AAP-Congress: ఆప్ కొంపముంచిన కాంగ్రెస్.. బీజేపీకి అప్పనంగా అధికారం
ABN , Publish Date - Feb 08 , 2025 | 12:24 PM
Delhi Assembly Election 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని ట్విస్ట్ ఏర్పడింది. ఒక్కసారిగా లెక్కలు మారిపోయాయి. అసలు ఏం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం..

కలసి ఉంటే కలదు సుఖం.. ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలమని పెద్దలు ఊరికే అనలేదు. రాజకీయాల్లోనూ ఈ సూత్రం వర్తిస్తుంది. ఎక్కువ పార్టీలు పోటీ చేసిన చోట, టఫ్ ఫైట్ ఉన్న సందర్భాల్లో కలిసొచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకోవడం, కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం రాజకీయాల్లో బెనిఫిట్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పొత్తు ధర్మం పాటిస్తూ సంకీర్ణ ప్రభుత్వాలు సుదీర్ఘంగా పాలించిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అదే సమయంలో పొత్తులు పెట్టుకోకుండా సింగిల్‌గా వెళ్లి తీవ్ర పోటీలో చిత్తయిన ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్-ఆప్ పరిస్థితి అలాగే ఉంది.
ఓట్ షేరింగ్!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు కాంగ్రెస్ బోల్తా కొట్టింది. ఆప్ అయినా బీజేపీకి టఫ్ ఫైట్ ఇస్తోంది. పోటాపోటీగా ఆధిక్యాలు సాధిస్తూ ముందుకు వెళ్తోంది. అయితే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే 45కు పైగా సీట్లలో ఆధిక్యంలో ఉన్న బీజేపీ సర్కారును ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అటు కాంగ్రెస్ చూసుకుంటే.. కనీసం ఒక్క సీటులోనూ ఆధిక్యంలో లేదు. హస్తం పార్టీ వైట్‌వాష్ నుంచి తప్పిచుకోవడం కష్టంగా ఉంది. అయితే బీజేపీ పవర్ గేమ్‌లో ముందంజలో ఉండటానికి ఒకరకంగా కాంగ్రెస్-ఆప్ కారణమని చెప్పాలి. ఓటు షేరింగే దీనికి బిగ్ ఎగ్జాంపుల్.
స్వయం కృతాపరాధం!
ఢిల్లీ ఫలితాల్లో దాదాపు సగం ఓట్ల లెక్కింపు పూర్తయిందని తెలుస్తోంది. ఇప్పటివరకు చూసుకుంటే.. ఆప్ 43 శాతం ఓట్లు దక్కించుకుంది. బీజేపీ 48 శాతం ఓట్లను కొల్లగొట్టింది. అదే కాంగ్రెస్‌కు 6.7 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. ఒకవేళ ఆప్-కాంగ్రెస్ ఎన్నికల్లో కలసి పోటీ చేసి ఉంటే అప్పుడు వారి ఓటింగ్ శాతం 49.7గా ఉండేది. వేర్వేరుగా పోటీ చేయడం, ఒకరిపై ఒకరు విమర్శలతో దుమ్మెత్తి పోయడం నెగెటివ్‌గా మారింది. ఆప్‌తో కాంగ్రెస్ కలిసొస్తే బాగా హెల్ప్ అయ్యేది. కానీ ఒంటరిగా పోటీ చేయడం ఇరు పార్టీలను దెబ్బతీసింది. కాంగ్రెస్ అయితే ఆప్ కొంపముంచింది. చాలా చోట్ల ఆ పార్టీ లీడ్ తగ్గడంలో హస్తం పార్టీదే కీలకపాత్ర. ఆప్-కాంగ్రెస్ అప్పనంగా బీజేపీకి అధికారాన్ని అప్పగించాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కూటమిగా ఏర్పడితే ఫలితాలు వేరేలా ఉండేవని కామెంట్స్ చేస్తున్నారు.
ఇదీ చదవండి:
ఢిల్లీ ఫలితాల్లో బిగ్ ట్విస్ట్
ఎస్సీ, ముస్లిం నియోజకవర్గాల్లో బీజేపీకి లీడ్.. అసలు కారణం
కాంగ్రెస్ వైట్‌వాష్.. ఇది ఊహించలేదు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి