Union Budget 2025 : గిగ్ వర్కర్లు, వీధివ్యాపారులకు గుడ్ న్యూస్.. ఐడీ కార్డులు.. అదనంగా ఈ ప్రయోజనాలు..
ABN , Publish Date - Feb 01 , 2025 | 03:36 PM
గిగ్ వర్కర్ల, వీధివ్యాపారులకు ఆసరా కల్పించే దిశగా ఈ రోజు (ఫిబ్రవరి 1) ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఐడీ కార్డు సహా అదనంగా ఈ హామీలు కల్పిస్తూ వారిపై వరాల జల్లు కురిపించారు..

గిగ్ వర్కర్లు, వీధివ్యాపారులకు ఇక నుంచి మంచి రోజులు రానున్నాయి. ఈ రోజు (ఫిబ్రవరి 1) బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వారిపై వరాల జల్లు కురిపించారు. భారతదేశంలో దాదాపు కోటి మంది గిగ్ వర్కర్లు పనిచేస్తున్నట్లు అంచనా. స్విగ్గీ, జొమాటో, అమెజాన్, బ్లంకిట్ లాంటి డెలివరీ సంస్థల కోసం ఎండనక, వాననక కష్టడుతుంటారు గిగ్ వర్కర్లు. ప్రజలకు సమయానికి ఆర్డర్లు చేరవేస్తూ విశేష సేవలందిస్తున్నా వీరికి కార్మికులకు ఉన్నట్టుగా ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. తాత్కాలిక ప్రాతిపదికన పనిచేయడం వల్ల వీరిని ఉద్యోగులుగా పరిగణించరు. అందుకే ప్రభుత్వపరంగా ఇన్నాళ్లూ ఎలాంటి ప్రయోజనాలు దక్కలేదు. ఆన్‌లైన్ ఫుడ్, షాపింగ్, గ్రాసరీ డెలివరీల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఈ-మార్కెటింగ్ అభివృద్ధికి పాటుపడుతున్న గిగ్ వర్కర్ల కష్టాలు తీరేలా కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
2020లో మొదటిసారి కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ కింద గిగ్ కార్మికులను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించినట్లు బడ్జెట్ ప్రసంగంలో గుర్తుచేశారు నిర్మలా సీతారామన్. వీరికి సామాజిక భద్రత, సంక్షేమ ప్రయోజనాలు చేకూర్చేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ ప్రకారం గిగ్ వర్కర్లకు వైకల్యం, ఆరోగ్యం, ప్రసూతి ప్రయోజనాలు, ప్రమాద బీమా,వృద్ధాప్యంలో రక్షణ సహా అనేక ప్రయోజనాలు దక్కనున్నాయి. పీఎం ఆరోగ్య యోజన కింద గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా కల్పించనున్నారు.
గిగ్ వర్కర్లు, వీధివ్యాపారులకు ఐడీ కార్డులు జారీ..
గిగ్ వర్కర్లు, వీధివ్యాపారుల సంక్షేమం కోసం ఈ సారి బడ్జెట్‌లో ప్రత్యేక చోటు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఆరోగ్య సంరక్షణ, ఇతర సామాజిక భద్రతా ప్రయోజనాలను పొందేందుకు వీలుగా కొత్తగా సంక్షేమ పథకం ప్రతిపాదించింది. ఇందుకోసం గుర్తింపు కార్డులు జారీ చేయనుంది. పట్టణాలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలలో పనిచేసే గిగ్ కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా ఈ ఐడీ కార్డులు కోసం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
క్రెడిక్ కార్డు కూడా..
పీఎం స్వానిధి (PM SVANIdhi) పథకంలో పలు మార్పులు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. వీధి వ్యాపారులకు ప్రోత్సాహం అందించేందుకు రూ.30,000 పరిమితితో యూపీఐ లింక్ ఆధారిత క్రెడిట్ కార్డులు ప్రవేశపెట్టింది. వీరికి మెరుగైన బ్యాంకు రుణాల జారీ, ఆర్థిక స్థితిని పెంపొందించేలా చర్యలు తీసుకోనుంది.