Delhi Election Results: సీఎం రేసులో పర్వేష్ వర్మ
ABN , Publish Date - Feb 08 , 2025 | 04:25 PM
ఎన్నికల వ్యూహంలో భాగంగా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది బీజేపీ ముందుగా ప్రకటించలేదు. బీజేపీకి సీఎం అభ్యర్థి లేడని, ఓటమిని ముందే అంగీకరించిందని 'ఆప్' విమర్శలు గుప్పించినా బీజేపీ తమ వ్యూహం ప్రకారమే ముందుకు వెళ్లింది.

న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నిజం చేస్తూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించడం ద్వారా లోక్‌సభ మాజీ సభ్యుడు., బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ (Parvesh Verma) 'జెయింట్ కిల్లర్'గా నిలిచారు. తద్వారా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో మొదటి స్థానంలో నిలిచారు. గెలుపుపై తిరుగులేని ధీమాతో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌ను 4,089 ఓట్ల తేడాతో వర్మ ఓడించారు. ఇదే స్థానంలో పోటీ చేసిన మాజీ సీఎం షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ కేవలం 4,568 ఓట్లకే పరిమితమయ్యారు. కేజ్రీవాల్‌ను ఓడించడం ద్వారా పర్వేష్ వర్మ సీఎం రేసులో మొదటి స్థానంలో నిలిచారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Delhi Election Results: అభివృద్ధి, సుపరిపాలనే గెలిచింది.. ఢిల్లీ గెలుపుపై ప్రధాని మోదీ..
ఎన్నికల వ్యూహంలో భాగంగా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది బీజేపీ ముందుగా ప్రకటించలేదు. బీజేపీకి సీఎం అభ్యర్థి లేడని, ఓటమిని ముందే అంగీకరించిందని 'ఆప్' విమర్శలు గుప్పించినా బీజేపీ తమ వ్యూహం ప్రకారమే ముందుకు వెళ్లింది. సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా ఎన్నికలకు వెళ్లినప్పటికీ బీజేపీ ఘనవిజయం సాధించడంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాం ఫలించిందని స్పష్టమవుతోంది.
వర్మకు కలిసొచ్చే అంశాలివే...
బీజేపీ కొత్త సీఎంగా పర్వేష్ వర్మకు బీజేపీ పగ్గాలు అప్పగించే విషయంపై బీజేపీ అధికారికంగా ప్రకటించనప్పటికీ ఆయనకు కలిసొచ్చే అంశాలు చాలానే ఉన్నాయి. బీజేపీకి అతిపెద్ద సవాలుగా ఉన్న కేజ్రీవాల్‌ను ఓడించడం ద్వారా పర్వేష్ వర్మ "జెయింట్ కిల్లర్''గా నిలిచారు. జాట్ ఫేక్టర్ కూడా ఆయనకు కలిసొచ్చే మరో అంశంగా చెప్పవచ్చు. న్యూఢిల్లీ నియోజవర్గం జాట్ ఆధిపత్యం ఉన్న సీటు కానప్పటికీ జాట్ వర్గాన్ని బీజేపీ నిర్లక్ష్యం చేస్తోందని తరచు ఆప్ విమర్శలు గుప్పిస్తూ వచ్చేది. ఇందుకు ప్రతిగా జాట్ నేత వర్మనే బీజేపీ ఇక్కడ నిలబెట్టింది. ఆప్‌కు ఓట్ బ్యాంక్‌గా ఉన్న జాట్లను ఆకర్షించడం, ఆప్ ఓట్ బ్యాంక్‌ను దెబ్బకొట్టడంలో బీజేపీ ఈసారి విజయం సాధించింది. కరడుగట్టిన హిందూవాదిగా వర్మకు పేరుంది. హిందుత్వకు సంబంధించిన అంశాలపై అనర్ఘళంగా మాట్లాడుతుంటారు. ముస్లింలను బుజ్జగించడం, ఢిల్లీలో అక్రమంగా ముస్లిం బంగ్లాదేశీయులు తిష్ట వేసిన అంశాలను ఎండగట్టడంలో ఆయన ముందున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో దక్కని టిక్కెట్
పర్వేష్ వర్మకు 2025 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్ ఇవ్వలేదు. పార్టీ నిర్ణయాన్ని ఆయన శిరసావహించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ప్రధానంగా దృష్టి సారిస్తూ వచ్చారు. కేజ్రీవాల్ ప్రతిష్టకు గండికొట్టిన 'శీష్ మహల్' వివాదాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లడంలో వర్మ సమర్ధవంతగా వ్యవహరించారు. వీటికి తోడు.. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు కావడం పర్వేష్ వర్మకు కలిసొచ్చే మరో అంశం. పార్టీకి మొదట్నించి సాహిబ్ సింగ్ వర్మ పనిచేయడం, పార్టీ సీనియర్ నేతలందరితోనూ పర్వేష్ వర్మ సత్సంబంధాలు కలిగి ఉండటం విశేషం.
Also Read:
ఢిల్లీ సీఎం అతడే..అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు..
ఢిల్లీ ఫలితాల్లో బిగ్ ట్విస్ట్
For More National News and Telugu News..