Hyderabad Metro: మరిన్ని మెట్రో కొత్త కోచ్‌లు
ABN , Publish Date - Jan 09 , 2025 | 05:25 AM
మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టుకు అవసరమైన అదనపు కోచ్‌లను ప్రవేశపెట్టనున్నట్లు హైదరాబాద్ మెట్రో ఎండీఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
రద్దీకి తగ్గట్టుగా కొనుగోలు చేస్తాం
18 మాసాల తర్వాతే అవి పట్టాల పైకి
దేశీయంగా తయారీకి 3 కంపెనీలు ఓకే
100ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి హబ్స్
రెండో దశకు ఏప్రిల్ నాటికి టెండర్లు
మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్ సిటీ, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టుకు అవసరమైన అదనపు కోచ్‌లను ప్రవేశపెట్టనున్నట్లు హైదరాబాద్ మెట్రో ఎండీఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. వాటిని అందుబాటులోకి తీసుకురావడానికి 18 నెలల సమయం పడుతుందని, అప్పటి వరకు ఉన్న రైళ్లతోనే రద్దీగా ఉన్న కారిడార్‌లలో ఫ్రీక్వెన్సీ పెంచి నడుపుతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రోజూ 10 లక్షల మంది ప్రయాణించేందుకు అనుగుణమైన సంఖ్యలో కోచ్‌లను కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. బుధవారం ఎంజీబీఎస్ మెట్రో రైలు ఇంటర్‌చేంజ్ స్టేషన్‌లో ‘నా మెట్రోలో... నా సమయం’ ప్రచార కార్యక్రమాన్ని, 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి మెట్రో ఫెస్ట్‌లను ఎల్ అండ్ టీ మెట్రో రైలు సీఈఓ, ఎండీ కేవీబీ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతమున్న మెట్రో కోచ్‌లన్నీ సౌత్ కొరియాలోని హ్యూందయ్ రోటెమ్ కంపెనీ తయారు చేసిందని, అయితే వాటిని ఇక నుంచి మన దేశంలోనే తయారు చేసేందుకు మూడు కంపెనీలు ముందుకొచ్చాయని, వారితో ఇప్పటికే ప్రాథమికంగా చర్చలు జరిగాయని వెల్లడించారు.
ప్రస్తుతం రెండు డిపోల్లో ఉన్న మెట్రో రైళ్లతో ప్రతి రోజూ 7 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉందన్నారు. నాగోల్-రాయదుర్గం కారిడార్‌లోనే రద్దీ అత్యధికంగా ఉందని, ప్రస్తుతం రద్దీని తగ్గించేందుకు షార్ట్ లూప్ లో మెట్రో రైళ్లను నడుపుతున్నామని, వాటి సంఖ్యను కూడా పెంచుతామని తెలిపారు. 50-100 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి మెట్రో హబ్స్‌ను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. మేడ్చల్ మార్గంలో హెచ్‌ఎండీఏ ఎలివేటెడ్ కారిడార్లు, ఎన్‌హెచ్‌ఏఐ కొన్ని ప్లై ఓవర్లను నిర్మిస్తున్నదని, వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని, సమగ్ర ప్రణాళికతో నిర్మాణం చేపట్టాలని సీఎం సూచించారని చెప్పారు. రెండో దశ మెట్రో కింద ఇప్పటికే 5 మెట్రో కారిడార్‌లకు డీపీఆర్‌లను కేంద్ర ప్రభుత్వానికి పంపించామని, ఈ 5 కారిడార్‌లతో పాటు మరో 3 కారిడార్లకు సంబంధించిన డీపీఆర్‌లను సిద్ధం చేసి కేంద్రం నుంచి అనుమతులు తీసుకుంటే ఏప్రిల్ నాటికి టెండర్‌లు పిలిచేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారని వెల్లడించారు. అలాగే, ప్యారడైజ్-మేడ్చల్, జేబీఎ్‌స-శామీర్‌పేట కారిడార్‌లను కలిపి నిర్మించడం ద్వారా మెగా జంక్షన్‌గా ప్రణాళికలు సిద్ధం చేయాలని కూడా సీఎం సూచించారని తెలిపారు.