Share News

Nadendla Manohar: పవన్‌పై నోరు పారేసుకుంటే సహించం

ABN , Publish Date - Mar 02 , 2025 | 03:26 AM

అధినేత పవన్‌కల్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని, అలా మాట్లాడినందుకే ఒక వ్యక్తి జైల్లో ఉన్నారని జనసేన పీఏసీ చైర్మన్‌, మంత్రి నాదెండ్ల మనోహర్‌ హెచ్చరించారు.

 Nadendla Manohar: పవన్‌పై నోరు పారేసుకుంటే సహించం

  • అలా మాట్లాడినందుకే ఒకరు జైల్లో ఉన్నారు

  • పవన్‌ది మానవత్వం, నిజాయితీతో కూడిన ప్రయాణం

  • విమర్శించే హక్కు ఎవరికీ లేదు

  • జనసేన ఆవిర్భావ సభ సన్నాహక

  • సమావేశంలో మంత్రి నాదెండ్ల

కలెక్టరేట్‌(కాకినాడ), మార్చి 1(ఆంధ్రజ్యోతి): నోరుంది కదా అని తమ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని, అలా మాట్లాడినందుకే ఒక వ్యక్తి జైల్లో ఉన్నారని జనసేన పీఏసీ చైర్మన్‌, మంత్రి నాదెండ్ల మనోహర్‌ హెచ్చరించారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ ఈనెల 14న నిర్వహించనున్నారు. సభా వేదిక ఏర్పాటుకు శనివారం అక్కడ భూమి పూజ చేశారు. అంతకుముందు కాకినాడ కుళాయిచెరువు కళాక్షేత్రంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ 100శాతం స్ట్రైక్‌ రేట్‌తో గెలిచిన తర్వాత నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో యావత్‌ దేశం చూపు పిఠాపురం సభపై ఉందని, దీన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సభ నిర్వహణకు 14 కమిటీలు వేశామని, ఒకరితో ఒకరు సమన్వయం చేసుకోవాలని సూచించారు. పవన్‌కల్యాణ్‌ ప్రజాదరణను ఓర్చుకోలేక ఆయన్ను దూషించడం కొందరికి ఫ్యాషన్‌ అయిపోయిందని, ఇప్పుడు ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న వ్యక్తి కూడా ఎలా వ్యవహరిస్తున్నారో చూస్తున్నామని పరోక్షంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివా్‌సను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అతడికి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. 2014లో జనసేన స్థాపించినప్పటి నుంచి పవన్‌ సొంత రెక్కలతో పార్టీని ముందుకు నడిపారన్నారు. ఆయన ఎప్పుడూ రాజకీయలబ్ధి కోసం పనిచేయలేదని, మానవత్వం, నిజాయితీతో కూడిన ప్రయాణం మాత్రమే చేశారని, ఆయన్ను విమర్శించే హక్కు ఎవరకీ లేదన్నారు. అధినేత పవన్‌కల్యాణ్‌ను ఎవరైనా కించపరిచేలా మాట్లాడితే జనసైనికులు, వీరమహిళలు ఖండించాలన్నారు. దానికి ప్రజలు ఆమోదించే భాషనే ఉపయోగించాలని సూచించారు.


అందరినీ గుర్తిస్తారు..

కూటమిలో ఉన్న మూడు పార్టీలు సమానమేనని, కలిసికట్టుగా పనిచేస్తేనే ఇంతటి ఘనవిజయం సాధించామని చెప్పారు. పార్టీ గురించి పనిచేసిన అందరి గురించి పవన్‌కల్యాణ్‌కు తెలుసునని, సరైన సమయంలో ఇవ్వాల్సిన గుర్తింపు ఇస్తారని నాదెండ్ల తెలిపారు. సభ నిర్వహణకు ఇప్పటికే కమిటీలు ఏర్పాటు చేశామని, కమిటీలో పేర్లు లేకపోయినా ఆసక్తి ఉన్నవారు ఆ కమిటీలతో కలిసి పనిచేయవచ్చని సూచించారు. కమిటీల్లోని సభ్యులంతా సమన్వయంతో పనిచేసి పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో 14న జరిగే జనసేన పార్టీ ఆవిర్భావసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి కందుల దుర్గేష్‌ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు జనసేనపైనే ఉందన్నారు. నిష్కలంకమైన నాయకుడు పవన్‌కల్యాణ్‌ ఆలోచన ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. కాకినాడ ఎంపీ ఉదయ్‌శ్రీనివాస్‌, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ హరిప్రసాద్‌, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌, సహా జనసేన ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 02 , 2025 | 03:27 AM