Elections in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
ABN , Publish Date - Feb 24 , 2025 | 03:27 PM
Elections in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికల నగరా మోగింది. పది స్థానాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఖరారు చేసింది. అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను వచ్చే మాసంలో విడుదల చేయనుంది. ఆ మాసాంతానికి ఈ ఎన్నికల క్రతువును సీఈసీ ముగించనుంది.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ను సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఐదు, తెలంగాణలో ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ క్రమంలో మార్చి 3వ తేదీన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. నామినేషన్ దాఖలకు మార్చి 10వ తేదీ ఆఖరుగా నిర్ణయించారు. అలాగే మార్చి 11వ తేదీన దాఖలైన నామినేషన్లను పరిశీలిస్తారు. అయితే నామినేషన్లు ఉపసంహరణకు గడువు మార్చి 13వ తేదీగా నిర్ణయించింది.
మార్చి 20వ తేదీ ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5.00 గంటలకు ఓట్ల లెక్కింపు.. అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియ మార్చి 24వ తేదీతో ముగియనుంది.
ఇక ఈ ఏడాది మార్చి 29వ తేదీతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన పలువురు ఎమ్మెల్సీల పదవి కాలం ముగియనుంది. అంటే.. ఆంధ్రప్రదేశ్‌లో జంగా కృష్ణమూర్తి, దువ్వరపు రామారావు, పరుచూరి అశోక్ బాబు, బి. తిరుమల నాయుడు, యనమల రామకృష్ణుడుతోపాటు తెలంగాణలో మహబూబ్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, మల్లేశం ఎగ్గే, మిర్జా రియాజుల్ హసన్‌ల పదవీ కాలం ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం కేంద్ర ఎన్నికల సంఘానికి అనివార్యమైంది.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో చెరో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. పట్టభద్రుల కోటాలో జరుగుతోన్న ఈ ఎన్నికల్లో బరిలో దిగిన అభ్యర్థులు ఇప్పటికే తన ప్రచారంలో దూసుకు పోతున్నారు. ఈ ఎన్నికల ఓట్లను మార్చి 3వ తేదీన లెక్కించనున్నారు. అదే రోజు ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికల నగరా మోగింది. పది స్థానాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఖరారు చేసింది. అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను వచ్చే మాసంలో విడుదల చేయనుంది. ఆ మాసాంతానికి ఈ ఎన్నికల క్రతువును సీఈసీ ముగించనుంది.
మరోవైపు గతేడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిలోని మూడు పార్టీలు మొత్తం164 అసెంబ్లీ స్థానాలకు గెలుచుకున్నాయి. వైసీపీకి కేవలం11 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటాలో జరిగే ఐదు ఎమ్మెల్సీ స్థానాలను కూటమి ఖాతాలో పడనున్నాయి. అలాగే తెలంగాణలో సైతం కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది.
దీంతో రేవంత్ సారథ్యంలో ప్రభుత్వం కొలువు తీరింది. ఇక ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ కొన్ని స్థానాలను గెలుచుకొన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల జరిగితే ఐదు స్థానాల్లో మూడు లేదా నాలుగు స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడతాయి. ఇక ఒక స్థానం బీఆర్ఎస్ పరమయ్యే అవకాశాలున్నాయన్నది సుస్పష్టం.
For Andhra Pradesh News And Telugu News