Mallikarjun Kharge: గంగలో మునిగితే పేదరికం పోతుందా?.. ఖర్గే వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్
ABN , Publish Date - Jan 27 , 2025 | 08:43 PM
భగవంతుడిని ప్రతి ఒక్కరూ నమ్మతారని, ప్రజలు ప్రతిరోజూ ఇళ్లలో పూజలు చేస్తామని, ఇంట్లో పూజ పూర్తయిన తర్వాతే మహిళలు బయటకు వెళ్తుంటారని ఖర్గే అన్నారు. అయితే మతం పేరుతో పేద ప్రజల వంచన కూడదని, ఇలాంటి వారి వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం చేకూరదని బీజేపీని విమర్శించారు.

మహూ: భారతీయ జనతా పార్టీ నేతలు ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో పవిత్ర స్నానాలకు పోటీ పడుతుండటంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) పరోక్షంగా విసుర్లు విసిరారు. ''గంగలో మునిగితే పేదరికం పోతుందా?'' అని ప్రశ్నించారు. బీఆర్ అంబేద్కర్ జన్మస్థలమైన మధ్యప్రదేశ్‌లోని మహూ వేదికగా ''జై బాపు, జై భీమ్, జై సంవిధాన్'' పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఖర్గే మాట్లాడారు.
Mahakumbh: త్రివేణి సంగమంలో అమిత్‌షా పవిత్ర స్నానం
''నరేంద్ర మోదీ తప్పుడు వాగ్దానాల వలలో పడకండి. గంగానదిలో స్నానం చేస్తే పేదరికం అంతమవుతుందా? నేను ఎవరి మనోభావాలను ప్రశ్నించడం లేదు. ఎవరికైనా అభ్యంతరకరమని అనిపిస్తే క్షమాపణ చెప్పుకుంటున్నాను'' అని ఖర్గే అన్నారు. అయితే తాను ఒకటి అడుగుతానని, ఒక పిల్లవాడు ఆకలితో చనిపోతే, స్కూలుకు వెళ్లలేకపోతే, కూలీలకు బకాయిలు అందకపోతే, అదే సమయంలో ఈ వ్యక్తులు వేలాది రూపాయలు ఖర్చుచేస్తూ, పవిత్ర స్నానాల పేరుతో పోటీపోటీగా మునకలు (గంగానదిలో) వేయడాన్నే తాను ప్రశ్నిస్తు్న్నానని చెప్పారు. ''కెమెరాల్లో బాగా కనిపించేంత వరకూ వాళ్లు స్నానాలు చేస్తుంటారు'' అని పరోక్షంగా బీజేపీ నేతలపై విసుర్లు విసిసారు. ఆసక్తికరంగా, హోం మంత్రి అమిత్‌షా త్రివేణి సంగమంలో సోమవారంనాడు పవిత్ర స్నానం చేశారు.
భగవంతుడిని ప్రతి ఒక్కరూ నమ్మతారని, ప్రజలు ప్రతిరోజూ ఇళ్లలో పూజలు చేస్తామని, ఇంట్లో పూజ పూర్తయిన తర్వాతే మహిళలు బయటకు వెళ్తుంటారని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ఖర్గే చెప్పారు. అయితే మతం పేరుతో పేద ప్రజల వంచన కూడదని, ఇలాంటి వారి వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం చేకూరదని ఖర్గే నిశితంగా విమర్శించారు. ''మోదీ, అమిత్‌షాలు చాలా పాపాలు మూటకట్టుకున్నారు. ఏడు జన్మలు ఎత్తడం కాదు, 100 జన్మలెత్తినా వాళ్లు స్వర్గానికి పోలేరు'' అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
సనాతన వ్యతిరేక వ్యాఖ్యలంటూ బీజేపీ కౌంటర్
ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర వెంటనే స్పందించారు. సనాతన ధర్మ వ్యతిరేక ఐడియాలజీ ఎందుకు వ్యవహరిస్తున్నారో రాహుల్ గాంధీ, ఖర్గే సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. సనాతన్‌కు వ్యతిరేకంగా ఖర్గే మాట్లాడటం ఇదే మొదటిసారి కాదని పేర్కొన్నారు. ''తాము అధికారంలోకి వస్తే సనాతన్‌కు చరమగీతం పాడతామని అంతకుముందు ఖర్గే చెప్పారు. రాహుల్ గాంధీ ఇటలీ వెళ్లి అక్కడ మునకలు (Dip) వేయవచ్చు. మాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ గంగామాతపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం సరైనది కాదు'' అని సంబిత్ పాత్ర హితవు పలికారు.
Sanatan Vedic Nation : సనాతన వైదిక దేశమే లక్ష్యం
India IST Now : ఇక నుంచి భారత్‌లో.. వన్ టైమ్.. వన్ నేషన్..
Saif Ali Attack Case: ఉద్యోగం, పెళ్లి రెండూ పోయాయి.. దాడి అనుమానితుడి ఆవేదన
Read More National News and Latest Telugu News