Arvind Kejriwal: ఢిల్లీ ఫలితాలను శాసించిన మిడిల్ క్లాస్.. ఇదీ కామన్ మ్యాన్ పవర్
ABN , Publish Date - Feb 08 , 2025 | 02:44 PM
Delhi Assembly Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే జరిగింది. ఫలితాల్లో బీజేపీ దూకుడుకు అడ్డే లేకుండా పోయింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి.

అరవింద్ కేజ్రీవాల్.. దేశ రాజకీయాల్లో ఈ పేరు ఒక సంచలనం. అవినీతికి వ్యతిరేకంగా జన్‌లోక్‌పాల్ వ్వవస్థను తీసుకురావాలని గాంధేయవాది అన్నా హజారే చేసిన దీక్షతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించారు కేజ్రీవాల్. మధ్యతరగతికి ప్రతిబింబంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన.. అన్నా హజారే ఉద్యమంతో ఎదిగి ఆ తర్వాత ఆప్‌ను నెలకొల్పి ఢిల్లీ గద్దెనెక్కారు. కామన్ మ్యాన్ ప్రోత్సాహంతో సింహాసనాన్ని అధిష్టించిన కేజ్రీవాల్.. ఇప్పుడు వాళ్లు కొట్టిన దెబ్బకు తల్లడిల్లుతున్నారు. తాజా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈ మాజీ సీఎం దారుణ ఓటమిని మూటగట్టుకున్నారు.
అవినీతికి కేరాఫ్ అడ్రస్!
ఢిల్లీలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువ. దేశం నలుమూలల నుంచి వచ్చిన మిడిల్ క్లాస్ జనాల్లో చైతన్యం కూడా ఎక్కువే. అందుకే మార్పుకు శ్రీకారం చుడతారు, తమ జీవితాలు మారుస్తారనే నమ్మకంతో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్‌కు మద్దతుగా నిలిచారు. కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఆప్ జాతీయ కన్వీనర్ పూర్తిగా విఫలమయ్యారు. అవినీతిని నిర్మూలిస్తారని అనుకుంటే అదే ఆరోపణలతో పరువు పోగొట్టుకున్నారు. లిక్కర్ స్కామ్‌తో ఏకంగా జైలుకు వెళ్లొచ్చారు. కేజ్రీవాల్‌తో పాటు ఆప్ ముఖ్య నేతలు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ కూడా కటకటాల పాలయ్యారు. దీనికి తోడు ఢిల్లీ సీఎం అధికార నివాసానికి సుమారుగా రూ.33 కోట్ల ప్రజాధనంతో మరమ్మతులు చేపట్టినట్లు కాగ్ నివేదికలో తేలింది. ఇవన్నీ చూసిన ప్రజలు తట్టుకోలేకపోయారు.
అంతా రివర్స్!
మార్పు తీసుకొస్తారని భావిస్తే ఢిల్లీని మరింత అగాథంలోకి కేజ్రీవాల్ నెట్టేశారనే భావన ప్రజల్లో పెరిగిపోయింది. అవినీతిని అంతమొందిస్తాడని భావిస్తే అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోవడం, జైలు పాలవడం, గెలుపు కోసం సాధ్యం కాని అడ్డగోలు హామీలు ఇవ్వడం, విశ్వసనీయత కోల్పోవడం, లెఫ్టినెంట్ గవర్నర్‌తో వరుస వివాదాలు, యమునా నది ప్రక్షాళన చేయకపోవడం, వాతావరణ కాలుష్యం పెరగడం లాంటివన్నీ కేజ్రీవాల్ మీద ప్రజల్లో వ్యతిరేకత పెరిగేలా చేశాయి. దీంతో ఇన్నాళ్లూ ఆప్‌కు సపోర్ట్‌గా ఉన్న మధ్యతరగతి ప్రజలు ఒక్కసారిగా రివర్స్ అయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలిపారు. అందుకే ఆ పార్టీ 27 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. కేజ్రీవాల్‌తో సహా జైలుకు వెళ్లొచ్చిన ఆప్ నేతలను మధ్యతరగతి ప్రజలు ఓడించారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఢిల్లీ జనాభాలో 40 శాతం ఉన్న మిడిల్ క్లాస్ ప్రజలు కొట్టిన దెబ్బ నుంచి కేజ్రీవాల్ కోలుకోవడం అసాధ్యమనే కామెంట్స్ వస్తున్నాయి.
ఇవీ చదవండి:
కేజ్రీవాల్‌కు చుక్కలు చూపించిన పర్వేష్.. ఇంతకీ ఎవరీయన..
షీష్ మహల్ టూ లిక్కర్ కేస్.. ఆప్ ఓటమికి ప్రధాన కారణాలు
'ఆమ్ ఆద్మీని గెలిపించే బాధ్యత కాంగ్రెస్‌పై లేదు'
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి