Amith Shah: ఢిల్లీ బయలుదేరి వెళ్లిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా
ABN , Publish Date - Jan 19 , 2025 | 03:11 PM
Amit Shah: ఆంధ్రప్రదేశ్‌లో పర్యటన ముగించుకొని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం మధ్యాహ్నం న్యూఢిల్లీ బయలుదేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ వీడ్కోలు పలికారు.

అమరావతి, జనవరి 19: ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజులు పర్యటన ముగించుకొని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆదివారం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేంద్ర మంత్రి అమిత్ షా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అంతకుముందు గన్నవరం విమానాశ్రయంలో అమిత్ షాకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులతోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నేరుగా సీఎం చంద్రబాబు నివాసానికి..
ఏపీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి అమిత్ షా శనివారం రాత్రి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి అమిత్ షా వెళ్లారు. సీఎం చంద్రబాబు నివాసంలో ఇచ్చిన విందుకు అమిత్ షా హజరయ్యారు. ఈ విందులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితోపాటు కూటమిలోని పార్టీలకు చెందిన పలువురు సీనియరు నేతలు పాల్గొనున్నారు. ఈ విందు అనంతరం తిరిగి రాత్రి 10:30 గంటలకు విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్‌కు హోం మంత్రి చేరుకున్నారు. రాత్రి ఆయన అక్కడే బస చేశారు.
ఆదివారం బిజీ బిజీ..
ఇక ఆదివారం ఉదయం రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. ఆ తర్వాత కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరులోని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 10వ బెటాలియన్ కార్యాలయం కొత్త క్యాంపస్‌తోపాటు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సౌత్ క్యాంపస్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోపాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పలు అంశాలపై అమిత్ షా ఆరా..
ఈ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి అమిత్ షా.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోపాటు ఐటీ మంత్రి నారా లోకేష్‌తో చర్చించారు. అంతర్రాష్ట నది జలాల వివాదాలు ఏమైనా ఉన్నాయా అంటూ ఆరా తీశారు. అలాగే వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. ప్రజల మధ్యకు వస్తున్నారా?, ఆయన ప్యాలెస్‌లకు సంబంధించిన విషయాలను సైతం కేంద్ర మంత్రి అమిత్ షా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 11,400 కోట్లను కేంద్రం ప్రకటించింది. ఆ మరునాడే కేంద్ర మంత్రి అమిత్ షా.. అమరావతికి రావడం ప్రాధాన్యత సంతరించుకొంది.
For AndhraPradesh News And Telugu News