మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుకు ఊరట!
ABN , Publish Date - Feb 15 , 2025 | 04:47 AM
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ2గా ఉన్న మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావుకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది.

షరతులతో కూడిన బెయిలిచ్చిన నాంపల్లి కోర్టు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ2గా ఉన్న ప్రణీత్‌రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ2గా ఉన్న మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావుకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. మూడు రోజులుగా ఆయన బెయిలు పిటిషన్‌పై విచారణ జరుగుతుండగా శుక్రవారం కోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. రూ.లక్ష డిపాజిట్‌తో పాటు ఇద్దరి పూచీకత్తులను సమర్పించాలంటూ ఒకటో అదనపు జిల్లా కోర్టు జడ్జి రమాకాంత్ ఆదేశాలు జారీ చేశారు. పాస్‌పోర్టును కోర్టులో సమర్పించాలని, ప్రతి సోమవారం ఉదయం 11 గంటలకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
బెయిల్ షరతులను అతిక్రమించినట్లు తెలిస్తే వెంటనే రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ కేసులో ప్రణీత్‌రావు రిమాండ్ ఖైదీగా 11 నెలలుగా జైల్లో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ పోలీసు అధికారి ప్రభాకర్‌రావు, ఐన్యూస్ యజమాని శ్రవణ్‌రావుపై నాన్‌బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నందున వారిద్దరూ పరారీలో ఉన్నట్లుగా ప్రకటించాలని పోలీసులు పిటిషన్ వేశారు. వీరిద్దరూ కావాలనే తప్పించుకు తిరుగుతున్నారంటూ నాంపల్లిలోని 14వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.