని... గోదావరి పెన్నా, పోలవరం- బనకచర్లను అనుసంధానం చేసేలా కేంద్రం సహకారం కోరుతున్నామని అన్నారు. సోలార్ పవర్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పారు. అమిత్ షా సూచనలతో, సహకారంతో ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఎన్టీఆర్‌ఎఫ్ సేవలు మనకు ఎంతో ముఖ్యం: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
దక్షిణ భారతదేశ డిజార్డర్స్ మేనేజ్మెంట్ కార్యాలయం ఇక్కడ నిర్మించడం ఆనందంగా ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. హోంమంత్రి అమిత్ షా, ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. లక్షా యాభై వేల మందికి పైగా ప్రజల ప్రాణాలను కాపాడారని చెప్పారు. ఏడు వేల మృతదేహాలను తమ కుటుంబాలకు అప్పగించారన్నారు. 19,368 మూగ జీవాలను కాపాడారని చెప్పారు. ఎన్టీఆర్‌ఎఫ్ సేవలు మనకు ఎంతో ముఖ్యమైనవని అన్నారు. ఎల్జీ ఫార్మా ప్రమాదం, విజయవాడలో వరదల సమయంలో వారు ఎన్నో సేవలు అందించారన్నారు. ప్రకృతి విపత్తులు, భారీ ప్రమాదాల సమయంలో NDRF టీం ధైర్యసాహసాలతో ప్రజల ప్రాణాలు కాపాడుతున్నాయని అన్నారు. తుఫాన్, భూపకంపం, సునామీ వంటి ప్రమాదాల సమయంలో వారు ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రజలను రక్షించారని తెలిపారు.సీఎం చంద్రబాబు స్థలం ఇచ్చి.. నిర్మాణానికి సహకారం ఇచ్చారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం మళ్లీ వస్తే విపత్తు ఎలా ఉండేదో అందరూ చూసేవారని పవన్ కల్యాణ్ తెలిపారు.
గతంలో ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రజలను ఆ విపత్తు నుంచి కాపాడేలా కూటమి పార్టీలు కలిసి పని చేశాయన్నారు. అటువంటి విపత్తు రాష్ట్రానికి రాకూడదని మోదీ, అమిత్ షా సూచనలు, సహకారంతో ముందుకు సాగామని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పంచాయతీల స్థాయిలో కూడా విపత్తులను ఎదుర్కొనేలా ప్రజల భాగస్వామ్యం ఉండాలన్నారు. అమిత్ షా చెప్పిన ఈ సూచనలను తాము గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేస్తున్నామని అన్నారు. ప్రజలు కూడా బాధ్యతతో అవసరమైన సమయంలో సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.