Share News

Deputy CM Pawan Kalyan: అసెంబ్లీలో ప్రజా వాణీ వినిపిద్దాం

ABN , Publish Date - Feb 24 , 2025 | 03:21 AM

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రజా సమస్యలతో పాటు వారి ఆకాంక్షలను చట్టసభలో వినిపించేలా పార్టీ సభ్యులు చర్చల్లో పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు.

Deputy CM Pawan Kalyan: అసెంబ్లీలో ప్రజా వాణీ వినిపిద్దాం

  • పార్టీ సభ్యులు చర్చల్లో చురుగ్గా పాల్గొనాలి

  • సభలో మాట్లాడే భాష హుందాగా ఉండాలి

  • జనసేన ఎమ్మెల్యేలకు పవన్‌ దిశానిర్దేశం

అమరావతి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ సమావేశాల్లో జనసేన సామాన్యుడి గొంతుగా ఉండాలని ఆ పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రజా సమస్యలతో పాటు వారి ఆకాంక్షలను చట్టసభలో వినిపించేలా పార్టీ సభ్యులు చర్చల్లో పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు. బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభాపక్ష సమావేశం జరిగింది. పవన్‌ మాట్లాడుతూ శాసనసభ సంప్రదాయాలు, మర్యాదను కాపాడుతూ హూందాగా వ్యవహరిద్దామని చెప్పారు. చట్టసభల్లో మాట్లాడే భాష, వాడే పదాల విషయంలో సభ్యులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వైసీపీ వాడిన దిగజారుడు భాష వద్దన్నారు. వైసీపీ సభ్యులు అసభ్య పదజాలంతో రెచ్చగొట్టినా సంయమనం పాటించాలన్నారు. భాష విషయంలో నాదెండ్ల మనోహర్‌, మండలి బుద్దప్రసాద్‌, హరిప్రసాద్‌ మార్గనిర్దేశం చేయాలన్నారు. అసెంబ్లీలో ప్రతి నిమిషం ఎంతో విలువైందని, ప్రజలకు సంబంధించిన అంశాలను జీరో అవర్‌, ప్రశ్నోత్తరాల సమయంలో లేవనెత్తాలని పవన్‌ సూచించారు. బడ్జెట్‌ను అధ్యయనం చేయాలన్నారు. ప్రభుత్వ రాబడులు, ఖర్చులు, శాఖల వారీగా కేటాయింపులు, అప్పులు ఇతరత్రా అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుని, రాష్ట్రవ్యాప్తంగా ఆ తరహా సమస్యలను క్రోడీకరించి మాట్లాడాలన్నారు. దాని వల్ల ప్రతి సభ్యుడి గొంతు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ అర్థమవుతుందన్నారు. ఈ సమావేశంలో పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పాల్గొన్నారు. అంతకు ముందుగా పార్టీ పీఏసీ చైర్మన్‌, పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ స్వాగత ఉపన్యాసం చేశారు.

Updated Date - Feb 24 , 2025 | 03:21 AM