Supreme Court: నేర చరితులపై జీవితకాల నిషేధం..
ABN , Publish Date - Feb 27 , 2025 | 05:22 AM
కోర్టుల్లో శిక్షలు పడి, నేరచరితులుగా ఉన్న చట్ట సభ్యులపై జీవితకాల నిషేధం విధించాలా? వద్దా? అనే అంశం పూర్తిగా పార్లమెంట్ పరిధిలోనిదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

పార్లమెంట్ పరిధిలోని అంశం
న్యాయ సమీక్ష పరిధిలో ఉండదు
సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్
న్యాయ సమీక్ష పరిధిలో ఉండదు: కేంద్రం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: కోర్టుల్లో శిక్షలు పడి, నేరచరితులుగా ఉన్న చట్ట సభ్యులపై జీవితకాల నిషేధం విధించాలా? వద్దా? అనే అంశం పూర్తిగా పార్లమెంట్ పరిధిలోనిదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ వేసిన పిటిషన్‌పై కేంద్రం ఈ మేరకు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. ఈ పిటిషన్‌పై ఈనెల 10న విచారణ జరగ్గా.. కేంద్రాన్ని, భారత ఎన్నికల సంఘాన్ని(ఈసీఐ) అఫిడవిట్ సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్లు 8, 9 రాజ్యాంగ చెల్లుబాటుపై స్పందన తెలియజేయాలని సూచించింది. దీనిపై అఫిడవిట్ సమర్పించిన కేంద్రం.. వివిధ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నేతలపై జీవితకాలం నిషేధం విధించాలనే అభ్యర్థనను కేంద్రం వ్యతిరేకించింది. ‘‘ఇలాంటి అంశాల్లో నిర్ణయాధికారం పూర్తిగా పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలు కూడా విస్తృత కోణాలను కలిగి ఉన్నాయి. జీవితకాల నిషేధం సరైందా? లేదా? అనే ప్రశ్న కూడా పార్లమెంట్ పరిధిలోకే వస్తుంది. ఈ తరహా అంశాలు న్యాయ సమీక్ష పరిధిలోకి రావు’’ అని స్పష్టం చేసింది. కాగా.. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 8(1) ప్రకారం.. చట్టసభ సభ్యులు దోషులుగా తేలినప్పటి నుంచి ఆరేళ్లపాటు వారిపై ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఉంటుంది.